విద్యుత్తు మంత్రిత్వ శాఖ

కొవిడ్‌పై పోరాడేందుకు ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతం కోసం, బొగ్గు గనుల ప్రాజెక్టులున్న ప్రాంతాల్లోని స్థానిక యంత్రాంగాలకు ఎన్‌టీపీసీ సాయం

Posted On: 31 MAY 2021 3:32PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ, హజారీబాగ్‌లోని తన 'పక్రి బర్వాది' బొగ్గు గనితో కలిసి, రాంచీ సరిహద్దుల్లో ఉన్న 300 పడకల ఐటీకేఐ టీబీ ఆరోగ్య కేంద్రంలో "సెంట్రలైజ్డ్‌ మ్యానిఫోల్డ్‌ ఆక్సిజన్‌ సపోర్ట్‌"ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. పారిశ్రామిక సామాజిక బాధ్యత కింద ఈ నిర్ణయం తీసుకుంది.

    కరోనా రెండో దశలో ఝార్ఖండ్‌లో అత్యవసర కేసుల సంఖ్య భారీ పెరుగుదలతో రిమ్స్‌ సహా రాంచీ, హజారీబాగ్‌లోని పెద్ద ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్‌టీపీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

    ఈ ఆసుపత్రిని కొవిడ్‌ క్లస్టర్‌ కేర్‌ కేంద్రంగా ఇంతకుముందే మార్చారు. ఇక్కడ చికిత్స చేయడం ద్వారా నగరంలోని ఆసుపత్రులపై ఒత్తిడిని తగ్గించాలన్నది ఉద్దేశం. కొవిడ్‌ తీవ్రతను నియంత్రించడానికి ఈ ఆసుపత్రిలో ప్రస్తుతమున్న సౌకర్యాలను ఎన్‌టీపీసీ మెరుగుపరుస్తోంది.

    కొవిడ్‌ చికిత్సల కోసం రాంచీలోని రిమ్స్‌ ఆసుపత్రిలో 600 పడకలకు 40 భారీ సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ పైపుల అమర్పు, పరికరాలు, ఆర్థిక సాయాన్ని కూడా ఎన్‌టీపీసీ అందిస్తోంది. పారిశ్రామిక సామాజిక బాధ్యతగా ఈ మద్దతు అందిస్తోంది.

    ఆసుపత్రుల్లో చేరిన కొవిడ్‌ రోగుల ఆక్సిజన్‌ అవసరాన్ని తీర్చేందుకు ఎన్‌టీపీసీ ఈ సాయం చేస్తోంది కొవిడ్ కేర్ ఐసీయూ/ వార్డుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పడకలు నగరవాసులకు మాత్రమేగాక, ఈ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే ఝార్ఖండ్ ప్రజలందరికీ ఉపయోగపడతాయి.
        
    హజారీబాగ్‌లోని షేక్‌ భిఖారీ వైద్య కళాశాలకు రూ.24 లక్షల ఆర్థిక సాయంతోపాటు, 180 పడకలకు కేంద్రీకృత ఆక్సిజన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఎన్‌టీపీసీ 'పక్రి బర్వాది' సాయం చేస్తోంది. హజారీబాగ్‌ జిల్లా యంత్రాంగం సహకారంతో ఈ సాయం అందించనుంది.

    ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్‌టీపీసీ తల్లాయ్‌పల్లి ప్రాజెక్టు కూడా రాయ్‌గఢ్‌ జిల్లా యంత్రాంగానికి వైద్య పరికరాలు, సేవలు, ఇతర సామగ్రిని అందించింది.

    రాష్ట్ర సామాజిక ఆరోగ్య కేంద్రాల ఆసుపత్రి భవనాల ఆధునికీకరణ, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ, స్థానిక పేదలు, వలస కూలీలకు ఆహార ధాన్యాల వితరణ వంటి కార్యక్రమాల్లోనూ ఈ ప్రాజెక్టు చురుగ్గా పాల్గొంటోంది. 

    దేశంలో భారీగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల దృష్ట్యా, కేంద్ర విద్యుత్‌ శాఖ మార్గదర్శనంలో, కరోనా వైరస్‌ కట్టడి కోసం ఎన్‌టీపీసీ అనేక చర్యలు తీసుకుంటోంది. కరోనా చికిత్స కోసం సంస్థ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల సామర్థ్యం పెంచుతోంది లేదా, అవే సౌకర్యాలను ఇతర ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగాలకు సాయం చేస్తోంది.
 

***



(Release ID: 1723194) Visitor Counter : 151