నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

4500 కోట్ల రూపాయల సౌర పీఎల్‌ఐ పథకానికి బిడ్లు ఆహ్వానించిన ఇరెడా


దేశీయంగా సౌర పీవీ మాడ్యూళ్ల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహం
దరఖాస్తు చేయడానికి ఈ నెల 30 వరకు గడువు

Posted On: 11 JUN 2021 1:27PM by PIB Hyderabad

'కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ' ‍(ఎంఎన్‌ఆర్‌ఈ) ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ లిమిటెడ్‌' (ఇరెడా), సౌర విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయడానికి సౌర మాడ్యూళ్ల తయారీదారుల నుంచి బిడ్లను ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 4,500 కోట్ల రూపాయల ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద ఈ బిడ్లను పిలిచింది. ఈ పథకం అమలు సంస్థగా ఇరెడాను ఎంఎన్ఆర్‌ఈ నియమించింది. సోలార్‌ ఫోటో వోల్టాయిక్‌ (పీవీ) మాడ్యూళ్ల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 4500 కోట్ల రూపాయల పథకానికి కేంద్ర మంత్రివర్గం గతంలోనే ఆమోదముద్ర వేసింది.

    ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. అన్ని అర్హతలున్న బిడ్డర్లను జులై 30 కల్లా ఎంపిక చేస్తారు. గత నెల 25న, ఇరెడా తన వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియ అదే నెల 31 నుంచి ప్రారంభమైంది.

    ఈ పథకం కింద కేటాయించిన మొత్తం ఉత్పత్తి సామర్థ్యం కోసం బ్రౌన్‌ఫీల్డ్‌ లేదా గ్రీన్‌ఫీల్డ్ సదుపాయాన్ని దరఖాస్తుదారులు సిద్ధం చేసుకుని ఉండాలి. బ్రౌన్‌, గ్రీన్‌ఫీల్డ్‌ను కలిపి చూపడానికి వీల్లేదు. ఉత్పత్తి సామర్థ్యం కోసం అవసమైన సామగ్రిని బిడ్‌ చివరి తేదీ కంటే ముందే దిగుమతి చేసుకుంటే, ఈ పథకం కింద అనర్హులుగా గుర్తిస్తారు. కనీసం వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయాలి. అన్ని అర్హతలున్న సంస్థలకు ఏటా, ఐదేళ్లపాటు పీఎల్‌ఐ అందిస్తారు.

    ప్రస్తుతం, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సౌర బ్యాటరీలు, మాడ్యూళ్లపైనే సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్రధానంగా ఆధారపడి ఉంది. దేశీయంగా వీటి ఉత్పత్తి అతి తక్కువగా ఉంది. విద్యుత్‌ రంగం వంటి వ్యూహాత్మక రంగం కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని 'అధిక సామర్థ్య సౌర పీవీ మాడ్యూళ్ల జాతీయ కార్యక్రమం' తగ్గిస్తుంది. 'ఆత్మనిర్భర్ భారత్‌ను' బలోపేతం చేస్తుంది.
 

****



(Release ID: 1726261) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Hindi , Tamil