ప్రధాన మంత్రి కార్యాలయం
బుద్ధ పూర్ణిమ సందర్భం లో వర్చువల్ పద్ధతి న జరిగిన వేసాక్ దివస్ ఉత్సవాల లో ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం
Posted On:
26 MAY 2021 12:16PM by PIB Hyderabad
గౌరవనీయులైన మహాసంఘ సభ్యులు, నేపాల్, శ్రీలంక ల ప్రధాన మంత్రులు, మంత్రి వర్గం లో నా సహచరులు శ్రీ ప్రహ్లాద్ సింహ్, శ్రీ కిరెన్ రిజిజూ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సెక్రట్రి జనరల్ , పూజనీయ డాక్టర్ ధమ్మపియాజీ, మాన్య పండితులు, ధమ్మ అనుయాయులు, ప్రపంచ వ్యాప్తం గా ఉన్న సోదరీమణులు, సోదరులారా.
నమోః బుద్ధాయ.
నమస్తే.
వేసాక్ తాలూకు ఈ ప్రత్యేక దినాన మీ అందరినీ ఉద్దేశించి ప్రసంగించడం ఓ గౌరవం గా నేను భావిస్తున్నాను. వేసాక్, భగవాన్ బుద్ధుని జీవనాన్ని స్మరించుకొనేటటువంటి రోజు. ఇది మన భూమి అభ్యున్నతి కోసం ఆయన ప్రవచించిన మహనీయ ఆదర్శాలను, ఆయన చేసిన బలిదానాలను గురించి చింతన చేసుకొనే అటువంటి రోజు కూడాను.
గత సంవత్సరం కూడా, నేను వేసాక్ దినానికి సంబంధించిన ఒక కార్యక్రమం లో ప్రసంగించాను. ఆ కార్యక్రమం కోవిడ్-19 మహమ్మారి కి వ్యతిరేకం గా మానవతా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్‌లైన్ శ్రమికుల కు అంకితం గా నిర్వహించడం జరిగింది. ఒక సంవత్సరం తరువాత, మనం కొనసాగింపు మరియు మార్పు ల మేళనాన్ని గమనిస్తున్నాం. కోవిడ్-19 మహమ్మారి మనలను విడచిపెట్టలేదు. భారతదేశం తో సహా చాలా దేశాలు సెకండ్ వేవ్ ను ఎదుర్కొన్నాయి. ఇది దశాబ్దాలు గా మానవాళి కి ఎదురుపడ్డ అన్నింటి కంటే ఘోరమైనటువంటి సంకటం. మనం ఇటువంటి మహమ్మారి ని ఒక శతాబ్ద కాలం లో చూడలేదు. పూర్తి జీవన కాలం లో ఒక సారి మన ముందరకు వచ్చిన ఈ మహమ్మారి చాలా ఇళ్ల కు విషాదాన్ని, బాధల ను తెచ్చిపెట్టింది.
ఈ మహమ్మారి ప్రతి దేశంపైన ప్రభావాన్ని చూపించింది. దీని ఆర్థిక ప్రభావం కూడా చాలా ఎక్కువ గా ఉంది. కోవిడ్-19 తరువాతి మన ధరణి మునుపటి లా ఉండబోదు. రాబోయే కాలం లో, మనం ఖచ్చితం గా సంఘటనల ను కోవిడ్ కి ముందటివిగా గాని, కోవిడ్ కు తరువాతవి గా గాని గుర్తు పెట్టుకొంటాం. కానీ, గత ఏడాది కాలం లో, అనేక గుర్తించదగిన మార్పులు కూడా చోటు చేసుకొన్నాయి. ఇప్పుడు మనకు మహమ్మారి పై మెరుగైన అవగాహన ఉంది, అది దీనికి వ్యతిరేకంగా మన పోరాటాన్ని బలపరచింది. అన్నిటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మన దగ్గర టీకా మందు ఉంది, అది ప్రాణాల ను కాపాడటానికి, మహమ్మారి ని ఓడించడానికి ఎంతో అవసరమైనటువంటిది. మహమ్మారి తలెత్తిన ఒక సంవత్సరం లోపే వ్యాక్సీన్ ను సిద్ధం చేయడం అనేది మానవుల దృఢసంకల్పాన్ని, తపన తాలూకు బలాన్ని చాటుతున్నది. కోవిడ్ -19 టీకా మందు ను ఆవిష్కరించడానికి పాటుపడ్డ శాస్త్రవేత్తల ను చూసి భారతదేశం గర్వపడుతోంది.
