రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పశ్చిమ బంగాల్‌లో యాస్‌ తుపాను సహాయక చర్యల్లో సైనిక సాయం

Posted On: 25 MAY 2021 6:38PM by PIB Hyderabad

యాస్‌ తుపాను బుధవారం తీరాన్ని తాకనున్న నేపథ్యంలో, తూర్పు సైనిక దళం పశ్చిమ బెంగాల్‌లో సహాయ, ఉపశమన చర్యలు చేపడుతోంది. అవసరాలకు అనుగుణంగా సైనిక బృందాలను తూర్పు సైనిక దళం మోహరించింది. పశ్చిమ బంగాల్‌ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.

    నిపుణులు, ఉపకరణాలు, పడవలతో కూడిన 17 సమీకృత తుపాను ఉపశమన బృందాలను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచారు. పురూలియా, ఝర్‌గ్రామ్‌, బిర్బూమ్‌, బర్ధమన్‌, పశ్చిమ మిడ్నాపూర్‌, హౌరా, హూగ్లి, నదియా, 24 పరగణాల ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఈ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

    అవసరమైతే తక్షణం రంగంలోకి దిగేందుకు కోల్‌కతాలో మరో 9 బృందాలను సిద్ధంగా ఉంచారు.

    గాయపడిన, చిక్కుకుపోయినవారిని రక్షించడం, వైద్య చికిత్సలు, మార్గాల పునరుద్ధరణలు, కూలిన చెట్ల తొలగింపు, సహాయక సామగ్రి పంపిణీ వంటివి చేపట్టడానికి ఈ బృందాలు ఉపకరణాలతో సహా సిద్ధంగా ఉన్నాయి. జిల్లా యంత్రాంగాల అవసరాల మేరకు ఈ బృందాలు రంగంలోకి దిగుతాయి.

 

***



(Release ID: 1721730) Visitor Counter : 176


Read this release in: English , Urdu , Hindi , Tamil