ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

డాక్టర్ హర్షవర్ధన్ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్, కొత్త కొవిడ్ వార్డులను తనిఖీ చేశారు.

"కొవిడ్ నియమాలను పాటించడం ద్వారా , ఇంటి లోపల ఉండడం ద్వారా ప్రజలు కొవిడ్ తో ప్రభుత్వం చేస్తున్న పోరాడటానికి సహాయపడవచ్చు" అని అన్నారు.

స్టెరాయిడ్లను విచక్షణారహితంగా, అధికంగా వాడొద్దని ఆయన హితవుచెప్పారు.

కొవిడ్ తో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఆయన నివాళులు అర్పించారు.

Posted On: 19 MAY 2021 5:24PM by PIB Hyderabad

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ , కొత్త కోవిడ్ బ్లాకుల నిర్మాణ పురోగతిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు పరిశీలించారు.

కొవిడ్  సెకండ్వేవ్ ను అరికట్టడానికి ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలు కీలక పాత్ర పోషించాయి. ఈ పర్యటన సందర్భంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులతో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి ఆసుపత్రి కోవిడ్ పై పోరాట సంసిద్ధతను సమీక్షించారు.

ఇక్కడ రికార్డు సమయంలో ఏర్పాటు చేసిన ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్ (పిఎస్ఎ) ఆక్సిజన్ ప్లాంట్ ప్లాంటు  పనితీరును సమీక్షించడం ద్వారా మంత్రి తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్ఎంఎల్ హాస్పిటల్ , లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ తర్వాత ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయబోయే 3 వ ప్లాంట్ ఇది. పిఆర్‌-కేర్స్ ఫండ్ సహాయంతో డిఆర్‌డిఓ దీనిని ప్లాంటాఫ్ ~ 1 ఎమ్‌టి సామర్థ్యంతో నిర్మించింది. కొవిడ్  రోగికి మెడికల్ ఆక్సిజన్ అందించడంలో  ఇది తోడ్పడుతుంది. ఆసుపత్రిలో చేరాల్సిన  తీవ్రమైన కేసుల చికిత్స కోసం వేగంగా ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. "సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో త్వరలో 2 ఎమ్‌టి సామర్థ్యం గల మరో ప్లాంట్ ఏర్పాటవుతుంది. ఇది ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇంకా పెంచుతుంది. దేశవ్యాప్తంగా 1051 ప్లాంట్లు డీఆర్డీఓ, సీఎస్ఐఆర్, హైటెక్ సహాయంతో స్థాపితమవుతున్నాయి”అని ఆయన వివరించారు.

రూర్కీలోని సిఎస్ఐఆర్ -సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎస్ఐఆర్-సిబిఆర్ఐ) సహాయంతో నిర్మిస్తున్న  కొత్త కోవిడ్ బ్లాకును కూడా ఆయన సందర్శించారు. పురోగతి పనులను పరిశీలించారు. ఈ బ్లాక్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొవిడ్ చికిత్స విధానాలను పట్టించుకోకుండా డాక్టర్లు ట్రీట్మెంట్లు ఇవ్వడం వల్ల ఏర్పడుతున్న  సమస్యల గురించి డాక్టర్ హర్షవర్ధన్ ప్రజలను హెచ్చరించారు. “కొందరి పరిస్థితి విషమంగా మారకపోయినా భారీ మోతాదులో స్టెరాయిడ్లు తీసుకుంటున్నారు. రోగి హైపోక్సిక్ అయినప్పుడు మాత్రమే స్టెరాయిడ్లు అందించాలి. దుష్ప్రభావాలను నివారించడానికి చిన్న మోతాదులో ఇవ్వాలి. కొన్ని రోజుల కన్నా ఎక్కువగా వాడకూడదు. ఇలాంటి మందుల వాడకానికి వైద్యుడి సిఫార్సులు తప్పనిసరి” అని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వస్తున్న ముకోర్మైకోసిస్ వంటి వ్యాధులను ఇలాంటి నియమాలను పాటించడం ద్వారా తగ్గించవచ్చని చెప్పారు. కోవిడ్ రోగులకు చికిత్స చేసేటప్పుడు ఐసిఎంఆర్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని ఆయన వైద్యులను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రోజుల్లో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. గత 24 గంటల్లో 3,89,851 మంది కోలుకున్నారని, కొత్త కేసులు 2,67,334 నమోదయ్యాయని అన్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య లక్ష ఎక్కువ ఉందని, రోజువారీ రికవరీలు వరుసగా 6 వ రోజు కూడా కొత్త కేసులను మించిపోయాయని వివరిస్తూ, యాక్టివ్ కేస్ లోడ్ తగ్గుతున్నదని అన్నారు.ప్రస్తుతం 32,26,719 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. కోవిడ్ కేసులను తగ్గించేందుకు ప్రజలు సహకరించాలని డాక్టర్ హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. “మాస్కులు ధరించడం,  పరిశుభ్రత ,  సామాజిక దూరం, క్రమశిక్షణ పాటిస్తే కేసులు తగ్గుతాయి. ప్రజలు తమ ఇళ్లలో ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలి”అని ఆయన కోరారు. కోవిడ్ బాధితులందరికీ మంత్రి హృదయపూర్వక సంతాపం తెలిపారు. ఇటీవలి రోజుల్లో కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన వైద్యప్రముఖుల సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. “ఇటీవల కరోనాకు బలైన ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కె. కె. అగర్వాల్ ప్రజలలో ఆరోగ్య విద్యపై చైతన్యం తెచ్చారు. ఆర్థోపెడిషియన్ డాక్టర్ శేఖర్ అగర్వాల్  వేలాది మంది రోగులకు చికిత్స చేశారు. డాక్టర్ పంకజ్ భట్నాగర్ కూడా చాలా మంది క్యాన్సర్ రోగులు బాగుపడటానికి సహాయపడ్డారు. వీరంతా కొవిడ్కు బలయ్యారు”అని విచారం ప్రకటించారు. విధి నిర్వహణలో మరణించిన ఎంతోమంది కొవిడ్ యోధులను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి గుర్తు చేసుకున్నారు. మీడియా ప్రముఖులు  సునీల్ జైన్,  శేష్ నారాయణ్ సింగ్,  రోహిత్ సర్దానా వంటివాళ్ల  త్యాగాలను ప్రస్తావించారు. సఫ్దర్జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.వి. ఆర్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సర్వేష్ టాండన్, ఇతర సీనియర్ ఫ్యాకల్టీ / ఇన్స్టిట్యూట్ వైద్యులు మంత్రి వెంట ఉన్నారు. 

***


(Release ID: 1720117) Visitor Counter : 217


Read this release in: English , Urdu , Hindi , Tamil