శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 యాంటీబాడీల కేంద్రీకరణను వేగంగా, కచ్చితంగా లెక్కించే ఎలిసా టెస్ట్!


డి.ఎస్.టి. ఆర్థిక సాయంతో వినూత్నమైన టెస్ట్ కిట్.కు రూపకల్పన

Posted On: 22 MAY 2021 9:39AM by PIB Hyderabad

    కోవిడ్-19 కేసులకు సంబంధించిన క్లినికల్ నమూనాల్లో మొత్తం ప్రతిరక్షక కణాల (యాంటీబాడీల) కేంద్రీకరణను వేగంగా, మరింత కచ్చితత్వంతో అంచనా వేయగలిగే వినూత్నమైన ఎలెక్ట్రోకెమికల్ ఎలిసా (ఇ.ఎల్.ఐ.ఎస్.ఎ.) పరీక్షను బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ రూపొందించింది.

  పాథ్ శోధి హెల్త్ కేర్ అనే ఈ స్టార్టప్ కంపెనీని ఇండియన్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి.)కి చెందిన సొసైటీ ఫర్ ఇన్నవేషన్ డెవలప్మెంట్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. కోవిడ్19కు సంబంధించిన ఎల్జీఎం, ఎల్జీజీ యాంటీ బాడీల కేంద్రీకరణను అంచనావేసే వినూత్నమైన ఎలిసా టెస్టుకు పాథ్ శోధ్ హెల్త్ కేర్ సంస్థ రూపకల్పన చేసింది. పరిమాణాత్మక (క్వాంటిటేటివ్) విశ్లేషణ పరీక్ష ద్వారా నమూనాలోని మూలకాంశాలను కనుగొనే అవకాశం ఉండగా, ఈ సెమీ క్వాంటిటేటివ్ విశ్లేషణ ద్వారా యాంటీ బాడీలు ఏ మేరకు కేంద్రీకరించి ఉన్నాయన్న అంశాన్ని దాదాపు పూర్తి కచ్చితత్వంతో అంచనా వేసేందుకు వీలుంటుంది. ఇందుకు సంబంధించి పాథ్ శోధ్ కంపెనీకి లైసెన్స్ కూడా లభించింది. ఈ టెస్టు కిట్లను తయారీకి, విక్రయానికి సంబంధించి కేంద్ర ఔషథ ప్రమాణ నియంత్రణ సంస్థ (సి.డి.ఎస్.సి.ఒ.)నుంచి ఈ లైసెన్స్ లభించింది. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.) విధించిన ప్రమాణాల మేరకు ఫరీదాబాద్ లోని ఇండియన్ ట్రాన్స్.లేషనల్ హెల్త్ సైన్స్, టెక్నాలజీ ఇన్.స్టిట్యూట్  క్రమబద్ధీకరణకు అనుగుణంగా ఈ లైసెన్సును మంజూరు చేశారు.

ఈ టెస్టుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానానికి, ఉత్పాదనకు  భారత ప్రభుత్వపు సైన్స్, టెక్నాలజీ శాఖ (డి.ఎస్.టి) మద్దతు ఇస్తోంది. కోవిడ్-19, ఆరోగ్య సంక్షోభంపై యుద్ధాన్ని బలోపేతం చేసే కేంద్రం (కవచ్) పేరిట చేపట్టిన కార్యక్రమం కింద ఈ సాంకేతిక పరిజ్ఞానికి భారత ప్రభుత్వంనుంచి మద్దతు లభించింది. ఈ విషయంలో బొంబాయి ఐ.ఐ.టి.కి చెందిన సొసైటీ ఫర్ ఇన్నొవేషన్, అండ్ ఎంటర్.ప్రెన్యూర్ షిప్ సంస్థ, హైదరాబాద్ లోని ఐ.కె.పి. నాలెడ్జ్ పార్క్ ల ద్వారా సమన్వయ కృషి జరిగింది.

