ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వసుధైవ కుటుంబకం!


ప్రపంచమంతా ఒకే కుటుంబం
ఇదే భారతీయ తత్వమన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్
ఆరోగ్య రక్షణ లక్ష్యంగా మనమంతా
క్రియాశీలం కావాలని పిలుపు
మహమ్మారి వైరస్ తో పోరులో ప్రపంచ స్థాయి సంఘీభావం
మరింత బలోపేతం కావాలని ఉద్బోధ
డబ్ల్యు.హెచ్.ఒ. కార్యవర్గమండలి 149వ సమావేశం.
అధ్యక్ష హోదాలో హర్షవర్ధన్ వర్చువల్ ప్రసంగం
అధ్యక్షుడుగా పదవీకాలం ముగించుకున్న కేంద్రమంత్రి

“పొగాకు నియంత్రణలో హర్షవర్ధన్ పాత్ర అమోఘం”
డబ్ల్యు.హెచ్.ఒ. డైరెక్టర్ జనరల్ అభినందనలు

Posted On: 02 JUN 2021 5:09PM by PIB Hyderabad

  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) కార్యవర్గ మండలి 149వ సమావేశం ఈ రోజు జరిగింది. డబ్ల్యు.హెచ్.ఒ. కార్యవర్గ మండలి అధ్యక్ష హోదాలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ సమావేశంలో వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. నిర్మాణ్ భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన ప్రసంగించారు. డబ్ల్యు.హెచ్.ఒ. కార్యవర్గ మండలి అధ్యక్షుడుగా తన పదవీకాలాన్ని డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజుతో విజయవంతంగా పూర్తి చేశారు.

https://ci5.googleusercontent.com/proxy/Gi7HarH94vTLRq-F6Qi8zvxNYXP66k9A-HbxEwGtm0rgCbtx4clupxA2XNn0joTcv1bFgsXsngPSmIkMX8dDzAIYqkdLoaIys5IiOOBPjG53dZGgkyDoCxNXNw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MB76.jpg

  ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కట్టడికోసం సాగే యుద్ధంలో సాహసోపేతంగా పాల్గొంటూ తమ ప్రాణాలొడ్డిన పురుషులు, మహిళల సేవలను గుర్తు చేసుకున్నారు. వారి సేవలవల్లనే మానవాళి నిలదొక్కుకోగలిగిందని ఆయన అన్నారు.

  ఆయన ప్రసంగం ఈ కింది విధంగా ఉంది.:

  ఇది నాకు మిశ్రమ భావోద్వేగాల సమయం. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థకు సేవలందించే గౌరవం దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరోవైపు ఈ భూగోళం యావత్తూ వైరస్ మహమ్మారి కోరల్లో, ఆర్థిక సంక్షోభంలో విలవిలలాడుతున్న వేళ,.. ఎన్నో విధులు నిర్వర్తించాల్సిన కాలంలో బాధ్యతలనుంచి వైదొలుగుతున్నందుకు హృదయం ఆవేదనతో బరువెక్కుతోంది.

  గత ఏడాది మే నెలలో నాకు కార్యవర్గ మండలి అధ్యక్ష బాధ్యతలు లభించాయి. డబ్ల్యు.హెచ్.ఒ. కార్యవర్గ మండలి 147వ, 148వ సమావేశాల కాలంలో మండలికి సారథ్య బాధ్యతలు లభించడం నాకు దక్కిన గౌరవమే. అంతేకాక, కోవిడ్-19కు ప్రతిస్పందనగా మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించడం కూడా నాకు అందిన సత్కారంగా భావిస్తున్నాను. 

https://ci5.googleusercontent.com/proxy/1OzOB-NsVv8xfsgSZdoTBiOqQiVor50tJIzkP_PeUFZ_YpLraDPoJyMSJJwDMzlwDaWjpwPcreIlIxMOIV4x2pXNEF_cwwPMDtXvKyUheJLO5AtZ4aIOFtCakQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JAAW.jpg

  ఈ ఏడాది మే నెల 31వ తేదీన జరిగిన 74వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం సందర్భంగా డబ్ల్యు.హెచ్.ఒ. కార్యవర్గ మండలికి నేను ప్రాతినిధ్యం వహించడం కూడా నాకు అపురూప గౌరవమే. ఈ నేపథ్యంలో కోవిడ్-19పై పోరాటాన్ని పటిష్టం చేయగలమని, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన వందలాది లక్ష్యాలను చేరుకోగలమని నేను కచ్చితంగా విశ్వసిస్తున్నాను.