ఈ వేదిక తాలూకు మాధ్యమం ద్వారా, నేను మరొక్క సారి మన ఫస్ట్ రిస్పాండర్స్, ఫ్రంట్ లైన్ హెల్థ్ కేయర్ వర్కర్స్, డాక్టర్ లు, నర్సు లు, స్వచ్ఛంద సేవకుల కు వందనం ఆచరించాలనుకొంటున్నాను. వారు నిస్వార్థ భావం తో ప్రతి రోజూ ఆపన్నులకుసేవ చేయడం కోసం వారి జీవనాన్ని అపాయం లో పడవేసుకొంటున్నారు. ప్రియతములను కోల్పోయిన వారికి నేను నా సంతాపాన్ని వ్యక్తం చేయదలుస్తున్నాను. వారి బాధ లో నేను పాలు పంచుకొంటున్నాను.
మిత్రులారా,
భగవాన్ బుద్ధుని జీవితాన్ని అధ్యయనం చేసే సమయం లో, నాలుగు ప్రదేశాల గురించిన ప్రస్తావన కనపడుతుంది. ఈ నాలుగు స్థలాలు భగవాన్ బుద్ధుని కి మానవీయ బాధల ను పరిచయం చేశాయి. దీనితో పాటు, మానవ వేదన ను దూరం చేయడానికి ఆయన జీవితాన్ని అంకితం చేయాలనే కోరిక ను కూడా ఆయన లో రగిలించాయి కూడాను.
భగవాన్ బుద్ధుడు మనకు ‘భవతు సబ్బ మంగలమ్’, ఆశీర్వాదం, కరుణ, అందరి సంక్షేమం గురించి నేర్పించారు. గత సంవత్సరం లో, మనం అనేక మంది వ్యక్తులు, సంస్థ లు ఈ కష్ట కాలంతో పోటీ పడటం కోసం ముందుకు వచ్చి, బాధ ను తగ్గించడం కోసం సాధ్యమైన ప్రతి ప్రయాస ను చేయడాన్ని చూశాం.
ప్రపంచ వ్యాప్తం గా బౌద్ధ సంస్థ లు, బౌద్ధమతం యొక్క అనుచరులు, మహమ్మారి కాలం లో ప్రజల కు అనేక రకాల పరికరాల ను, సామగ్రి ని ఉదారం గా అందించారని నేను కూడా తెలుసుకొన్నాను. జనాభా ను, భౌగోళిక విస్తరణ ను పరిశీలిస్తే, ఈ సహాయం చాలా విస్తృతంగా ఉంది. మనుషుల ఔదార్యం, సహకారం.. వీటి ప్రాబల్యం తోటి మానవుల నున వినమ్రులు గా మార్చివేసింది. ఈ పనులు అన్నీ భగవాన్ బుద్ధుని బోధనల కు అనుగుణం గా ఉంటాయి. ఇది సర్వోన్నత మంత్రం ‘అప్ప దీపో భవ’ ను ప్రకటిస్తున్నది.
మిత్రులారా,
కోవిడ్-19 ఖచ్చితం గా మనం ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సవాలు. దాని తో పోరాడటానికి మనం చేయగలిగినదంతా చేస్తున్నప్పటికీ, మానవాళి ఎదుర్కొంటున్న ఇతర సవాళ్ల ను మనం విస్మరించకూడదు. జల వాయు పరివర్తన అతి పెద్ద సవాళ్ల లో ఒకటి. వర్తమానం యొక్క నిర్లక్ష్య జీవిత శైలులు రాబోయే తరాలకు ముప్పు ను కొనితెచ్చాయి. వాతావరణ నమూనాలు మారుతున్నాయి. హిమానీనదాలు కరుగుతున్నాయి. నదులు, అడవులు ప్రమాదం లో పడ్డాయి. మన పుడమి ని గాయపడనివ్వలేం. ప్రకృతి మాత ను గౌరవించడం అన్నింటి కన్న మిన్న గా ఉండేటటువంటి జీవన శైలి అవసరం అని భగవాన్ బుద్ధుడు నొక్కిచెప్పారు.
