ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ సంసిద్ధతను సమీక్షించడానికి ఈశాన్య రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి.. కఠిన నియంత్రణ, విశ్వాసం పెంపొందించే చర్యలకు పిలుపునిచ్చారు.

Posted On: 25 MAY 2021 5:32PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..  ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వశాఖ సహాయ మంత్రి, పీఎంవో, పబ్లిక్ గ్రీవియెన్స్, పెన్షన్స్, అణుశక్తి, స్పేస్ మంత్రిత్వశాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

అసోం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, ఈశాన్య రాష్ట్రాల కేంద్ర కార్యదర్శి, ఈశాన్య రాష్ట్రాల మండలి కార్యదర్శి, ఈశాన్య రాష్ట్రాల ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈశాన్య రాష్ట్రాలు కోవిడ్ హాట్ స్పాట్ లు గా మారనున్నాయంటూ మీడియాలోని కొన్ని విభాగాల నివేదికలపై మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. ఫస్ట్ వేవ్ లో  మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలు కోవిడ్ మహమ్మారికి అంతగా ప్రభావితం కాలేదన్నారు. సిక్కిం వంటి రాష్ట్రాల్లో లాక్ డౌన్ సమయంలో కనీసం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, కానీ సెకండ్ వేవ్ లో మాత్రం ఇందుకు భిన్నంగా గత రెండు వారాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ విషయమై ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిరంతరం తాను సంప్రదింపులు జరుపుతున్నానని, ఆయా రాష్ట్రాలకు ఏవైనా సహాయ సహకారాలు కోరితే కేంద్రం నుంచి వెంటనే అందజేస్తున్నామన్నారు.
ఈశాన్య ప్రాంతాల్లోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల గ్రాఫ్ ను తగ్గించేందుకు, అవసరమైన మార్గాలను అన్వేషించడం తక్షణ కర్తవ్యమని మంత్రి పేర్కొన్నారు.
త్రిపుర, మేఘాలయ వంటి రాష్ట్రాలతోపాటు నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నవిషయాన్ని ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శుల దృష్టికి తీసుకొచ్చిన మంత్రి.. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు.

కోవిడ్ కేసుల నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని, టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటివి విస్తృతం చేయాలని మంత్రి సూచించారు. అంతేకాకుండా కోవిడ్ కేసులు పెరుగుతున్న తీరును పరిశీలించడానికి అవసరమైన చోట మైక్రో కంటెయిన్మెంట్ జోన్ల నిర్వహణ వంటి చర్యలు తీసుకోవాలన్నారు.  

రాబోయే వారాల్లో కేంద్రం అన్ని ఈశాన్య రాష్ట్రాలకు సరిపడా టీకాలను సరఫరా చేస్తుందని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తుది మెరుగులు దిద్దుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రాధాన్యత ప్రాతిపదికన కోవిడ్ సంబంధిత ప్రతిపాదనలు పంపాలని ఈశాన్య రాష్ట్రాలను కోరారు. అత్యవసరమైన ప్రతిపాదనలకు కేంద్రం త్వరగా స్పందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై తగిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జూన్ రెండున ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వశాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇప్పటిదాకా నాలుగు రాష్ట్రాలు మాత్రమే ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రతిపాదనలు పంపాయని చెప్పారు. అత్యవసరాల ప్రాతిపదికన ప్రతిపాదనలు పంపాలని రాష్ట్రాలను కోరారు. ఆస్పత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లు, మొబైల్ టెస్టింగ్ వ్యాన్లతో సహా కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలకు కేంద్రం తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

 కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి.. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి రోజువారీ వివరాలను సేకరిస్తున్నామని, ఆరోద్య సదుపాయాలతోపాటు మౌలిక సదుపాయాల గురించి ఎనిమిది రాష్ట్రాల నుంచి వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు సరిపడా బెడ్స్, ఆక్సిజన్ నిల్వలు ఉండడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈశాన్య రాష్ట్రాల మండలి తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం జపాన్, యూఎన్డీపీ సహకరించడాన్ని మంత్రి ప్రస్తావించారు.

కరోనా మొదటి దశలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని, కరోనా నియంత్రణలో మొత్తం దేశానికే ఈశాన్య రాష్ట్రాలు నమూనాగా నిలిచాయని మంత్రి గుర్తుచేశారు. అయితే మొదటి దశతో పోలిస్తే.. రెండో దశలో మిగతా ప్రాంతాలకంటే ఈశాన్య ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతుున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్యను తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలపై వారం రోజుల్లో సరైన ప్రణాళికను సిద్ధం చేయాలని సీనియర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

***



(Release ID: 1721733) Visitor Counter : 193