  మహమ్మారి వైరస్ వ్యాప్తి సంక్షోభం నేపథ్యంలో తన సభ్యదేశాలన్నింటికీ అచంచలమైన మద్దతు అందిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థను నేను అభినందిస్తున్నాను. సమానత్వ విలువలకు, అందరూ సురక్షితమయ్యేంతవరకూ ప్రపంచంలో ఎవరికీ రక్షణ ఉండబోదన్న సత్యానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సంపూర్ణంగా కట్టుబడి ఉంది. 

    కోవిడ్ వైరస్ పై పోరాటం సాగిస్తున్న ఎ.సి.టి. యాక్సిలేటర్ అన్న ప్రపంచ స్థాయి సహకార సంస్థతో వివిధ భాగస్వామ్య వర్గాలకు అనుసంధానం బాగుంది. దీనితో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కూడా అభివృద్ధి, వస్తూత్పాదనన, కోవిడ్ పరీక్షల లభ్యత, చికిత్సా సదుపాయాలు, వ్యాక్సీన్ల  పంపిణీ వంటి కార్యక్రమాలను విజయవంతంగా సాగుతున్నాయి. కోవిడ్ వ్యాక్సీన్లతో అందరికీ సమ స్థాయిలో అనుసంధానం ఏర్పడేలా కోవాక్స్ అనే ప్రపంచ స్థాయి సంస్థ కృషి చేస్తోంది. వ్యాక్సీన్ల విషయంలో ప్రపంచంలో ఎవరూ వెనుకబడరాదన్న సూత్రంతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.

 కోవిడ్-19 మందులు, వ్యాక్సీన్లు ప్రపంచ స్థాయిలో సమంగా అందుబాటులో ఉండేలా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ చేసిన కృషి నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించింది. వైరస్ మహమ్మారి వ్యాపించిన అన్ని ప్రాంతాలకు ప్రపంచ స్థాయి సంఘీభావం, సహకారం చాలా ప్రధానం. వీటిని ఎప్పటికప్పుడు బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

  ఇది మనమంతా క్రియాశీలం కావలసిన సమయం. రానున్న రెండు దశాబ్దాల్లో ఆరోగ్యపరంగా మనకు అనేక సవాళ్లు ఎదురుకాబోతున్నాయన్నది మనమంతా గుర్తెరగాలి. ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే అందరూ కలసికట్టుగా ప్రతిస్బందించడం అవసరం. డబ్ల్యు.హెచ్.ఒ. కీలక తత్వం, మూల సిద్ధాంతం కూడా ఇదే. దేశాలన్నీ ఈ విషయంలో భాగస్వామ్య వైఖరితో వ్యవహరించడం చాలా అవసరమని నేను పదేపదే చెబుతూ వస్తున్నాను.

  ఇలాంటి తీవ్రమైన ప్రపంచ సంక్షోభ సమయంలో ప్రమాదాన్ని ఎదుర్కోవాలన్నా, పరిస్థితిని ఉపశమింప జేయాలన్నా ప్రపంచ స్థాయిలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సి ఉంటుంది. ప్రపంచ స్థాయి ప్రజారోగ్య రంగంలో ఆసక్తిని, పెట్టుబడులను తిరిగి పునరుద్ధరించాల్సి ఉంటుంది.