పారిస్ లక్ష్యాల ను నెరవేర్చుకొనే మార్గం లో ఉన్న కొన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థల లో భారత దేశం కూడా ఒకటి అనే విషయాన్ని తెలియజెప్పడం నాకు గర్వంగా అనిపిస్తోంది. మాకు, సతత జీవనం, కేవలం సరైన మాటల గుచ్ఛం మాత్రమే కాదు, అది సరైన కార్యాలను చేసేందుకు సంబంధించింది కూడాను.
మిత్రులారా,
గౌతమ బుద్ధుని జీవనం శాంతి, సామరస్యం, సహ జీవనం లపైన ఆధారపడింది. ఈనాటికీ, ద్వేషాన్ని, ఉగ్రవాదాన్ని, మూర్ఖత్వం నిండిన హింస ను వ్యాప్తి చేయడం మీదే ఆధారపడ్డ అస్తిత్వం కలిగిన శక్తులంటూ ఉన్నాయి. అటువంటి శక్తులు ఉదార ప్రజాస్వామ్య సూత్రాల ను నమ్మవు. మానవాళి ని విశ్వసించే వారందరూ ఒక్కటై ఉగ్రవాదాన్ని, సమూల సంస్కరణవాదాన్ని ఓడించాలి అనేది ప్రస్తుత కాలపు డిమాండు గా ఉంది.
ఇందుకోసం భగవాన్ బుద్ధుడు చూపినటువంటి మార్గాన్ని అనుసరించడం ఎప్పటికీ సముచితమే. భగవాన్ బుద్ధుని బోధనల తో పాటు సామాజిక న్యాయానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యం యావత్తు ప్రపంచాన్ని ఒకే సూత్రం లో గుదిగుచ్చే శక్తి గా మారగలుగుతాయి. ‘‘నత్తీ సంతి పరణ సుఖ:’’ అని ఆయన సరిగానే చెప్పారు. ఈ మాటల కు శాంతి కంటే మించిన సుఖం ఏదీ లేదు అని భావం.
మిత్రులారా,
భగవాన్ బుద్ధుడు యావత్తు విశ్వానికి ప్రకాశపుంజం. ఆయన నుంచి మనమందరం ఎప్పటికప్పుడు పేరణ ను పొందాం, కరుణ, సార్వత్రిక బాధ్యత, శ్రేయం ల మార్గాన్ని ఎంచుకొన్నాం. ‘‘బుద్ధుడు మనకు ఆడంబరాన్ని వదలిపెట్టమని, అంతిమం గా సత్యం, ప్రేమ ల విజయం పైన బరోసా పెట్టుకోవడాన్ని నేర్పారు’’ అంటూ గౌతమ బుద్ధుని విషయం లో మహాత్మ గాంధీ సరి అయిన మాటలనే చెప్పారు.
ఈ రోజు న బుద్ధ పూర్ణిమ సందర్భం లో, రండి మనం భగవాన్ బుద్ధుని ఆదర్శాల పట్ల మన నిబద్ధత ను మరొక్క మారు పునరుద్ధరించుదాం.
కోవిడ్-19 ప్రపంచవ్యాప్త వ్యాధి తాలూకు సవాలు తో కూడిన సమయం లో ఊరట కై త్రిరత్నాల ను ప్రార్థించడం లో మీ అందరి తో పాటు నేనూ పాలుపంచుకొంటున్నాను.
ధన్యవాదాలు.
మీకు అనేకానేక ధన్యవాదాలు.
***
(Release ID: 1722025)
Visitor Counter : 279
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam