సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
సికింద్రాబాద్ లోని ఎన్ఐఇపిఐడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ (హాస్టల్ భవనం) వర్చువల్‌గా ప్రారంభించిన శ్రీ తావర్ చంద్ గెహ్లాట్
వినికిడి శక్తి లేని వారి కోసం కోచ్లియర్ ఇంప్లాంట్స్ ఉత్పత్తిని ఒక్కో యూనిట్ లో 6 లక్షల నుంచి 7 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి : శ్రీ తావర్ చంద్ గెహ్లాట్
Posted On:
09 JUN 2021 9:05PM by PIB Hyderabad
సికింద్రాబాద్ లోని ఎన్ఐఇపిఐడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ను (హాస్టల్ భవనం) కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి శ్రీ తావర్ చంద్ గెహ్లాట్ వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రులు శ్రీ కృష్ణ పాల్ గుర్జార్, శ్రీ రామదాస్ అథావాలే, శ్రీ రతన్ లాల్ కటారియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యుడు శ్రీ రేవంత్ రెడ్డి (మల్కాజ్ గిరి నియోజకవర్గం), దివ్యాంగుల సాధికారత శాఖ కార్యదర్శి శ్రీమతి అంజలి భావ్రా, జాయింట్ కార్యదర్శి డాక్టర్ ప్రబోధ్ సేఠ్ కూడా ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. ఎన్ఐఇపిఐడి, సికింద్రాబాద్ డైరెక్టర్ శ్రీ బివి రామ్ కుమార్ గౌరవ అతిథులకు స్వాగతం పలికారు.
ఎన్ఐఇపిఐడి నిర్వహణలోని కోర్సులకు గల డిమాండును, విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించడానికి అదనపు హాస్టళ్ల అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని మంత్రిత్వ శాఖ అనుమతితో ఈ సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హాస్టల్ పేరిట కొత్త హాస్టల్ భవనం నిర్మించింది.ఆధునిక వసతులతో నిర్మించిన ఈ భవనంలో 50 మంది విద్యార్థులు బస చేయడానికి అవసరమైన గదులతో పాటు రెండు గెస్ట్ రూమ్ లు కూడా ఉన్నాయి. ఈ భవనాన్ని రూ.3.98 కోట్ల వ్యయంతో నిర్మించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని ప్రతీ ఒక్క రంగానికి చెందిన ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరుగుతోందని ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ తావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. అలాగే దివ్యాంగుల సాధికారత శాఖ (డిఇపిడబ్ల్యుడి), ఎంఎస్ జె&ఇ కూడా దేశంలోని దివ్యాంగ జనుల సర్వతోముఖాభివృద్ధికి వేగంగా కృషి చేస్తున్నాయి. ఈ లక్ష్యంతోనే దేశవ్యాప్తంగా దివ్యాంగ జనుల అభివృద్ధికి అభివృద్ధికి 9 జాతీయ సంస్థల ఏర్పాటు జరిగింది. వాటిలో ఒకటి సికింద్రాబాద్ లోని (తెలంగాణ) జాతీయ సంస్థ. దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి దివ్యాంగ విద్యార్థులు ఈ సంస్థలో విద్యాభ్యాసానికి వస్తారని శ్రీ గెహ్లాట్ చెప్పారు.
మరిన్ని వివరాలు అందిస్తూ వివిధ వైకల్యాలతో బాధ పడుతున్న దివ్యాంగుల సంక్షేమం, సుసంపన్నత కోసం వారిలో భౌతిక, ఆర్థిక, మేథో అభివృద్ధికి దోహదపడడానికి అవసరమయ్యే గాడ్జెట్లు, సామగ్రి, డివైస్ లు కూడా తాము అందిస్తున్నామని శ్రీ గెహ్లాట్ తెలిపారు. బధిరులైన విద్యార్థులకు కోచ్లియర్ ఇంప్లాంట్లను ఉత్పత్తి చేసే ఒక్కో యూనిట్ కు తాము ఇప్పటివరకు రూ.6 లక్షల గ్రాంటు ఇస్తూ వస్తున్నామని, దాన్ని రూ.7 కోట్లకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. బధిరులైన బాలబాలికల వినియోగానికి కోచ్లియర్ ఇంప్లాంట్లను తీసుకునేందుకు, ఉచితంగా చేసిన ఈ సదుపాయం ఉపయోగించుకునేందుకు తమ మంత్రిత్వ శాఖ లేదా నోడల్ ఏజెన్సీలను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దివ్యాంగ జనుల అభివృద్ధి కోసం 2016 సంవత్సరంలో ప్రభుత్వం కొత్త చట్టం రూపొందించిందని, అందులో దివ్యాంగ జనుల వర్గీకరణను 7 నుంచి 21కి పెంచిందని శ్రీ గెహ్లాట్ వివరించారు. దివ్యాంగ జనులు ఉద్యోగాలు, విద్యలో మెరుగైన రిజర్వేషన్ అవకాశాలు పొందేందుకు ఇది సహాయకారిగా ఉంటుందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశ ప్రజల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న పలు కలలు సాకారం చేస్తున్నదని ఈ సందర్భంగా శ్రీ రామ్ దాస్ అథావాలే తెలిపారు. దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ సంస్థకు వచ్చి విద్యాభ్యాసం చేసేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఈ హాస్టల్ భవనంలో ఏర్పాటు చేసిన ఆధునిక వసతులు విద్యార్థులకు ప్రత్యేకించి ఈ కోవిడ్ కాలంలో మంచి వాతావరణం కల్పించడం ద్వారా విద్యార్థులు తమ విద్యాభ్యాసంపై దృష్టి సారించి కోర్సులు విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయకారిగా ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తన వృత్తిపరమైన కార్యకలాపాలు కొనసాగించేందుకు విధివిధానాల్లో ఎన్ఐఇపిఐడి విప్లవాత్మకమైన మార్పులు చేసిందని శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ అన్నారు. గత ఏడాది ఈ సంస్థ 150 వరకు వెబినార్లు నిర్వహించిందని, తద్వారా 1800 మంది నిపుణులు, వృత్తి నిపుణులు లబ్ధి పొందారని తెలిపారు. దీనికి తోడు ఎన్ఐఇపిఐడి ఇ-లెర్నింగ్, ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ విధానాల ద్వారా పలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. ఆ రకంగా ఎన్ఐఇపిఐడి మానవ వనరుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఈ కోవిడ్ సమయంలో దివ్యాంగులకు సేవలందిస్తోంది.
