పర్యటక మంత్రిత్వ శాఖ

కొత్తగా ఉన్నతీకరించిన ఐఐటీటీఎం వెబ్‌సైట్‌ను 108 జాతీయ, అంతర్జాతీయ భాషల్లో ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్

Posted On: 05 JUN 2021 8:12PM by PIB Hyderabad

ప్రపంచ పర్యావణ దినోత్సవం సందర్భంగా, గ్వాలియర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం, ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం) నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి, వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రసంగించారు. కొత్తగా ఉన్నతీకరించిన ఐఐటీటీఎం వెబ్‌సైట్‌ను 108 జాతీయ, అంతర్జాతీయ భాషల్లో ప్రారంభించారు. 'ఇంక్రెడిబుల్‌ ఇండియా టూరిస్ట్ ఫెసిలిటేటర్‌ సర్టిఫికేషన్' (ఐఐటీఎఫ్‌సీ) సమాచార సెమినార్‌ను, ఆక్వా ఆధారిత సాహస పర్యాటకం 'అట్లాస్‌'ను కూడా ప్రారంభించారు. మొక్కలు నాటారు.

 

    కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్‌ సింగ్, సంయుక్త కార్యదర్శి శ్రీ రాకేష్‌ వర్మ, ఏడీజీ శ్రీమతి రూపేందర్‌ బ్రార్‌, ఆర్థిక సలహాదారు శ్రీ గ్యాన్‌ భూషణ్‌ కూడా వర్చువల్‌ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

    ఐఐటీఎఫ్‌సీ కార్యక్రమాన్ని మెచ్చుకున్న కేంద్ర మంత్రి, అందులో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలిపారు. అనేక భాషల్లో వెబ్‌సైట్‌ను తీసుకొచ్చిన ఐఐటీటీఎంను కూడా అభినందించారు. మనకున్న అతి పెద్ద ఆస్తి పర్యావరణమేనన్న శ్రీ పటేల్‌, ప్రతి ఒక్కరు సాధ్యమైనన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు, పర్యావరణ పరిరక్షణ కూడా మన బాధ్యతని, దీనివల్ల మనమంతా ఆరోగ్యంగా జీవిస్తామని స్పష్టం చేశారు. మంచి పర్యావరణాన్ని భావి తరాలకు అందించడం కూడా మన బాధ్యతగా చెప్పారు.

 

    పర్యాటక రంగంలో ఐఐటీటీఎం నిర్వహిస్తున్న పాత్రను అభినందించిన కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్‌ సింగ్, ప్రస్తుత మహమ్మారి కాలం ముగిశాక పర్యాటక రంగం మళ్లీ వృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

     'ఇంక్రెడిబుల్‌ ఇండియా టూరిస్ట్ ఫెసిలిటేటర్‌ సర్టిఫికేషన్' కోర్సు ప్రస్తుత బృందంలో 2230 మంది ఉన్నారు. మొత్తం 7546 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రతి 25 మంది బృందానికి ప్రతిరోజూ 4 గంటల చొప్పున 7 రోజులపాటు శిక్షణ ఇస్తారు. మూల్యాంకనం తర్వాత వారికి ధృవపత్రాలు అందజేస్తారు.
 

******



(Release ID: 1724838) Visitor Counter : 151