ప్రధాన మంత్రి కార్యాలయం

‘పీఎం కేర్స్’ద్వారా బాలలకు సాధికారత- ‘కోవిడ్ బాధిత బాలలకు మద్దతు/సాధికారత కల్పన’ కార్యక్రమానికి శ్రీకారం


కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వ అండదండలు;

వారికి 18 ఏళ్లు వచ్చినప్పటినుంచి నెలవారీ విద్యార్థి వేతనం...
23 ఏళ్లు రాగానే ‘పీఎం కేర్స్’ నుంచి రూ.10 లక్షల నిధి;

కోవిడ్ వల్ల మరణించినవారి పిల్లల ఉచిత విద్యాభ్యాసానికి భరోసా...
ఉన్నత విద్యకు రుణసాయం... ‘పీఎం కేర్స్’ ద్వారా వడ్డీ చెల్లింపు;

18 ఏళ్లదాకా ‘ఆయుష్మాన్ భారత్’ కింద రూ.5 లక్షల
ఉచిత ఆరోగ్య బీమా... ‘పీఎం కేర్స్’ నుంచి రుసుముల చెల్లింపు;

నేటి బాలలే దేశ భవిష్యత్ నిర్దేశకులు- వారికి మద్దతు...
రక్షణ కోసం చేయాల్సినవన్నీ చేస్తాం: ప్రధానమంత్రి;

ఒక సమాజంగా- మన బాలలకు ఆదరణ... వారిలో
ఉజ్వల భవితపై ఆశలు నింపడం మన బాధ్యత: ప్రధానమంత్రి

Posted On: 29 MAY 2021 5:56PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా కోవిడ్-19వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు మద్దతివ్వడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, వాటిగురించి వివరించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధ్యక్షతన ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి దుష్ప్రభావానికి గురైన పిల్లలకు ప్రయోజనం కల్పించే అనేక చర్యలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. నేటి బాలలే దేశ భవిష్యత్ నిర్దేశకులని, వారికి మద్దతు... రక్షణ కోసం దేశం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. తద్వారా వారు బలమైన పౌరులుగా రూపొంది, ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోగలరని పేర్కొన్నారు. ఇటువంటి కఠిన పరీక్షా సమయంలో ఒక సమాజంగా మన బాలలకు ఆదరణతోపాటు ఉజ్వల భవిష్యత్తుపై వారిలో ఆశలు నింపడం మన కర్తవ్యమని ప్రధాని అన్నారు. ఈ మేరకు కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులిద్దర్నీ లేదా వారిలో ఒకరిని కోల్పోయిన/చట్టబద్ధ సంరక్షకుల/దత్తత తల్లిదండ్రులు సంరక్షణలోగల పిల్లలందరికీ ‘‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’’ పథకం కింద పూర్తి మద్దతు లభిస్తుందని ఆయన ప్రకటించారు. కోవిడ్-19పై భారతదేశ పోరాటానికి తోడ్పడే ‘పీఎం కేర్స్ నిధి’కి అందే ఉదార విరాళాలతోనే ప్రస్తుతం ప్రకటించిన చర్యలన్నీ చేపట్టడం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు:-

పిల్ల‌ల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్:

  • ప్రతి బిడ్డకూ 18 ఏళ్లు వచ్చేనాటికి రూ.10 లక్షల మూలనిధి సృష్టి కోసం ‘పీం కేర్స్’ ద్వారా ఒక ప్రత్యేక పథకం కింద నిధులివ్వబడతాయి. ఈ మూల నిధిని...
  • వారికి 18 ఏళ్లు వచ్చాక తదుపరి ఐదేళ్లపాటు ఉన్నత విద్యాభ్యాస కాలంలో వ్యక్తిగత అవసరాలకు నెలవారీ ఆర్థిక సాయం/విద్యార్థి వేతనం ఇవ్వడానికి ఉపయోగిస్తారు.
  • అటుపైన వారికి 23 ఏళ్లు నిండేసరికల్లా వారి వ్యక్తిగత/వృత్తిగత వినియోగం కోసం ఒక పెద్ద మొత్తంలో సొమ్ము లభిస్తుంది.

పదేళ్ల లోపు పిల్లలకు పాఠశాల విద్య:

  • పిల్లలకు వారి సమీప ప్రాంతంలోని కేంద్రీయ విద్యాలయలో లేదా ఏదైనా ప్రైవేటు పాఠశాలలో నిత్య హాజరీ విద్యార్థిగా ప్రవేశం కల్పించబడుతుంది.
  • ఒకవేళ ప్రైవేటు పాఠశాలలో చేరితే, విద్యాహక్కు చట్టం నిబంధనల మేరకు ‘పీఎం కేర్స్’ నుంచి ఫీజు చెల్లించబడుతుంది.
  • దీంతోపాటు పిల్లలకు యూనిఫాం, పాఠ్య/నోట్ పుస్తకాల ఖర్చులు ‘పీఎం కేర్స్’ నుంచి మంజూరవుతాయి.

11-18 ఏళ్ల మధ్యగల పిల్లలకు పాఠశాల విద్య:

  • బాలలకు సైనిక్ స్కూల్, నవోదయ స్కూల్ వంటి కేంద్ర ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశం కల్పించబడుతుంది.
  • ఒకవేళ సంరక్షకులు/సంరక్షక తల్లిదండ్రులు/విస్తరిత కుటుంబం సంరక్షణలో ఉండేట్లయితే సమీపంలోని కేంద్రీయ విద్యాలయ లేదా ప్రైవేటు పాఠశాలలో నిత్య హాజరీ విద్యార్థిగా ప్రవేశం కల్పించబడుతుంది.
  • ఒకవేళ ప్రైవేటు పాఠశాలలో చేరితే, విద్యాహక్కు చట్టం నిబంధనల మేరకు ‘పీఎం కేర్స్’ నుంచి ఫీజు చెల్లించబడుతుంది.
  • దీంతోపాటు పిల్లలకు యూనిఫాం, పాఠ్య/నోట్ పుస్తకాల ఖర్చులు ‘పీఎం కేర్స్’ నుంచి మంజూరవుతాయి.

ఉన్నత విద్యకు మద్దతు:

  • దేశంలో ఉన్నత విద్యాభ్యాసం/వృత్తివిద్యా కోర్సులో చేరేందుకు అప్పటికి అమలులోగల విద్యారుణ నిబంధనల మేరకు విద్యా రుణసాయం అందించబడుతుంది. ఈ రుణంపై వడ్డీ ‘పీం కేర్స్’ నుంచి చెల్లించబడుతుంది.
  • దీనికి ప్రత్యామ్నాయంగా అండర్ గ్రాడ్యుయేట్/వొకేషనల్ కోర్సుల ట్యూషన్ ఫీజు/కోర్సు ఫీజులకు సమానంగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపకారవేతనం మంజూరు చేయబడుతుంది. అమలులోగల ఉపకారవేతన పథకాలకు వారు అర్హులుకాని పక్షంలో ‘పీఎం కేర్స్’ నుంచే తత్సమాన ఉపకారవేతనం మంజూరు చేయబడుతుంది.

ఆరోగ్య బీమా:

  • ఇలాంటి బాలలందరూ ‘ఆయుష్మాన్ భారత్’ (పీఎం-జేఏవై) కింద రూ.5లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకం కింద నమోదవుతారు.
  • బాలలకు 18 ఏళ్లు వచ్చేదాకా ‘పీఎం కేర్స్’ నుంచే బీమా రుసుము చెల్లించబడుతుంది.

 

***


(Release ID: 1722825) Visitor Counter : 501