శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

మిషన్ కోవిడ్ సురక్ష కింద  కొవాగ్జిన్‌ తయారీ కి ప్రధాన ముడి పదార్ధాన్ని (డ్రగ్‌ సబ్‌స్టాన్స్‌) జూన్ నెల నుంచి ఉత్పత్తి చేయనున్న ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్

Posted On: 28 MAY 2021 4:37PM by PIB Hyderabad

వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా, మిషన్ కోవిడ్ సురక్ష కింద కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఒకటి నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ కు చెందిన ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ (ఐఐఎల్).

 

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం ‘కొవాగ్జిన్‌’ టీకా మందును తన యూనిట్లో తయారు చేసి అందించడానికి హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) సన్నద్ధమవుతోంది. భారత్ బయోటెక్ లిమిటెడ్ తయారు చేస్తున్న కొవాగ్జిన్‌ తయారీలో ప్రధాన ముడి పదార్ధాన్ని (డ్రగ్‌ సబ్‌స్టాన్స్‌) ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) జూన్ 15 న ఉత్పత్తిని ప్రారంభించి, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కు టీకా తయారీకి జులై చివరకి అందజేస్తుందని ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఆనంద కుమార్ తెలిపారు. 

 

ఈ మేరకు మొదట్లో  2-3 మిలియన్ వ్యాక్సిన్ డోసుల కోసం డ్రగ్‌ సబ్‌స్టాన్స్‌ ను అందిస్తామని, ఆ తర్వాత కాలంలో దీన్ని 6-7 మిలియన్లకు పెంచుతామని, ఏడాది చివరి నాటికి 10-15 మిలియన్ల వరకు అందజేస్తామని  డా. ఆనంద కుమార్ తెలిపారు. ఐఐఎల్, జాతీయ పాడి అభివృద్ధి మండలిలో అంతర్భాగంగా పిల్లలు, జంతువుల వాక్సిన్ లపై పనిచేస్తోంది.

 

హైదరాబాద్ సమీపంలోని ఐఐఎల్,కరకపట్ల తయారీ విభాగాన్ని బయో సేఫ్టీ లెవల్-త్రీ యూనిట్ గా మారుస్తున్నట్లు, అదనంగా మరో ఉత్పాదక యూనిట్ నిర్మాణం కూడా చేపట్టామని డా. ఆనంద కుమార్ తెలిపారు.  కోవిడ్-19 లైవ్ వైరస్ ఆధారిత కొత్త వ్యాక్సిన్ ను తయారు చేసినట్లు కూడా ఐఐఎల్ ఎం.డి డాక్టర్ ఆనంద్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఇది జంతువులపై ప్రయోగించే దశలో ఉందని, వచ్చే ఏడాదికి మానవులపై వినియోగించవచ్చని ఆయన చెప్పారు.

 

ఆత్మ నిర్భర్ భారత్ 3.0 లో భాగంగా మిషన్ కోవిడ్ సురక్ష కింద  దేశీయ వాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్), హైదరాబాద్ -కి రూ. 60 కోట్ల గ్రాంట్ గా ఆర్థిక మద్దతు ను అందించింది.

 

*******



(Release ID: 1722480) Visitor Counter : 233