  సార్స్-సి.ఒ.వి.-2 వైరస్ కు మాత్రమే ప్రత్యేకమైన ఎల్జీఎం., ఎల్జీజీ యాంటీ బాడీస్ ఎలెక్ట్రో కెమికల్  రిడాక్స్ చర్యలను అంచనావేసే ప్రక్రియ ప్రాతిపదికగా ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానానికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న క్వాలిటేటివ్ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులకు ఫూర్తి భిన్నంగా పాథ్ శోధ్ టెస్ట్ ప్రక్రియ ఉంటుంది. ఎలిసా పద్ధతి ప్రాతిపదికన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానానికి అమెరికా, ఇండియా పేటెంట్ అప్లికేషన్ నుంచి రక్షణ కూడా కల్పించారు. “యాంటీబాడీల తాత్కాలిక క్షీణతను అంచనా వేయడంలో కోవిడ్-19 యాంటీ బాడీ కేంద్రీకరణ గణన సామర్థ్యం చాలా కీలకపాత్ర పోషిస్తుంది. మరోసారి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించే రోగనిరోధక శక్తిని కూడా ఇది ప్రభావితం చేసే అవకాశం ఉంది. కోవిడ్ వ్యాక్సీన్లతో జరిగే ప్రతిరక్షక కణాల మార్పిడిని తెలియజేయడంలో ఈ ప్రక్రియ ఎంతో విస్తృత పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది.” అని ప్రొఫెసర్ నవకాంత్ భట్ పేర్కొన్నారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు చెందిన ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ డివిజన్ కు అధిపతిగా, సెంటర్ ఫర్ నానోసైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గా నవకాంత్ భట్ వ్యవహరిస్తున్నారు. ఎలెక్ట్రో కెమికల్ ఎలిసా టెస్ట్ కిట్ కు రూపకల్పన చేసిన పాథ్ శోధ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడుగా కూడా నవకాంత్ భట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001J7WI.png

  ఈ టెస్టు కిట్ రెండు విభాగాలతో కూడి ఉంటుంది. ఒక విభాగం రక్తం నమూనాను విశ్లేషించి, వివరణాత్మక నివేదిక అందిస్తుంది. మరో విభాగం టెస్ట్ స్ట్రిప్ రూపంలో ఉంటుంది. వ్యక్తి వేలి కొసనుంచి సేకరించిన రక్తపు బొట్టును ఈ స్ట్రిప్.పై ఉంచి స్ట్రిప్పును కిట్ లోపలికి అమర్చుతారు.  వినూత్నమైన టెస్టు కిట్ ద్వారా కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఫలితం వెలువడుతుంది. ఫలితాన్ని మీ మొబైల్ ఫోన్.పై డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ టెస్టుకోసం అరచేతిలో లేబరేటరీగా చెప్పుకునే “అనుపాథ్ టిఎం” అన్న ఫ్లాట్ ఫాంను పాథ్ శోధ్ స్టార్టప్ కంపెనీ రూపొందించింది. కోవిడ్-19 యాంటీబాడీలకు సంబంధించిన ఇమ్యూన్ రిసెప్టర్ల ద్వారా ఈ టెస్టు స్ట్రిప్పులు పనిచేస్తాయి. అరచేతిలో ఇమిడిపోయే పరికరం తెరపైనే టెస్టు ఫలితం కనిపించే వీలున్నందున ఫలితానికి సంబంధించి ఎలాంటి తప్పులు దొర్లడానికి అవకాశం ఉండదు. పైగా లక్షకు పైగా టెస్టుల ఫలితాలను ఈ పరికరం మెమరీలో నిక్షిప్తం చేసుకునే అవకాశం ఉండటం మరో ప్రత్యేకత. టచ్ స్క్రీన్ డిస్.ప్లే, రిచార్జి చేసుకోగలిగే బ్యాటరీ, బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్.తో అనుసంధానం చేసుకునే అవకాశం, క్లౌడ్ స్టోరేజీ అవకాశం, రోగి వివరాల చిట్టాను ఆధార్ నంబరుకు క్రోడీకరించే అవకాశం, టెస్ట్ సమాచారాన్ని ఎ.పి.ఐ.ల ద్వారా ఆరోగ్య సేతు వెబ్ సైటుకు అనుసంధానం చేసే వెసులుబాటు కూడా ఉంటాయి.

