ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వ్యాధుల వెల్లువను అరికట్టే పరిజ్ఞానం, సామర్థ్యం ప్రపంచానికి పుష్కలం
అయితే అభిప్రాయాల మార్పిడి, సహకారం చాలా కీలకం
“కోవిడ్ సంక్షోభం- ఆరోగ్య సేవల కొనసాగింపు”పై
ఉన్నత స్థాయి చర్చలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ స్పష్టీకరణ
Posted On:
25 MAY 2021 7:04PM by PIB Hyderabad
“కోవిడ్-19 సంక్షోభంలో ఆరోగ్య సేవల కొనసాగింపు” అన్న అంశంపై ఈ రోజు జరిగిన అత్యున్నత స్థాయి ప్యానెల్ చర్చా కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి సహాయ ప్రధాన కార్యదర్శి, ఐక్యరాజ్యసమితి శిక్షణా పరిశోధనా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖిల్ సేథ్, ఇన్.స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ఇన్నొవేషన్స్, కోవిడ్ వ్యవహారాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ కు ప్రత్యేక రాయబారి అయిన డాక్టర్ డేవిడ్ నబారో, ది డిఫీట్-ఎన్.సి.డి. పార్టనర్ షిప్ కార్యక్రమం ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) ముకుల్ భోలా, గాంబియా ఆరోగ్య శాఖ మంత్రి అహ్మదౌ లామిన్ సమతే, రువాండా ఆరోగ్యశాఖ మంత్రి డేనియల్ ఎన్.గమీజే, భూటాన్ రాజరిక ప్రభుత్వ ఆరోగ్య మంత్రి లియాన్పో దెచెన్ వాంగ్మో, ఇస్లాం అభివృద్ధి బ్యాంకు ప్రెసిడెంట్ బందార్ ఎం.హెచ్. హజ్జార్, ఆరోగ్యరక్షణ సంస్థ అయిన వైయాట్రిస్,. ఎమర్జింగ్ మార్కెట్స్ ప్రెసిడెంట్ మెనాస్సీ టాడెసే ఈ చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
చర్చా కార్యక్రమం సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ, అంటువ్యాధులు కాని ఇతర వ్యాధులపై విజయం సాధించడమే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి శిక్షణా పరిశోధనా సంస్థలో రూపొందించిన భాగస్వామ్య కార్యక్రమం అభినందనీయమని అన్నారు. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో వ్యాధుల చికిత్సకోసం నిరాటంకంగా ఆరోగ్య సేవలను అందించేందుకు తగిన చర్యలకోసం వివిధ దేశాలకు పిలుపునిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. మానవాళికి ప్రస్తుతం ఎదురైన సంక్షోభంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆరోగ్య సేవలను కొనసాగించే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటువ్యాధుల వర్గీకరణ కిందకు రాని ఇతర వ్యాధుల వల్లనే ప్రపంచ వ్యాప్తంగా రోగాల భారం పెరుగుతూ వస్తోందన్న అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని వ్యాధులపై విజయం పేరిట భాగస్వామ్యం కార్యక్రమానికి రూపు దిద్దినట్టు కేంద్రమంత్రి చెప్పారు. ఈ వ్యాధులతో ప్రపంచంలో ప్రతి సంవత్సరం 4.1కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రపంచ వ్యాప్తంగా సంభవించే మొత్తం మరణాల్లో 70శాతానికి ఇది సమానమని ఆయన అన్నారు.
ప్రస్తుతం నెలకొన్న విభిన్నమైన విపత్కర పరిస్థితిని, కోవిడ్-19 మహమ్మారి రూపంలో ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును గురించి డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 34.6లక్షలమంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మహమ్మారి వైరస్ సెకండ్ వేవ్ తో భారతదేశం కూడా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.
