సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో సిబ్బంది మరియు శిక్షణ శాఖ (డిఓపిటి) ఏర్పాటు చేసిన
ప్రత్యేక టీకా శిబిరాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
టీకా మోతాదులు వేయడంలో ఇండియా ప్రపంచంలోనే వేగవంతమైన దేశం అని ఆయన అన్నారు
Posted On:
15 JUN 2021 5:12PM by PIB Hyderabad
కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి) , ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు శక్తి, మరియు రోదసి శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మంగళవారం
ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో సిబ్బంది మరియు శిక్షణ శాఖ ఉద్యోగులు, అధికారులు మరియు వారి 18 సంవత్సరాలు పైబడిన కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టీకా శిబిరాన్ని సందర్శించారు. ఎలాంటి జాప్యం లేకుండా టీకా తీసుకోవడానికి వీలుగా ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, డిఓపిటి అధికారులు, సిబ్బంది సౌకర్యం కోసం ఈ ప్రత్యేక టీకా శిబిరం ఏర్పాటైందని, వారి సమయం వృధా కాకూడదనే దీనిని ఏర్పాటు చేశారని, అందువల్ల ఉద్యోగుల కుటుంబాలలో అర్హులందరూ వీలయినంత త్వరగా టీకాలు వేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
విధి నిర్వహణరీత్యా నిత్యం నార్త్ బ్లాక్ కార్యాలయ భవనానికి వచ్చే ఉద్యోగులకు ఇది అదనపు సౌకర్యం వంటిదని అన్నారు. తమకు పరిచయమున్న పరిసరాలలో టీకా వేయించుకోవడానికి ఉద్యోగులు వెనుకాడబోరని అయన అన్నారు. ఇంత మంచి పని చేపట్టిన డిఓపిటి పాత్రను మంత్రి ప్రశంసించారు.
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సౌకర్యం కోసం అన్ని మంత్రిత్వ శాఖలు / భారత ప్రభుత్వ విభాగాలలో ఇదే విధమైన శిబిరాలను ఏర్పాటు చేయాలని సలహా ఇవ్వడం జరిగింది. ఈ సౌకర్యాన్ని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంతో ఉపయోగించుకుంటున్నారని, దీనివల్ల దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో టీకాలు వేసే కార్యక్రమం వేగంగా జరుగుతోందని ఆయన అన్నారు. ఇప్పటివరకు 25 కోట్ల మందికి పైగా టీకాలు వేయడం జరిగిందని, ఇది ప్రపంచంలోనే వేగవంతమైన కార్యక్రమమని, అంతేకాక భిన్న సంస్కృతులు, 135 కోట్ల జనాభా ఉన్నప్పటికినీ ఇంత భారీ కార్యక్రమం సాఫీగా జరగడం మన ప్రత్యేకత అని ఆయన అన్నారు.
మహమ్మారిని ఎదుర్కోవడానికి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని దార్శనికతతో వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన ప్రశంసించారు. పని చేసే చోట వ్యాక్సినేషన్ పధ్ధతి విజయవంతమైందని, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పద్ధతిని అనుకరించాలని డాక్టర్ సింగ్ కోరారు.
ఇంతకు ముందు ఈ నెల 4వ తేదీన పెన్షనర్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ లోక్ నాయక్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీకా శిబిరాన్నిమంత్రి పర్యవేక్షించారు. 18 సంవత్సరాలు పైబడిన, అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ త్వరగా టీకాలు వేయించుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు.
***
(Release ID: 1727685)
Visitor Counter : 224