ఉక్కు మంత్రిత్వ శాఖ

ఒడిశా రాష్ట్రం అంగుల్‌లోని జేఎస్‌పీఎల్‌ ప్లాంటులో ఆక్సిజన్‌ సౌకర్యమున్న 270 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌

Posted On: 01 JUN 2021 4:06PM by PIB Hyderabad

ఒడిశా రాష్ట్రం అంగుల్‌లోని 'జిందాల్‌ స్టీల్‌ & పవర్‌ లిమిటెడ్‌' ప్లాంటులో ఏర్పాటు చేసిన 'కొవిడ్‌ కేర్‌ సెంటర్‌'ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ జాతికి అంకితం చేశారు. ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నబా కిషోర్‌ దాస్‌, జేఎస్‌పీఎల్‌ ఛైర్మన్‌ శ్రీ నవీన్‌ జిందాల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబల్‌పూర్‌ ఎంపీ శ్రీ నితేష్‌ గంగాదేబ్‌, ఛండీపాద ఎమ్మెల్యే శ్రీ సుశాంత కుమార్‌ బెహెరా, రాష్ట్ర, జేఎస్‌పీఎల్‌ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

    ఆక్సిజన్‌ సౌకర్యమున్న 270 పడకలతో ఈ కొవిడ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వెంటిలేషన్‌తో కూడిన 10 సూక్ష్మజీవ రహిత  పడకలు, 5 ఐసీయూ పడకలు కూడా ఇక్కడ ఉన్నాయి. వచ్చే నెల కల్లా ఈ కేంద్రం సామర్థ్యాన్ని 400 పడకలకు పెంచాలని జేఎస్‌పీఎల్‌ భావిస్తోంది. ఈ కేంద్రంలో కొవిడ్‌ పరీక్షలు, ఐసోలేషన్‌ కేంద్రం, అంబులెన్స్‌, చికిత్సలు, ఔషధాలు, ఆహారం, సంప్రదింపుల సేవలన్నింటినీ స్థానిక ప్రజలు కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు. 24 గంటలూ అందుబాటులో ఉండేలా వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని సంస్థ నియమించింది.

    కొవిడ్‌పై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి జేఎస్‌పీఎల్‌ అందిస్తున్న మద్దతును శ్రీ ప్రధాన్‌ అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులకు వైద్య ఆక్సిజన్‌ అందించడాన్ని కూడా ప్రశంసించారు. 25 ఎంటీపీఏ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు కర్మాగారాన్ని 2030 నాటికి అంగుల్‌లో ఏర్పాటు చేయాలన్న జేఎస్‌పీఎల్‌ దూరదృష్టిని ప్రస్తావించిన కేంద్ర మంత్రి, స్థానిక యువకుల స్థిర జీవనోపాధి ఆకాంక్షను ఇది నెరవేరుస్తుందని, ఈ ప్రాంత ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని అన్నారు.

    కరోనా సమయంలో రోగుల కోసం ఆక్సిజన్‌ అందించడం, వైద్య సేవలు, స్థానిక ప్రజల జీవనోపాధికి సాయం చేయడం వంటి జేఎస్‌పీఎల్‌ చేపట్టిన కార్యక్రమాల పట్ల  ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నబా కిషోర్‌ దాస్‌ జేఎస్‌పీఎల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
 

****



(Release ID: 1723542) Visitor Counter : 158