వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

తూర్పు ప్రాంతం నుంచి ఎగుమతులకు ప్రోత్సాహాన్నిస్తూ, పశ్చిమ బంగాల్‌ నుంచి నేపాల్‌కు 24 మె.ట. వేరుశనగ ఎగుమతి

Posted On: 08 JUN 2021 10:10AM by PIB Hyderabad

తూర్పు ప్రాంతం నుంచి వేరుశనగ ఎగుమతిని పెంచే అవకాశాలకు ఊతమిస్తూ, పశ్చిమ బంగాల్ నుంచి నేపాల్‌కు 24 మె.ట. వేరుశనగను ఎగుమతి చేశారు.

    పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లా రైతుల నుంచి సేకరించిన పంటను, అపెడా నమోదిత, కోల్‌కతాలోని లాదురమ్‌ ప్రమోటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎగుమతి చేసింది.

    సాధారణంగా వేరుశనగ ఎగుమతిలో గుజరాత్‌, రాజస్థాన్‌దే ప్రధాన భాగం. పశ్చిమ బంగాల్‌ నుంచి జరిగిన ప్రస్తుత ఎగుమతులు, తూర్పు ప్రాంతం నుంచి పంట ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.

    2020-21లో, రూ.5381 కోట్ల విలువైన 6.38 ల.ట. వేరుశనగ దిగుబడి వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. మన దేశం నుంచి ఎక్కువగా ఇండోనేషియా, వియత్నం, ఫిలిప్పిన్స్‌, మలేసియా, థాయిలాండ్‌, చైనా, రష్యా, ఉక్రెయిన్‌, యూఏఈ, నేపాల్‌కు  వేరుశనగ ఎగుమతి అవుతుంది. 

    "పీనట్‌.నెట్" వంటి వేదికల ద్వారా; కొనుగోలుదారుల నమోదు, అపెడా నమోదిత వేరుశనగ యూనిట్ల ద్వారా బ్యాచ్ ప్రాసెసింగ్, ఎగుమతి పత్రం కోసం దరఖాస్తు, ఎగుమతిదారు నుంచి స్టఫింగ్ సర్టిఫికెట్, అఫ్లాటాక్సిన్ విశ్లేషణ, ప్రయోగశాలల నుంచి స్టఫింగ్ సర్టిఫికెట్ జారీ, అపెడా ద్వారా ఎగుమతి ధృవీకరణ పత్రం జారీ వంటి చర్యల ద్వారా వేరుశనగ ఎగుమతులను అపెడా క్రమబద్ధీకరిస్తుంది.

    నూనె గింజల ఉత్పత్తిపై, కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ రూపొందించిన మూడో ముందస్తు అంచనాల ప్రకారం, 
2020-21లో వేరుశనగ ఉత్పత్తి 101.19 లక్షల టన్నులు వస్తుందని అంచనా. 2019-20లో వేసిన అంచనా 99.52 లక్షల టన్నులుగా ఉంది.

    దేశంలో, వేరుశనగ ఎగుమతుల్లో గుజరాత్‌ అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలోనూ వేరశనగ పండుతుంది. మొత్తం ఉత్పత్తిలో, ఖరీఫ్‌ సీజన్‌లోనే 75 శాతానికిపైగా దిగుబడి వస్తుంది.
                     

*****


(Release ID: 1725285) Visitor Counter : 195