హోం మంత్రిత్వ శాఖ

‘యాస్’ తుఫాను సంసిద్ధతను సమీక్షించడానికి జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ) స‌మావేశాన్ని నిర్వ‌హించిన క్యాబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా

Posted On: 22 MAY 2021 6:33PM by PIB Hyderabad

క్యాబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ(ఎన్‌సీఎంసీ) స‌మావేశం ఈ రోజు జ‌రిగింది. తూర్పున బంగాళాఖాతంలో కేంద్రీకృత‌మై ఉన్న ‘యాస్’ తుఫాను ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, ఏజెన్సీల సంసిద్ధతను ఎన్‌సీఎంసీ ఈ రోజు జ‌రిగిన స‌మావేశంలో సమీక్షించింది. మే 26 సాయంత్రానికి యాస్ తుపాను పశ్చిమ బెంగాల్, ప్రక్కనే ఉన్న ఉత్తర ఒడిశా రాష్ట్ర తీరాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. తుపాను యొక్క తాజా స్థితి గురించి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ (ఐఎండీ) ఈ కమిటీకి వివరించారు. ఈ తుపాను గాలి వేగం 155 నుండి 165 కిలోమీటర్ల మేర ఉండ‌వ‌చ్చ‌ని దీంతో ఈ రాష్ట్రాల తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతంతో కూడిన‌ తుఫాను వ‌ర్షాలు సంభవించే అవ‌కాశం ఉంది. తుఫాను ఎదుర్కోవటానికి సన్నాహక చర్యల గురించి సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కమిటీకి వివరించారు. లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను తరలించడం జరుగుతోంది. ఆహార ధాన్యాలు, తాగు నీరు, ఇతర నిత్యావసర సామాగ్రి సంబంధించి త‌గు నిల్వలు ఏర్పాటు చేయబడ్డాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రా, టెలికమ్యూనికేషన్స్ వంటి అవసరమైన సేవల్ని నిర్వహించడానికి సన్నాహాలు చేయబడ్డాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ 65 బృందాల‌ను మోహరించ‌డం/ అందుబాటులోకి తెచ్చింది. దీనికి తోడు మరో 20 బృందాల‌ను సంసిద్ధం చేసి ఉంచారు. ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్‌ల‌కు చెందిన‌ రెస్క్యూ మరియు రిలీఫ్ టీంలతో పాటుగా ఓడలు మసాయ‌రియు విమానాలను కూడా మోహరించారు.
కోవిడ్ బాధితుల‌కు ఇబ్బంది రాకుండా చ‌ర్య‌లు..
దేశ వ్యాప్తంగా కోవిడ్ సదుపాయాలకు ఆక్సిజన్ ఉత్పత్తి మరియు సరఫరాను నిర్ధారించడంతో పాటు, ఆసుపత్రులు మరియు కోవిడ్ కేర్ సెంటర్ల నిరంతర త‌గు పనితీరును నిర్ధారించడానికి గాను అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను ముందస్తుగా తరలించడం, అన్ని పడవలు/ ఓడలు తీరాలకు తిరిగి వచ్చేలా చూసుకోవడం ద్వారా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల‌ని కేంద్ర‌ క్యాబినెట్ కార్యదర్శి సూచించారు. కోవిడ్-19 రోగుల భద్రత స‌రిగ్గా ఉండేలా చూడాలని.. కోవిడ్ ఆస్పత్రులు, కేంద్రాల పని తీరుకు అంతరాయం కలగకూడదని శ్రీ గౌబా ఈ సంద‌ర్భంగా నొక్కిచెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ ఉత్పత్తి మరియు కదలికలను నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా, టెలికాం మరియు ఇతర ముఖ్యమైన సేవలను పునరుద్ధరించడానికి వీలుగా సన్నాహక ఏర్పాట్లు చేయాలని కేబినెట్ కార్యదర్శి తెలిపారు. ఇందుకు సంబంధించి చాలా దగ్గరి సమన్వయంతో పని చేయాలని, రాష్ట్రాలు / యుటీలకు అవసరమైన అన్ని సహాయం అందించాలని ఆయన సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. ఈ సమావేశంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్ & నికోబార్, పుదుచ్చేరిలకు చెందిన ప్రధాన కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు. హోం, విద్యుత్, పౌర విమానయాన, షిప్పింగ్, టెలికాం, పెట్రోలియం & సహజ వాయువు, మత్స్య శాఖలకు చెందిన కార్యదర్శులు రైల్వే బోర్డు ఛైర్మన్, ఎన్‌డీఎంఏ సంస్థ సభ్య కార్యదర్శి, ఐడీఎస్ అధినేత‌, తీర ప్రాంత గ‌స్తీ (కోస్ట్ గార్డ్‌), ఎన్‌డీఆర్‌ఎఫ్, ఐఎమ్‌డీల‌కు చెందిన‌ డీజీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

***

 



(Release ID: 1720997) Visitor Counter : 152