అత్యంత ఆవశ్యకమైన ఆరోగ్య సేవలను అందించాల్సిన అవసరం, ప్రపంచ ఆరోగ్య సేవల సామర్థ్యంపై కోవిడ్-19 వైరస్ మహమ్మారి ప్రభావం తదితర అంశాలను డాక్టర్ హర్షవర్ధన్ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సేవలను నిరాటంకంగా కొనసాగించవలసిన అవసరం ఉందన్నారు. “కోవిడ్ రోగుల చికిత్సకు సంబంధించి కనీ వినీ ఎరుగని రీతిలో పెరుగుతున్న డిమాండ్ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మన ఆరోగ్య సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది ప్రస్తుతం మహమ్మారి నియంత్రణా కార్యకలాపాల్లోనే తలమునకలైన పరిస్థితి నెలకొంది. మహమ్మారి వైరస్ నియంత్రణ కార్యకలాపాల కారణంగా అత్యంత ఆవశ్యక ఆరోగ్య వ్యవస్థలు అందించాల్సిన ఇతర కార్యకలాపాలపై రాజీ పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించుకోవడానికి, ఇతర ఆరోగ్య సమస్యలతో తలెత్తే మరణాలను తగ్గించకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని, కోవిడ్ సంబంధిత కార్యకలాపాలపై దృష్టిని కేంద్రీకరిస్తూనే, మరో వైపు ఇతర అత్యవసర ఆరోగ్య సేవలను కూడా అందించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి అన్నారు.
సార్వత్రిక ఆరోగ్య సేవల వర్తింపును సాధించేందుకు, అంటువ్యాధులు కాని ఇతర వ్యాధుల ద్వారా సంభవించే మరణాలను మూడింట ఒక వంతుకు తగ్గించేందుకు ఆరోగ్య రక్షణ వ్యవస్థలు ఎంతో పరివర్తన చెందాల్సి ఉందని డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. “ఎవరు కూడా వెనుకబడేలా చేయకూడదు” అనేది,. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించిన మంత్రమని, ప్రజారోగ్య కార్యక్రమ సువిశాల దృక్పథం ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తోందని మంత్రి అన్నారు. భాగస్వామ్య వర్గాలన్నీ ప్రజారోగ్య కార్యక్రమం లక్ష్యంతో ముందుకు సాగాలి. తాజాగా ఎదుర్కొంటున్న సంక్షోభం, సవాళ్ల నేపథ్యంలో అంటువ్యాధులు కాని ఇతర వ్యాధులకు చికిత్సను, ఆరోగ్య సేవలను నిరాటంకంగా కొనసాగించే అంశంపై జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని ప్రపంచ వ్యాప్త నేతలు, ప్రభుత్వాలు, భాగస్వామ్య వర్గాలు సునిశితంగా గమనించడానికి ఇదే కారణం. ఈ నాటి సమావేశం మనందరం కలసికట్టుగా పనిచేయడానికి ఒక సదవకాశం. మహమ్మారి వ్యాప్తి సమయంలో ఇతర వ్యాధులు కలిగించే బాధలను, మరణాలను తగ్గించే చర్యలు మరింత బలోపేతం కావాలి.” అని ఆయన అన్నారు.
అంటువ్యాధులు కాని ఇతర వ్యాధుల నిరోధంపై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను 2011, 2014లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి కూడా నివేదించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. “ప్రపంచ వ్యాప్తంగా సంభవించే మరణాల్లో 70శాతం మరణాలకు ఇతర వ్యాధులే కారణమైనపుడు, భారతదేశంలో ఈ మరణాలు కాస్త తక్కువగా అంటే 63శాతంగా ఉన్నాయి. ఇతర వ్యాధుల ద్వారా 2015లో లక్ష జనాభాకు నమోదైన 503 మరణాలను 2019లో 490కి తగ్గించగలిగాం. ప్రభుత్వం వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టడం వల్లనే మరణాల సంఖ్య ఈ మాత్రం తగ్గింది. దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన 76,102 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల్లో ఇతర వ్యాధుల చికిత్స, ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పి.ఎం.జె.ఎ.