ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
దేశ చట్టాలను ట్విట్టర్ గౌరవించక తప్పదు.. స్పష్టం చేసిన కేంద్రం
తన లొసుగులను కప్పిపుచ్చుకొనేందుకు భారత్ ను అగౌరపరుస్తూ ట్విట్టర్ విడుదల చేసిన నిరాధారమైన,తప్పుడు ప్రకటనను తీవ్రంగా ఖండించిన కేంద్రం
Posted On:
27 MAY 2021 7:20PM by PIB Hyderabad
భారతదేశ చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి ట్విట్టర్ పనిచేయవలసి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. భారతదేశ చట్టాలు, నిబంధనలపై ట్విట్టర్ విడుదల చేసిన ప్రకటన పట్ల కేంద్రం తీవ్ర ఆక్షేపణ తెలుపుతూ వాటిని ఖండించింది. భావ స్వేచ్ఛపై ఘనమైన చరిత్ర కలిగివున్న భారతదేశం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని కేంద్రం స్పష్టం చేసింది. లాభాల కోసం పనిచేస్తున్నప్రైవేట్ విదేశీ సంస్థ అయిన ట్విట్టర్ కు భావ స్వేచ్ఛ పరిరక్షణతో ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భావ స్వేచ్ఛ పరిరక్షణ అనేది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ప్రభుత్వం దాని సంస్థలపై ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ట్విట్టర్ విడుదల చేసిన ప్రకటన ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగివున్న దేశంపై తన భావాలను రుద్దే ఉందని కేంద్రం ఆరోపించింది. భారతదేశ న్యాయ వ్యవస్థను కించపరుస్తూ ధిక్కరించే విధంగా ట్విట్టర్ ప్రకటన ఉందని ఆక్షేపించింది. తన నేర బాధ్యత నుంచి తప్పించుకుని రక్షణ పొందడానికి ఉపయోగించుకుంటున్న చట్ట నిబంధనలను గౌరవించి పాటించడానికి ట్విట్టర్ నిరాకరించడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
నిబంధనలకు కట్టుబడి ఉంటామని చెబుతున్న ట్విట్టర్ అటువంటి నిబంధనల వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని కేంద్రం ప్రశ్నించింది. భారతదేశంలో పనిచేస్తున్న ట్విట్టర్ ప్రతినిధులు తమకు ఎటువంటి అధికారాలు లేవని చెబుతూ తమతోపాటు భారతదేశ సమస్య పరిష్కారానికి అమెరికాలో ఉన్న సంస్థ ప్రధానకార్యాలయాన్ని ఆశ్రయించాలని అంటూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్న సమయంలో భారతదేశంలో తమ సేవలు ఉపయోగిస్తున్నవారిని రక్షిస్తామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.
భారతదేశం పెద్దసంఖ్యలో వినియోగదారులను కలిగి ఉండి ఆదాయాన్ని ఆర్జిస్తున్న ట్విట్టర్ దేశంలో సమస్యల పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రభుత్వం నిలదీసింది. ఇటువంటి వ్యవస్థ ముఖ్య అధికారి, నోడల్ అధికారితో ఏర్పాటైతే ట్వీట్ల ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్న ట్విట్టర్ వినియోగదారులు ఫిర్యాదు చేయడానికి అవకాశం కలుగుతుంది.
పరువునష్టం, మార్పు చేసిన చిత్రాలు, లైంగిక వేధింపులు, ఇతర దుర్వినియోగాల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఇటువంటి నిబంధనల వల్ల న్యాయం పొందడానికి వీలవుతుంది.
ఈ నిబంధనలను సామజిక మాధ్యమాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి రూపొందించామని ప్రభుత్వం వివరించింది. ముసాయిదా నిబంధనలకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖలు విస్తృత ప్రచారాన్ని కల్పించి ప్రజాభిప్రాయాన్ని సేకరించామని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు, ప్రజా సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులు, సంస్థల ప్రతినిధుల నుంచి సూచనలు అందాయని ప్రభుత్వం వివరించింది. వీటిని వ్యతిరేకిస్తూ కూడా సూచనలు అందాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశంలో తగిన చర్యలను తీసుకొవాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టుతో సహా అనేక న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆదేశించామని, దీనిపై పార్లమెంట్ లో కూడా చర్చలు జరిగాయని ప్రభుత్వం వివరించింది.
