ఆయుష్

ఆయుష్ చికిత్సా సంబంధ కేసుల భండాగారం (ఆయుష్ క్లినికల్ కేస్ రిపోజిటరీ - ఏ సి సి ఆర్) పోర్టల్, ఆయుష్ సంజీవని యాప్ మూడవ సంచికను ప్రారంభించిన ఆయుష్ మంత్రి


ఆయుష్ చికిత్సా విధానాలు శాస్త్రీయమైనవి : శ్రీ కిరణ్ రిజ్ జూ

Posted On: 27 MAY 2021 7:57PM by PIB Hyderabad

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ  గురువారం మరో ముందడుగు వేసింది.   వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు,  క్రీడలు మరియు ఆయుష్  మంత్రిత్వ శాఖల  సహాయ  మంత్రి ( స్వతంత్ర)  శ్రీ కిరణ్ రిజ్ జూ  ఆయుష్ చికిత్సా సంబంధ కేసుల భండాగారం (ఆయుష్ క్లినికల్ కేస్  రిపోజిటరీ - ఏ సి సి ఆర్)  పోర్టల్,  ఆయుష్ సంజీవని యాప్ మూడవ సంచికను  ప్రారంభించారు.   ఇది చరిత్రాత్మకమని మరియు అత్యంత ముఖ్యమైందని ఆయుష్ మంత్రి అన్నారు.  ఆయుష్ చికిత్సా విధానాలు శాస్త్రీయమైనవని పేర్కొంటూ  భారతీయ సంప్రదాయ వైద్య విధానం మన జీవన విధానానికి అందిస్తున్న తోడ్పాటును తక్కువచేసి మాట్లాడే వారి వాదనలను కొట్టి పారేయడానికి  ఏ సి సి ఆర్ పోర్టల్,  సంజీవని యాప్ కీలక పాత్ర పోషించే చర్యలని మంత్రి అన్నారు.    ఆయుష్ మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ,  ప్రపంచంలో  సత్వర మార్పులు చోటుచేసుకుంటున్న ఈ తరుణంలో  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని  మంత్రి అన్నారు.  సంపన్నమైన,  శాస్త్రీయమైన భారతీయ ఆరోగ్య సంప్రదాయాలు శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగంలోకి తేవాలని ఆయన అన్నారు.  విశ్వ మహమ్మారి కరోనా  రోగుల చికిత్సలో ఆయుష్ కృషి మహత్తరమైనదని,   ఆత్మనిర్భర్ భారత్ కు గణనీయమైన తోడ్పాటును అందించగలదని అయన అన్నారు.   కొన్నేళ్ల  కిందట గౌరవనీయ ప్రధానమంత్రి  ప్రారంభించిన నమస్తే పోర్టల్ తరువాత ఇప్పుడు ఈ పోర్టల్ ప్రారంభించడం చరిత్రాత్మకమని కూడా అయన అన్నారు.    ఇప్పుడు ఆయుర్వేద,  అల్లోపతి వైద్య విధానాల మధ్య తారతమ్యాన్ని,  గొప్పతనాన్ని గురించి కొన్ని ప్రసార సాధనాలు పనిగట్టుకొని  కథనాలు ప్రసారం చేస్తున్నాయని ,  ఈ  చర్చ  పూర్తిగా నిరాధారమైనది,  అనవసరమైనదని కూడా మంత్రి అన్నారు.  
         ఈ సందర్భంగా ఆయుష్ కార్యదర్శి  వైద్య రాజేష్ కోటెచ  మాట్లాడుతూ  ఆయుష్ కేసుల రిపోజిటరీ మరియు  స్థాయి పెరిగిన సంజీవని యాప్  రెండూ కూడా విస్తృతమైన డిజిటల్ ఆరోగ్య కార్యక్రమానికి తోడ్పడగలవని  అన్నారు.  ఆయుష్ తన శాస్త్రీయ పనులను మరింత ముందుకు తీసుకెళ్లడానికి  ఈ  రిపోజిటరీ  మరియు యాప్ సహాయపడగలవని  కార్యదర్శి ఉద్ఘాటించారు.  
          ఆయుష్ వైద్యులు మరియు సాధారణ ప్రజానీకానికి   ఆయుష్ చికిత్స రిపోజిటరీ పోర్టల్ (https://accr.ayush.gov.in/)  ఒక వేదికగా ఉపయోగపడగలదు.  
         కేరళకు చెందిన అమృతా స్కూల్ ఆఫ్ ఆయుర్వేద  రీసర్చ్ రాయిరెక్టర్ డాక్టర్ పి.  రామ్ మనోహర్  ఏసిసిఆర్ పోర్టల్ ప్రాముఖ్యతను  గురించి  వివరించారు.   కోవిడ్ -19   మహమ్మారి రోగులకు చికిత్స చేయడానికి ఆయుష్ వైద్యులు ఉపయోగించిన ప్రక్రియలేమిటి?  రోగుల స్పందన ఎలావుంది,  నయమైన తీరు  వంటి విషయాలను క్రోడీకరించి నిక్షిప్తం చేయడానికి ఈ పోర్టల్ ఎంతగానో సహాయపడగలదని  ఆయన వెల్లడించారు.  వివిధ  వ్యాధుల చికిత్సలో  ఆయుష్ వైద్యవిధానం  శక్తిసామర్ధ్యాలను లిఖితం చేస్తుంది.  
          ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ) ప్రధాన కార్యాలయం  సంప్రదాయ వైద్య విభారంలో  ఆయుష్ మంత్రిత్వ శాఖ తరపున టెక్నీకల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ జి. గీతాకృష్ణన్  మాట్లాడుతూ స్థాయి పెరిగిన సంజీవని యాప్ వైద్యులకు మరియు సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని అన్నారు.  వ్యాధిలక్షణ రహిత,  స్వల్ప,  మితమైన  కోవిడ్- 19  కేసుల చికిత్సలో ఆయుష్ సామర్ధ్యం,  రోగుల స్పందన,  కోలుకునే తీరు మొదలైన అంశాలను,   ఆయుష్ 64 ,  కాబాసుర కుడినీర్ మందుల వినియోగం వంటి విషయాలను  అధ్యయనం చేసి / లిఖితం చేయడానికి యాప్ ఎంతగానో తోడ్పడగలదని ఆయన అన్నారు.  

 

***
 



(Release ID: 1722442) Visitor Counter : 304