వై.) పథకాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిని విస్తృతం చేశాయి. వాటిలో వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశాం. దీనితో ఇతర వ్యాధుల చికిత్సకు సంబంధించి పది కోట్లమంది జనాభాపై వ్యయభారం కూడా తగ్గింది. పొగాకు, ఉప్పు, చక్కెర వంటి వాటి కారణంగా ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశాలను తగ్గించేందుకు బహుముఖ కార్యాచరణ ప్రణాళికను మొదట ప్రకటించిన దేశాల్లో భారతదేశం కూడా ఉంది. ఈ ప్రణాళిక మేరకు ఇళ్లలో కాలుష్యం తగ్గించేందుకు కట్టెల పొయ్యి స్థానంలో వంటకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది ఇళ్లకు వంటగ్యాస్ ను అందించడంతో గ్రామీణ మహిళల్లో దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు తగ్గిపోయాయి.” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
దేశంలో టెలీమెడిసిన్ వంటి సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయవలసిన ఆవశ్యకతను, ప్రాముఖ్యతను మంత్రి వివరిస్తూ,.. కోవిడ్ వైరస్ సంక్షోభం నెలకొన్న కష్టకాలంలో కూడా టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు జరిపిన తీరును తెలియజేశారు. “ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రైవేటు రంగానికి ఉన్న విస్తృత పాత్ర భారతదేశానికి ఓ విభిన్నమైన సానుకూల అంశం. టెలిమెడిసిన్, కృత్రిమ మేధో పరిజ్ఞానంతో కలిస్తే ఫలితం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. 2025నాటికి అకాల మరణాలను 25శాతం తగ్గించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనకోసం కోవిడ్-19 చికిత్సా వ్యవస్థలను, ఇతర వ్యాధులపై పరీక్షలు, ఆరోగ్య రక్షణ చర్యలతో సమీకృతం చేస్తున్నాం. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కృత్రిమ మేధో పరిజ్ఞాన సదుపాయాలను గరిష్టస్థాయికి పెంచుతున్నాం. కోవిడ్19 నియంత్రణ వ్యయాలను, ఇతర పెట్టుబడులకు ప్రభుత్వ కేటాయింపులను ఇతర వ్యాధుల నియంత్రణా ప్రణాళికతో సమీకృతం చేస్తున్నాం. ఇతర వ్యాధుల నిర్ధారణ పరీక్షలను కోవిడ్ స్క్రీనింగ్ టెస్టులతో సమాంతరంగా ఏర్పాటు చేస్తున్నాం. అంటువ్యాధులు కాని ఇతర వ్యాధుల చికిత్సా కేంద్రాలను ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలుగా బలోపేతం చేస్తున్నాం.” అని మంత్రి చెప్పారు.
అత్యవసర వైద్య సేవల విషయంలో సకాలంలో చర్య తీసుకోవడానికి, తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి వీలుగా పరిపాలనా ప్రక్రియను, సమన్వయ ప్రక్రియను అవసరానికి తగినట్టుగా సవరించవలసి ఉందని డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఇతర వ్యాధుల నిరోధానికి, ముందస్తు కట్టడికి చర్యలను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. “ప్రజారోగ్యానికి నిధులందించడానికి, ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులను సవరించడానికి ఎదురయ్యే ఆర్థికపరమైన అడ్డంకులను తొలగించడానికి ప్రజారోగ్య నాయకులుగా మేం మరింత చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంది. అంటువ్యాధులు కాని ఇతర వ్యాధులపై విజయం సాధించే లక్ష్యంతో చేపట్టిన ఈ భాగస్వామ్య కార్యక్రమం పలు ప్రభుత్వాలను, ప్రైవేటు రంగాన్ని, పౌర సమాజాన్ని ఒక్కతాటిపైకి తెస్తోంది. అన్ని దేశాల్లో ఆరోగ్యరక్షణ కార్యకలాపాలకు సారథ్యం వహించేందుకు ఇది దోహదపడుతుందని నేను కచ్చితంగా నమ్ముతాను. వ్యాధుల వెల్లువను నియంత్రించే పరిజ్ఞానం, సామర్థ్యం, చివరకు వనరులు కూడా సాధించే శక్తి ప్రపంచానికి తగినంతగా ఉంది. అయితే, విభిన్న వర్గాల, దేశాల సహకారం, అభిప్రాయాల మార్పిడి మాత్రమే ఇక్కడ కీలకపాత్ర పోషిస్తుంది.” అని కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్జారు.
****
(Release ID: 1721832)
Visitor Counter : 243