ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతో కోవిడ్-19 ఆరోగ్య స్పందన, టీకాల కార్యక్రమంపై సమీక్షించిన డాక్టర్ హర్షవర్ధన్


' జులై నాటికి 51.6 కోట్ల వాక్సిన్ డోసులను, ఆగష్టు-డిసెంబర్ నాటికి 216 కోట్ల వాక్సిన్ డోసులను భారత్ కలిగి ఉంటుంది'

క్లినికల్ మేనేజ్‌మెంట్ విస్తరణ మరియు మెరుగుదలపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచన

Posted On: 15 MAY 2021 6:54PM by PIB Hyderabad

ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులతో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమీక్షించారు. రోజువారీ కేసుల పెరుగుదల, పోజిటివిటీ పెరుగుదల, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటూ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కొరతను ఈ రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీ అశ్విని కుమార్ చౌబే కూడా పాల్గొన్నారు. వర్చ్యువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి, డాక్టర్ ప్రభురామ్ చౌదరి , ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య మంత్రి శ్రీ జై ప్రతాప్ సింగ్,ఉత్తర ప్రదేశ్ ఆర్థిక, పార్లమెంటరీ వ్యవహారాలు మరియు వైద్య విద్య మంత్రి శ్రీ సురేష్ కుమార్ ఖన్నా హాజరయ్యారు.

సమావేశంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రస్తావించారు. గుజరాత్ లో ఏప్రిల్ నుంచి  పోజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని, జాతీయ సరాసరి కంటే తక్కువగా 79% రికవరీ రేటు ఉందని మంత్రి తెలిపారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఒత్తిడిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. అహ్మదాబాద్, వడోదర మరియు మెహ్సానాలో 100% ఐసియు పడకలు నిండిపోవడం, అహ్మదాబాద్ లో 97% మరియు వడోదరాలో 96% ఆక్సిజన్ సౌకర్యం వున్న పడకలు నిండిపోవడం దీనికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. 

ఏప్రిల్ 2021 ప్రారంభం నుంచి  ఆంధ్రప్రదేశ్ లో   పోజిటివిటీ  రేటు ఎక్కువగా ఉందని,  వారపు వృద్ధి రేటు 30.3% గా ఉందని మంత్రి పేర్కొన్నారు.  చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం  జిల్లాల్లో నెలకొన్న పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. 

ఉత్తరప్రదేశ్ లో ఆరు వారాల కాలంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. కేసుల సంఖ్య 5,500 నుంచి 31,000కి,పోజిటివిటీ రేటు రెండు నుంచి 14 %కి పెరిగిందని అన్నారు. మీరట్ లో 14,000కి మించి క్రియాశీల కేసులు ఉన్నాయని, పడకలు దాదాపు 90% నిండిపోయాయని మంత్రి అన్నారు. 

మధ్యప్రదేశ్ లో 10 జిల్లాల్లో పోజిటివిటీ రేటు 20%కి మించి ఉంది. రాష్ట్రంలో క్రేయాశీల కేసుల సంఖ్య లక్షకి పైగా ఉంది. ఇండోర్,గ్వాలియర్, బోఫాల్, జబల్పూర్ జిల్లాల్లో పరిస్థితి ఆందోళన కలిగించేవిధంగా ఉందని మంత్రి అన్నారు. 18 నుంచి 45 మధ్య వయస్సు ఉన్నవారిలో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్న ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. 

 కోవిడ్ కేసులు తగ్గుతున్న సమయంలో ఏమాత్రం అలసత్వం వహించకూడదని మంత్రి హెచ్చరించారు. ఆరోగ్య సౌకర్యాలను మెరుగు పరచడానికి ఈ సమయంలో చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవలసి ఉంటుందని మంత్రి అన్నారు. ఐసియు మరియు ఆక్సిజన్ సౌకర్యం ఉండే పడకల సంఖ్యను ఎక్కువ చేయడానికి, ఆక్సిజన్, వైద్య సౌకర్యాల లభ్యతను ఎక్కువ చేసే అంశంపై రాష్ట్రాలు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. 

రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిపై ఎన్సిడిసి డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె. సింగ్ తాజా నివేదికను అందించారు. కేసుల సంఖ్య పెరిగితే సమీప పట్టణాలు, గ్రామాల ప్రజలు పట్టణాలకు చేరుతారని దీనిని దృష్టిలో ఉంచుకొని పట్టణాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగు పరచే అంశంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. కోవిడ్ వైవిధ్యాలపై ఇండియన్ సార్స్ -కోవ్ -2 జెనోమిక్ కన్సార్టియా సహకారంతో రాష్ట్రాలు దృష్టి సారించాలని ఆయన అన్నారు. టీకా డోసులను పూర్తిగా సమర్ధంగా వినియోగించే అంశంపై ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నివేదిక సమర్పించారు. 

టీకాల వల్ల మరణాల సంఖ్య తగ్గుతున్నదని రాష్ట్రాల ఆరోగ్యశాఖల మంత్రులు అన్నారు. తమకు వాక్సిన్ ను మరింత ఎక్కువగా సరఫరా చేయాలని వారు కోరారు. దీనికి స్పందించిన డాక్టర్ హర్షవర్ధన్ టీకాల ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో అన్ని రాష్ట్రాలకు వాటికి అవసరమైన వాక్సిన్ ను అందిస్తామని అన్నారు.అంతవరకు అందుబాటులో వున్న వాక్సిన్ ను అన్ని రాష్ట్రాలకు సమానంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ' జూలై నాటికి ఇంతవరకు వేసిన 18 కోట్ల డోసులతో కలుపుకొని మనం 51.6 కోట్ల డోసులను కలిగివుంటాము. స్పుత్నిక్ కు ఇప్పటికే అనుమతులు జారీ అయ్యాయి. జైడస్ కాడిలా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా- నోవావాక్స్ వాక్సిన్, భారత్ బయో టెక్ ముక్కు ద్వారా తీసుకొనే వాక్సిన్ జెనీవా  కొత్త వ్యాక్సిన్ లకు ఆమోదం లభించింది. దీనితో దేశం కోవిడ్ వాక్సిన్ లభ్యత 216 కోట్ల డోసులకు చేరుతుంది ' అని మంత్రి వివరించారు.  

క్షేత్ర స్థాయిలో కోవిడ్ నివారణకు పటిష్ట చర్యలను అమలు చేస్తున్న రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలను శ్రీ అశ్విని కుమార్ చౌబే అభినందించారు. రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలిచి వాటికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 

45సంవత్సరాలకు పైబడి  వయస్సు ఉన్నవారికి, హెచ్‌సిడబ్ల్యు / ఎఫ్‌ఎల్‌డబ్ల్యూ లకు వాక్సిన్  ఇవ్వడానికి ప్రస్తుతం  అందుబాటులో ఉన్న టీకా స్లాట్‌లను పూర్తిగా ఉపయోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. రెండవ డోస్ పై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకొనేలా చూడడానికి అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్రాలను కోరారు. వాక్సిన్ వృధా కాకుండా చూడాలని రాష్ట్రాలకు సూచనలు జారీ అయ్యాయి. వృధాగా పోయే వాక్సిన్ ను రాష్ట్రాల కోటా నుంచి తగ్గిస్తామని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇతర వినియోగదారుల కోటాలో వాక్సిన్ సకాలంలో సరఫరా అయ్యేలా ఉత్పత్తిదారులతో సమన్వయం చేయడానికి రాష్ట్ర స్థాయిలో 2/3 సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని  కేంద్రం సూచించింది. ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా ఈ బృందం చర్చలు జరపాలని సూచించిన కేంద్రం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు ఆమోదించిన/ సరఫరా చేసిన వాక్సిన్ వివరాలను అందజేసింది. 

 

***

 (Release ID: 1718931) Visitor Counter : 168