భారతదేశ రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన అంశాలు ప్రాధమికహక్కులుగా ఉన్నాయి. భారతప్రభుత్వం ప్రజల హక్కులను గౌరవిస్తుంది. ప్రశ్నించడానికి, ట్విట్టర్ తో సహా సామాజిక మాధ్యమాల్లో విమర్శించడానికి ప్రజలకు హక్కు ఉంది. ఇదేసమయంలో భారత ప్రభుత్వం గోప్యత హక్కును ప్రభుత్వం సమానంగా గౌరవిస్తుంది. అయితే, ట్విట్టర్ మాత్రమే తన విధానాలతో ప్రజల ఖాతాలను, ట్వీట్లను సస్పెండ్ చేస్తూ వారి భావ ప్రకటన స్వేచ్చకు భంగం కలిగిస్తున్నదని ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటికైనా ట్విట్టర్ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకుండా దేశ చట్టాలను గౌరవిస్తూ వాటిని పాటించడం మంచిదని భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది. చట్టాలను,విధానాలను రూపొందించి అమలు చేసే పూర్తి అధికారం సార్వభౌమాధికారం కలిగిన ప్రభుత్వం మాత్రమే కలిగివుంటుంది ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్విట్టర్ ఒక సామజిక మాధ్యమం మాత్రమే అని స్పష్టం చేసిన ప్రభుత్వం దేశ న్యాయ చట్టాలు ఏవిధంగా ఉండాలన్న అంశంపై మాట్లాడే హక్కు దానికి లేదని పేర్కొంది.
భారతదేశ ప్రజలకు తాను కట్టుబడి వున్నానని ట్విట్టర్ చెప్పుకోవడం విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్న ప్రభుత్వం ఇది ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదని పేర్కొంది. దీనికి సంబంధించి కొన్ని ఉదంతాలను ప్రభుత్వం తన ప్రకటనలో ప్రస్తావించింది.
* భారతదేశం, చైనాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సరిహద్దు సంబంధిత సమస్యలను శాంతియుతంగా పరిష్కరించు కోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని కొన్ని ప్రదేశాలను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగా ట్విట్టర్ చూపించింది. భారతదేశ సున్నితత్వం మరియు ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఉన్న ఈ అంశాన్ని అనేకసార్లు ఫిర్యాదు చేసిన అనేక రోజుల తరువాత ట్విట్టర్ దీనిని సరిచేసింది .
* అమెరికాలోని కాపిటల్ హిల్ వద్ద హింసకు పాల్పడినవారిగా భావించిన వినియోగదారులపై ట్విట్టర్ తనంతట తానుగానే (సు-మోటో) చర్య తీసుకుంది. కానీ, ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద జరిగిన చట్టవిరుద్ధమైన సంఘటనలు, మారణహోమం సృష్టించడానికి ప్రణాళికసిద్ధం అయిదంటూ హింసను ప్రేరేపించే విధంగా వస్తున్న అంశాలను తొలగించాలని భారత ప్రభుత్వం చేసిన చట్టబద్ధమైన అభ్యర్థనపై సత్వర చర్య తీసుకోవడానికి ట్విట్టర్ నిరాకరించింది. నష్టం జరిగిన తరువాత అది పాక్షికంగా చర్యలను అమలు చేసింది.
* బాధ్యత లేకుండా ట్విట్టర్ వ్యవహరించడం వల్ల భారతదేశం మరియు భారతీయులకు వ్యతిరేకంగా నకిలీ మరియు హానికరమైన అంశాలు ప్రచారం అయ్యాయి. వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ వేదికగా విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై ట్విట్టర్ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇదేనా ట్విట్టర్ కు భారత ప్రజల పట్ల ఉన్న నిబద్ధత?
* భారతీయ సంతతికి చెందిన భారతీయులపై మరియు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులపై వివక్షపూరిత విధానాన్ని ట్విట్టర్ అనుసరిస్తోంది. బి .1.617 ఉత్పరివర్తనానికి హానికరమైన ట్యాగింగ్ కారణంగా ‘ఇండియన్ వేరియంట్’ గా ప్రచారం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిన ఈ నకిలీ కథనాలు మరియు ట్వీట్లపై కూడా ట్విట్టర్ అటువంటి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే భారత ప్రజలకు సేవ చేస్తానని ట్విట్టర్ గొప్పలు చెప్పుకొంటున్నది.
ట్విట్టర్ అనేది అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ. ఇటువంటి సంస్థ
"ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడానికి" సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర ప్రభుత్వం నుండి "నిర్మాణాత్మక సంభాషణ", "సహకార విధానం" కోరుకుంటున్నట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా ట్విట్టర్ వాస్తవాలను గుర్తించి భారతదేశ చట్టాలను గౌరవించడం మంచిది అని ప్రభుత్వం హితవు పలికింది.
భారతదేశంలో ట్విట్టర్ తో సహా అన్ని సామజిక మాధ్యమాల ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చిన ప్రభుత్వం వారి వ్యకిగత రక్షణ భద్రతకు ఎటువంటి ముప్పు ఉండదని స్పష్టం చేసింది.
ట్విట్టర్ విడుదల చేసిన ప్రకటనను ఖండించిన ప్రభుత్వం ఇది వాస్తవాలకు దూరంగా, నిరాధారంగా తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ భారతదేశ గౌరవాన్ని కించపరిచేవిధంగా ఉందని పేర్కొంది.
ట్విట్టర్ ఫిర్యాదు ఆధారంగా చేపట్టిన దర్యాప్తుపై ఢిల్లీ పోలీసులు వివరణాత్మక పత్రికా ప్రకటనను విడుదల చేశారు, ఇది ట్విట్టర్ లేవనెత్తిన నిరాధారమైన ఆరోపణలకు సమాధానం ఇస్తుంది.
(Release ID: 1722361)
Visitor Counter : 318