 “గతంలో ఇన్ఫెక్షన్ కు సంబంధించిన సీరో సర్వే ఉపకరణంగానే కాకుండా, యాంటీ బాడీల క్షీణతను, అందుకు సంబంధించిన జీవప్రక్రియ సంబంధమైన ప్రతిస్పందనను లెక్కించేందుకు కూడా ఈ టెస్టు ఉపకరిస్తుంది. అంతేకాక, యాంటీ బాడీలను ఉత్పత్తిని ప్రోత్సహించడంలో వ్యాక్సీన్ల సామర్థ్యాన్ని కూడా తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుంది.” అని కేంద్ర విజ్ఞానశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ (డి.ఎస్.టి.) కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తెలిపారు.

   పాధ్ శోధ్ హెల్త్ కేర్ సంస్థ సి.ఇ.ఒ. సహ వ్యవస్థాపకుడు అయిన డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ, “కోవిడ్-19 యాంటీ బాడీస్ ఉనికిని సూక్ష్మాతి సూక్ష్మమైన నానో అణువు స్థాయి వరకూ కనిపెట్టేందుకు ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుంది. రక్తపు నమూనా, సీరమ్ నమూనాతో కూడా ఇది పనిచేస్తుంది. ఈ టెస్టు కిట్లను రానున్న రెండు వారాల్లో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. పాథ్ శోధ్ సంస్థకు ప్రస్తుతం నెలకు లక్ష టెస్టు కిట్లను ఉత్పత్తిచేసే సామర్థ్యం ఉంది. ఉత్పాదనాపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవడం ద్వారా టెస్టు కిట్ల ఉత్పత్తిని మరింత పెంచుతాం.” అని అన్నారు.

   అరచేతిలో ఇమిడే లేబరేటరీ పేరిట పాథ్ శోధ్ కంపెనీకి రూపొందించిన “అనుపాథ్ టిఎం” వేదిక ఇప్పటికే, మధుమేహం, కాలేయ వ్యాధులు, రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి రుగ్మతల సత్వర నిర్ధారణ, చికిత్సా నిర్వహణలో ఎంతో సామర్థ్యం కనబరుస్తోంది. ఇపుడు కోవిడ్19కు సంబంధించిన సీరాలజీ టెస్ట్ రూపకల్పనతో ఈ కంపెనీ ఉత్పాదన సామర్థ్యం మరింత ఇనుమడించింది. అంటువ్యాధులు కాని రుగ్మతల పరీక్షలను అధిగమించి ఈ సంస్థ అంటువ్యాధుల నిర్ధారణకు దోహదపడే టెస్టు కిట్ల రూపకల్పనలో కూడా పురోగమిస్తోంది.

  ఈ సాంకేతిక పరిజ్ఞానంపై మరింత సమాచారం కావాలంటే ఈ కింది మెడికల్ ఆర్కీవ్. ను సంప్రదించవచ్చు. (medRxiv): https://doi.org/10.1101/2021.05.04.21256472

  మరిన్ని వివరాలకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.కు చెందిన ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ డివిజన్ డీన్,.. సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్,.. పాథ్ శోధ్ హెల్త్ కేర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అయిన నవకాంత భట్ ను సంప్రదించవచ్చు. (navakant[at]iisc[dot]ac[dot]in, 9448472680) అలాగే, పాథ్ శోధ్ హెల్త్ కేర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సి.ఇ.ఒ... వినయ్ కుమార్ (vinay.k@pathshodh.com, 9108934728)ను కూడా సంప్రదించవచ్చు.  .

 

****



(Release ID: 1720904) Visitor Counter : 174