జాతీయ సంస్థలు వివిధ విభాగాలకు చెందిన వైకల్యాలు అధిగమింపచేసే విషయంలో అపారమైన కృషి చేస్తున్నాయని శ్రీ రతన్ లాల్ కటారియా అన్నారు. ఈ సంస్థలు వృత్తి విద్యాకోర్సుల ద్వారా వివిధ శ్రేణుల్లోకి వచ్చే వైకల్యాలతో (భిన్న సామర్థ్యాలు) బాధ పడుతున్న వ్యక్తులకు సంబంధించిన వివిధ రంగాల్లో కృషి చేస్తున్ననిపుణులు మరింత సమర్థవంతంగా పని చేసేందుకు సహాయపడుతున్నాయని చెప్పారు. ఆర్ పిడబ్ల్యుడి చట్టం-2016 రూపకల్పన ద్వారా వైకల్యాల వర్గీకరణను 7 నుంచి 21కి పెంచారు. ఆయా విభాగాల్లో పని చేస్తున్నజాతీయ స్థాయి సంస్థలకు అదనపు బాధ్యతలు అప్పగించి అవి తమ శిక్షణ, పరిశోధన కార్యకలాపాలు పెంచుకునేందుకు తద్వారా విభిన్న వైకల్యాలను అధిగమించేందుకు సహాయపడే కీలక వృత్తి నిపుణులు తయారుకావడానికి దోహదకారి అయింది. అందుకే ఆయా జాతీయ సంస్థలు విద్యార్థుల డిమాండుకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించుకోవడం, ప్రస్తుత వసతులు అభివృద్ధి చేసుకోవడం తప్పనిసరి అయింది.
శ్రీమతి అంజలీ బావ్రా ప్రారంభోపన్యాసం ఇస్తూ పునరావాస సేవల్లో ఎన్ఐఇపిఐడి లక్ష్యాలు, సాధించిన విజయాలను వివరించారు. గత మూడు సంవత్సరాల కాలంలో సంస్థ నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ దాటిందన్నారు. 2018-19, 2019-20 సంవత్సరాల్లో సంస్థ 3,60,000 మందికి సేవలందించిందని చెప్పారు. ఈ మహమ్మారి సమయంలో కూడా సంస్థ 2,50,000 మందికి పైగా దివ్యాంగులకు పునరావాస సేవలందించిందని ఆమె తెలిపారు.
వీటన్నింటితో పాటు ఎన్ఐఇపిఐడి పరిశోధన రంగంలో మంచి కృషి చేసింది. ప్రారంభం నుంచి ఇప్పటికి 74 రీసెర్చ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది. ప్రస్తుతం రెండు రీసెర్చ్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. భిన్న సామర్థ్యాలు గల వ్యక్తులు ఆత్మగౌరవం, సమానత్వంతో జీవితం గడిపేందుకు అవసరమైన సాధికారత కల్పన కోసం ఎన్ఐఇపిఐడి చేస్తున్న కృషి సంస్థ చేపడుతున్న పరిశోధనల నాణ్యతలోనే ప్రతిబింబిస్తుంది. ఎన్ఐఇపిఐడి ఎంఫిల్ స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా విభాగాల్లో 16 దీర్ఘకాలిక కోర్సులు అందిస్తోందని శ్రీమతి అంజలి తెలిపారు. ఎన్ఐఇపిఐడిలో శిక్షణ పొందిన వృత్తినిపుణులు దేశవ్యాప్తంగా తమ సేవలు అందిస్తున్నారు.
హాస్టల్ ను రూ.3.98 కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రతీ గది అటాచ్డ్ రెస్ట్ రూమ్ తో సహా ఆకర్షణీయమైన ఫర్నిచర్, సకల సౌకర్యాలు కలిగి ఉంటుంది. చక్కని ఆధునిక వంటగది ఉంది. ఆకర్షణీయంగా తీర్చి దిద్దిన రిసెప్షన్, గ్రంథాలయం/ స్టడీ రూమ్ వంటివి ఉన్నాయి. హాస్టల్ లో నివశించే విద్యార్థులకు వైఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంది. దివ్యాంగులకు సౌకర్యంగా ఉండేందుకు, తేలిగ్గా తిరిగేందుకు అనువుగా కారిడార్లలో ర్యాంప్, జారిపోకుండా ఉండే గచ్చు వంటి ఏర్పాట్లున్నాయి. విద్యార్థుల ప్రశాంతత, ఆహ్లాదం కోసం హాస్టల్ భవనం చుట్టూ చక్కని చెట్లతో హరిత వాతావరణం ఉంది.
***
(Release ID: 1725859)
Visitor Counter : 158