  మానవాళిని శతాబ్ధాల తరబడి వేధించిన వ్యాధులపై పోరాటం విషయంలో మరింత చిత్తశుద్ధితో పనిచేయడం చాలా ముఖ్యం. ప్రతికూల పరిస్థితులన్నింటినీ సహకార భావనతో అధిగమించాల్సి ఉంటుంది. వనరులను సమీకరించుకోవడం ద్వారా పరస్పరం సహాయం, సహకారం అందించుకోవాలి.

  ప్రజారోగ్యం విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటికీ  భావస్ఫోరక నాయకత్వాన్ని అందిస్తున్నప్పటికీ, దీన్ని మరింత ముందుకు తీసుకుపోవలసిన అవసరం  ఉంది. అందుకు తగిన అవకాశం కూడా ఉంది. ఉమ్మడి చర్యలు అవసరమైన ప్రతి చోటా, భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టడంలో మనం మరింత క్రియాశీలకంగా ఉండాల్సిన అవసరం ఉంది. పరిశోధనా కార్యకలాపాలకు అవసరమైన కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం, విలువైన సమాచారాన్ని ప్రపంచ సమాజం పరస్పరం పంచుకోవడం చాలా అవసరం.

  ప్రస్తుతం మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పారిశ్రామిక రంగం మేధో సంపత్తి హక్కులంటూ మొండిగా మడిగట్టుకుని కూర్చోరాదు. పైగా, సహకార ప్రాతిపదిన పరిశోధనకు కొన్ని సార్లు సమ్మతి ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో అందరికీ ఆరోగ్యం అన్న మన లక్ష్యం ఎంతమేరకు అందుబాటులోకి వస్తుందన్నది కూడా కీలకమే. ఇలాంటి సంక్షోభ సమయంలోనే కీలకమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా తగిన మార్గాలను వెదికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేయాలి. ఇందుకోసం ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి వాటితో ప్రపంచ ఆరోగ్య సంస్థ కలసికట్టుగా పనిచేయాలి.

  అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన ఆరోగ్యం అనేది ప్రతి మనిషికీ అందవలసిన ప్రాథమిక హక్కు. ఈ విషయంలో జాతి, మతం, రాజకీయ సిద్ధాంతం, ఆర్థిక, సామాజిక స్థితిగతులతో సంబంధమే లేదు. ప్రస్తుత మహమ్మారి సంక్షోభ సమయంలో అందరికీ సమాన స్థాయిలో వ్యాక్సీన్లను పంపిణీ చేయడమే మన ముందున్న అతిపెద్ద సవాలు.  

  ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలో ఉన్న మనమంతా పరిస్థితులకు అనుగుణంగా స్పందించాల్సి ఉందని భావిస్తున్నాను. అధికారంలేని వారికి, మాట్లాడలేని వారికి, అంధకార సమయంలో ఆశలను నింపేందుకు మన సంసిద్ధంగా ఉండాలి. స్థూల దృక్పథంతో సహకార బంధాలను ఏర్పరుచుకుని, ప్రపంచమంతా ఒక్కటే అన్న ప్రాథమిక సత్యాన్ని పునరుద్ఘాటించవలసిన అవసరం ఉంది.

 వసుధైవ కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ తత్వాన్ని నేను ఇక్కడ సూచిస్తున్నాను. అందువల్ల మనమంతా సభ్యదేశాలకోసం కలసి పనిచేసేందుకు కట్టుబడి ఉండాలి. ప్రజారోగ్య సంబంధమైన బాధ్యతలను నిర్వర్తించేందుకు సంస్థతో పాటుగా, ప్రపంచ దేశాల భాగస్వామ్య సమాజం పటిష్టంగా, మరింత ప్రతిస్పందనతో పనిచేయాల్సి ఉంది. అదే ప్రాథమిక సూత్రం, విశ్వాసం మనకు మార్గదర్శకం కావాలి. ఆరోగ్యంకోసం వ్యాక్సీన్లు,..సంపన్నులకే కాక, పేదలకు కూడా చేరాలి. 

  ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యవర్గ మండలి అధ్యక్షుడుగా నా పదవీకాలం చాలా వేగంగా ముగిసినట్టు మీలో చాలామందికి అనిపిస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ, ఇది నాకు చాలా ప్రయోజనకరమైన అనుభవం. నన్ను నేను మరింత దృఢపరుచుకునేందుకు దోహదపడిన అనుభవం కూడా ఇదే., ఇపుడు నా బాధ్యతలను నా వారసుడికి అప్పగించేందుకు ఎదురు చూస్తున్నాను. 

  మీరు నాపై ఉంచిన విశ్వాసం నాకు ఎంతో గౌరవప్రదమని భావిస్తున్నాను. అందుకే, మానవాళికే ఎంతో సంక్షుబితమైన కాలంలో నేను కార్యవర్గ మండలి అధ్యక్షుడుగా పనిచేయగలిగాను. పైగా ఈ సంవత్సరం మన శాస్తవేత్తలు అనవరతం ఎంతగానో శ్రమించారు. ప్రాణాధారమైన కోవిడ్-19 వ్యాక్సీన్ అందించేందుకు వారు రికార్డు స్థాయిలో ఎంతో వేగవంతంగా పనిచేశారు.

   నా స్నేహితులారా..! ఈ సంవత్సరం విజ్ఞాన శాస్త్ర సంవత్సరం కూడా. విజ్ఞాన శాస్త్ర రంగం, సమాచారం వంటి అంశాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకున్న సంవత్సరంగా ఈ ఏడాదికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. నిజానికి ఇది అనుకోని ఉత్పాతం. మనం ఈ పరీక్షను ఎదుర్కొంటామన్న విషయంపై అప్పట్లో ఎవరికీ తెలియదు. అయితే, మనం సమయానికి తగినట్టుగా ప్రతిస్పందించాం.

  కోవిడ్.పై పోరాటంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యరక్షణ కార్యకర్తలు నిర్విరామంగా ఆసుపత్రుల్లో పనిచేస్తూ, తమ కుటుంబ సభ్యులకు వైరస్ సోకకూడదన్న ఆలోచనతో ఆసుపత్రుల సెల్లార్లలోనే నిద్రిస్తున్నారు. కొత్త తరహా వ్యాక్సీన్లను, చికిత్సా పద్ధతులను రూపొందించేందుకు శాస్తవేత్తలు నిర్ణీత పనిగంటలను మించి విధులను నిర్వర్తిస్తున్నారు.; మీడియా చానెళ్లలో ప్రచారమవుతున్న అసత్య వార్తలను ఖండిస్తూ మీరంతా పనిచేస్తున్నారు. రోగుల సేవకోసం పదవీ విరమణ చేసిన వైద్యులు కూడా తిరిగి వైద్యవృత్తి చేపట్టారు. ఈ మధ్య పోరాటంలో మనం లక్షలాది మంది ఆరోగ్యరక్షణ, కార్యకర్తలను ఫ్రంట్ లైన్ యోధులను శాశ్వతంగా కోల్పోయాం.

  అయినా ఇప్పటికీ నేను ఆశాభావంతోనే ఉన్నాను. పరిస్థితి కూడా మనకు ఆశాజనకంగా ఉంది.

  ఈ పరిస్థితుల్లో ప్రపంచమంతా ఎంతో గౌరవించే సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరింత అర్థవంతంగా పనిచేసేలా చూడాలి. ఈ పరీక్షా సమయం, కష్టకాలంలో సభ్యదేశాల విశ్వాసం చూరగొనేలా సంస్థ పనిచేసేలా చూడటం మన బాధ్యత.

  ఈ నేపథ్యంలో పరీక్షను అధిగమించినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత గడ్డు కాలంలో సమాజ సేవలను కొనసాగించేందుకు మీరు చూపిస్తున్న పట్టుదల, దృఢ దీక్ష అభినందనీయం. మేం తీసుకున్న నిర్ణయాన్ని కార్యాచరణలో పెట్టేందుకు మీరు పడిన శ్రమకు, మీ త్యాగాలకు కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను.

  ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యవర్గ మండలి అధ్యక్షుడుగా నేను పనిచేసినంతకాలం నాపై అంచంచల విశ్వాసాన్ని ఉంచినందుకు మీకు నా కృతజ్ఞతలు. నా పదవీకాలంలో నాకు ఎంతో మద్దతు అందించిన ఉపాధ్యక్షులు, డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ అధనామ్ గెబ్రెయేసస్, ప్రాంతీయ డైరెక్టర్లలకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో ప్రత్యేకించి ఆగ్నేయాసియా ప్రాంతపు డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ కృషిని కూడా అభినందిస్తున్నాను. కార్యవర్గ మండలి సమావేశాలను విజయవంతంగా నిర్వహించడంలో వీరంతా ఎంతో మద్దతు ఇచ్చారు. తగిన మద్దతు, మార్గదర్శకత్వం అందించిన కార్యవర్గ మండలి సభ్యులకు, మాజీ సభ్యులకు కూడా ఇవే నా కృతజ్ఞతలు.

  అందరికీ కృతజ్ఞతలు...నమస్తే..!

  డబ్ల్యు.హెచ్.ఒ. కార్యవర్గ మండలి అధ్యక్షుడుగా పదవీ కాలాన్ని ముగించుకున్న డాక్టర్ హర్షవర్ధన్ కు డబ్ల్యు.హెచ్.ఒ. డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ అధనామ్ గెబ్రెయేసస్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టెడ్రాస్ మాట్లాడుతూ,. ప్రపంచ ఆరోగ్యం కోసం నాయకత్వ బాధ్యతలు నిర్వహించినదుకు డాక్టర్ హర్షవర్ధన్ ను ఎంతగానో ప్రశంసించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ఒక బహుమతిని ప్రదానం చేశారు. కార్యవర్గ మండలి అధ్యక్షుడుగా హర్షవర్ధన్ అందించిన సేవలతోపాటుగా, ఆయన వ్యక్తిగతంగా అందించిన భాగస్వామ్యం కూడా అభినందనీయమని టెడ్రాస్ అన్నారు. డబ్ల్యు.హెచ్.ఒ. ప్రత్యేక డైరెక్టర్ జనరల్ నుంచి పురస్కారం అందుకున్నందుకు కూడా కేంద్రమంత్రికి ఆయన అభినందనలు తెలిపారు. పొగాకు నియంత్రణలో డాక్టర్ హర్షవర్ధన్ అందించిన సేవలను కూడా డైరెక్టర్ జనరల్ కొనియాడారు. నేషనల్ టొబ్యాకో క్విట్ లైన్, ఇ-సిగరెట్లపై నిషేధం అమలు, ప్రపంచవ్యాప్తంగా పొగాకు నియంత్రణలో హర్షవర్ధన్ నిర్వహించిన పాత్రను డబ్ల్యు.హెచ్.ఒ డైరెక్టర్ జనరల్  ప్రశంసించారు.

 

https://ci6.googleusercontent.com/proxy/UfQv3KGC3Jfv3zVb6sn8x-QJYfoBkiKVFIFI6VICdIfEX7Yk3NDcExiVfQ1S59WjkHKKFra-e-8dfidlWD2AoTnnEVHpx1XnzDADqCYcu8fCFDPjo4I23XlVkA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BAR9.jpg

   డబ్ల్యు.హెచ్.ఒ. కార్యవర్గ మండలి తదుపరి చైర్ పర్సన్.గా కెన్యాకు చెందిన డాక్టర్ పాట్రిక్ అమోత్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యు.హెచ్.ఒ. కార్యవర్గ మండలి సభ్యులతోపాటుగా, డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ అధనామ్ గెబ్రెయేసస్, సభ్యదేశాల ప్రతినిధులు, డబ్ల్యు.హెచ్.ఒ. ప్రాంతీయ డైరెక్టర్లు పాల్గొన్నారు.

 

****


(Release ID: 1724001) Visitor Counter : 255