ఆర్థిక మంత్రిత్వ శాఖ

రూ.6 ట్రిలియన్లు దాటిన 'పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ' పరిధిలోని "నిర్వహణలోని ఆస్తులు"


పింఛను ఆస్తులను రూ.6 ట్రిలియన్లకు చేర్చిన ఎన్‌పీఎస్‌, ఏపీవై చందాదారుల చందాలు

ఈ నెల 21వ తేదీ వరకు ఎన్‌పీఎస్‌లో 11.53 లక్షల మందితో 8,791 కార్పొరేట్ సంస్థల నమోదు
అటల్‌ పెన్షన్‌ యోజన కింద 2.82 కోట్ల మంది చందాదారులు

Posted On: 26 MAY 2021 3:55PM by PIB Hyderabad

'జాతీయ పింఛను వ్యవస్థ' (ఎన్‌పీఎస్‌), 'అటల్‌ పెన్షన్‌ యోజన' (ఏపీవై) పరిధిలోని "నిర్వహణలోని ఆస్తులు" (ఏయూఎం) 13 ఏళ్ల తర్వాత రూ.6 లక్షల కోట్లు (రూ.6 ట్రిలియన్లు) దాటాయని 'పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ' (పీఎఫ్‌ఆర్‌డీఏ) ప్రకటించింది. ఏయూఎంలో చివరి రూ.లక్ష కోట్లు కేవలం 7 నెలల్లోనే వచ్చాయని వెల్లడించింది.

    కొన్నేళ్లుగా 74.10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 28.37 లక్షల మంది ప్రభుత్వేతర రంగ వ్యక్తులతో ఎన్‌పీఎస్‌ చందాదారుల్లో గణనీయమైన వృద్ధిని పీఎఫ్‌ఆర్‌డీఏ చూసింది. వీరితో కలిపి మొత్తం చందాదారుల సంఖ్య 4.28 కోట్లకు పెరిగింది.

    "రూ.6 ట్రిలియన్ల ఏయూఎం మైలురాయిని చేరుకున్నందుకు సంతోషంగా ఉంది. ఏడు నెలల్లోపు, 2020 అక్టోబర్‌లో 5 ట్రిలియన్ల దగ్గరున్నాం. ఎన్‌పీఎస్, పీఎఫ్‌ఆర్‌డీఏ పట్ల చందాదారులకు ఉన్న నమ్మకానికి ప్రస్తుత ఘనతే నిదర్శనం. ఈ మహమ్మారి కాలంలో, పదవీ విరమణ ప్రణాళికలకు, ఆర్థిక భద్రతకు వ్యక్తులు ప్రాధాన్యమిస్తున్నారు" అని పీఎఫ్‌ఆర్‌డీఏ అధ్యక్షుడు శ్రీ సుప్రతిం బందియోపాధ్యాయ వెల్లడించారు. 

    ఈ ఏడాది మే 21 నాటికి, ఎన్‌పీఎస్‌, ఏపీవై చందాదారుల సంఖ్య 4.28 కోట్లు చేరగా, ఏయూఎం రూ.603,667.02 కోట్లకు పెరిగింది.

పీఎఫ్‌ఆర్‌డీఏ గురించి:
 
    పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన రాజ్యంగబద్ధ సంస్థ 'పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ'. ఈ చట్ట పరిధిలోకి వచ్చే జాతీయ పింఛను వ్యవస్థ, పింఛను పథకాల నియంత్రణ, ప్రోత్సాహం, క్రమబద్ధ అభివృద్ధిని నిర్ధరించడం ఈ సంస్థ విధులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004 జనవరి 1వ తేదీ నుంచి ఎన్‌పీఎస్‌ను తీసుకొచ్చినా, తర్వాత దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఉద్యోగులను ఇందులో చేర్చాయి. స్వచ్ఛంద ప్రాతిపదికన భారతీయులందరికీ (నివాసులు/ప్రవాసులు/విదేశాల్లో ఉన్నవారు), తమ ఉద్యోగుల కోసం కార్పొరేట్‌ సంస్థలకు ఎన్‌పీఎస్‌ భరోసా లభిస్తుంది.

 

****



(Release ID: 1721920) Visitor Counter : 179