సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్ కట్టడిలో సామాజిక నిర్వహణా అవసరమే!


కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు

వైద్య చికిత్స, పరిపాలనా చర్యలు మాత్రమే సరిపోవని వెల్లడి

ఉధంపూర్ లోక్.సభ స్థానం పరిధిలోని ఆరు జిల్లాకూ
వ్యాక్సినేషన్ చాలా కీలకమని స్పష్టీకరణ

Posted On: 14 MAY 2021 5:44PM by PIB Hyderabad

   జమ్ము కాశ్మీర్ లోని ఉధంపూర్-కథువా-దోడా లోక్ నియోజకవర్గం పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన ప్రజాసేవా నేతలు, కార్యకర్తలతో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు కోవిడ్ నియంత్రణపై అంశాలపై ముచ్చటించారు. కోవిడ్ కట్టడికి సంబంధించిన పలు అంశాలపై విపులంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కోవిడ్ నియంత్రణకు వైద్యపరమైన చికిత్స, పరిపాలనాపరమైన చర్యలకు సమానమైన స్థాయిలో సామాజిక నిర్వహణా చర్యలు కూడా అవసరమని అన్నారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో  “భయాందోళన చెందడం కంటే ముందు జాగ్రత్తే కీలకమని” ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్ చికిత్సలో వినియోగించే అత్యంత ఆవశ్యకమైన మందులు, ఆక్సిజన్ వంటి వాటిని అనవసరంగా దొంగచాటుగా నిల్వచేయడం అంటే,.. మానవాళిపై నేరానికి పాల్పడటమేనని, ఈ అంశాలపై ప్రజా సంఘాల నాయకులు అవగాహన, చైతన్యం కల్పించాలని కేంద్రమంత్రి సూచించారు.

   కథువా, ఉధంపూర్, దోడా, రాంబన్, కిష్ట్వార్ జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు కావడం సంతృప్తి కలిగిస్తోందని ఆయన అన్నారు. కథువా, ఉధంపూర్ జిల్లాల్లోని ప్లాంట్లు ఇప్పటికే పని చేయడం ప్రారంభించాయని, దోడాలోని ప్లాంటు వచ్చే వారం, రాంబన్, కిష్ట్వార్ లలోని ప్లాంట్లు ఈ నెలాఖరుకు పని ప్రారంభిస్తాయన్న సమాచారం సంతృప్తి కలిగిస్తోందని అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, కృత్రిమ శ్వాస పరికరాలు (వెంటిలేటర్లు) అవసరమైన రోగులకు సమాన ప్రాతిపదికన అందేలా చూసేందుకు వాటి లెక్కలను కచ్చితంగా తనిఖీ చేయాలని కేంద్ర మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

 

  వెంటిలేటర్లను పనిచేయించగలిగే సాంకేతిక సిబ్బంది కొరత ఉందంటూ సమావేశంలో ప్రజాసేవా కార్యకర్తల లేవనెత్తిన సమస్యపై జితేంద్ర సింగ్ సానుకూలంగా ప్రతిస్పందించారు. ఈ విషయమై తాను అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వస్తున్నానని, వెంటిలేటర్ల నిర్వహణలో సిబ్బందికి స్వల్బ వ్యవధి శిక్షణ చేపట్టాలని ఇప్పటికే సూచించానని చెప్పారు. కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో సిబ్బంది కొరత సమస్యను అధిగమించేందుకు పదవీ విరమణ చేసిన డాక్టర్లను, వైద్య విద్యార్థులను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.

  తన పార్లమెంటరీ నియజకవర్గంలోని ఆరు జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చాలా మంది ప్రజా కార్యకర్తలు, ప్రతినిధులు కేంద్రమంత్రిని కోరారు. వ్యాక్సినేషన్ కు తాను అగ్రప్రాధాన్యం ఇస్తున్నానని, ఇందుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. కాగా, వ్యాక్సీన్ వేయించుకోవలసిన ఆవశ్యతను గురించి ప్రజాసంఘాల భాగస్వామ్యంతో జిల్లా పరిపాలనా యంత్రాగం అవగాహనా కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

  కోవిడ్ వ్యాప్తి కట్టడి కార్యకలాపాలకోసం తన ఎం.పి. నిధినుంచి రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అంశంపై ప్రజా ప్రతినిధులనుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఇదివరకు ఎన్నడూ కనీవినీ ఎరుగని సంక్షోభం ఉత్పన్నమైనందున తానీ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. కోవిడ్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్న వనరులద్వారా శక్తివంచన లేకుండా కృషి చేయాలని అన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు, ఆక్సీమీటర్లు, మాస్కులు, శానిటైజర్లు, పి.పి.ఇ. కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, కోవిడ్ నియంత్రణకు సంబంధించిన ఇతరత్రా సామగ్రి కొనుగోలుకు ఈ నిధిని వినియోగించవచ్చని అన్నారు.

   కోవిడ్ కట్టడిలో ఉపయోగపడే ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, యాంటి సెఫ్టిక్ మందులు, వ్యాధి నిరోధక శక్తి బూస్టర్లు, టాయిలెట్ సామగ్రితో వంటి వాటితో కూడిన ఒక ట్రక్కును ఈ వారమే తన నియోజకవర్గానికి అందుబాటులో ఉండేలా జితేంద్ర సింగ్ చర్యలు తీసుకున్న సంగతి ఇక్కడ గమనార్హం. ఇలాంటి సామగ్రి తమకు కావాలంటూ, తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలనుంచి అందుతున్న డిమాండ్లపై కేంద్రమంత్రి స్పందిస్తూ, భవిష్యత్తులో కూడా కోవిడ్ సంబంధమైన సామగ్రిని క్రమం తప్పకుండా సరఫరా చేయనున్నట్టు తెలిపారు. సహాయ సామగ్రితో కూడిన రెండవ విడత ట్రక్కును వచ్చే వారం పంపించనున్నట్టు చెప్పారు. లాక్ డౌన్ ఆంక్షల కారణంగా కొన్ని సరకుల సేకరణలో కొన్ని సమస్యలు ఎదురువుతున్నట్టు ఆయన చెప్పారు. 

  ఎక్కడో సుదూరంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకోసం తమ సొంత వనరులను వినియోగించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తల కృషి ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి, ఆదాయం కోల్పోయి, బాధల్లో ఉన్న వారికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నట్టు కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

 

<><><>



(Release ID: 1718717) Visitor Counter : 160