ఆర్థిక మంత్రిత్వ శాఖ
మొదటి నివాస ప్రాజెక్టును పూర్తి చేసిన - భారత ప్రభుత్వ ప్రత్యేక గవాక్షం
ఇంటి కొనుగోలుదారులకు స్వాధీన పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేసిన - ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
13 MAY 2021 5:43PM by PIB Hyderabad
అందుబాటు ధరల్లో మరియు మధ్య-ఆదాయ గృహ నిర్మాణాల కోసం భారత ప్రభుత్వ ప్రత్యేక గవాక్షం (ఎస్.డబ్ల్యూ.ఏ.ఎం.ఐ.హెచ్), తన మొదటి నివాస ప్రాజెక్టును పూర్తి చేయడంతో, ఇంటి కొనుగోలుదారులకు, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఈ రోజు, స్వాధీన పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు.
ముంబై పరిసరాల్లోని రెసిడెన్షియల్ ప్రాజెక్టు రివాలీ పార్కు - భారతదేశంలో ఎస్.డబ్ల్యూ.ఏ.ఎం.ఐ.హెచ్. నిధి కింద ఆర్ధిక సహాయాన్ని అందుకున్న మొట్టమొదటి గృహనిర్మాణ ప్రాజెక్టు. ఎస్.డబ్ల్యూ.ఏ.ఎం.ఐ.హెచ్. నిధిని శ్రీమతి నిర్మలా సీతారామన్ 2019 నవంబరు నెలలో ప్రారంభించారు.
రివాలి పార్కు వింటర్ గ్రీన్స్ లో ఈ నిధి, తన మొదటి పెట్టుబడి పెట్టింది. పూర్తయిన మొదటి పోజెక్టు కూడా ఇదే. వివిధ ఆకృతులతో, వివిధ పరిమాణాలతో కూడిన 708 గృహాలతో, 7 ఎకరాల స్థలంలో విస్తరించిన, “రివాలి పార్క్ వింటర్ గ్రీన్స్” అనే ఈ పెద్ద ప్రాజెక్టు ను, కేబుల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు అనుబంధంగా ఉన్న సి.సి.ఐ. ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సి.సి.ఐ.పి.పి.ఎల్) అనే సంస్థ, అభివృద్ధి చేసింది.
దృశ్య మాధ్యమం ద్వారా ఆన్-లైన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, శ్రీమతి నిర్మలా సీతారామన్ తో పాటు, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్; గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ దుర్గా శంకర్ మిశ్రా; ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి, శ్రీ అజయ్ సేథ్; ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన, ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి, శ్రీ కె. రాజా రామన్; భారతీయ స్టేట్ బ్యాంకు చైర్మన్ శ్రీ దినేష్ కుమార్ ఖారాతో పాటు, ఎస్.బి.ఐ.సి.ఏ.పి. వెంచర్స్ లిమిటెడ్ కు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.
దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ, ఎస్.డబ్ల్యూ.ఏ.ఎం.ఐ.హెచ్. నిధి, తన మొదటి నివాస ప్రాజెక్టును పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీనికి తోడు, ఇది, కోవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో, ఎస్.డబ్ల్యూ.ఏ.ఎం.ఐ.హెచ్. నిధి, సాధించిన ఒక గొప్ప విజయమని కూడా, ఆమె అభివర్ణించారు.
ఒత్తిడికి గురవుతున్న సరసమైన, మధ్య ఆదాయ గృహ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి భారత ప్రభుత్వం అడుగుపెట్టిందనీ, తద్వారా కష్టపడి సంపాదించిన పొదుపులను పెట్టుబడి పెట్టిన గృహ కొనుగోలుదారులకు ఉపశమనం లభిస్తోందనీ, ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ గృహాలను నిర్మించి, పూర్తి చేసిన తర్వాత, ఈ ప్రాజెక్టులలో పెద్ద మొత్తంలో చిక్కుకున్న మూలధనం తిరిగి వెనక్కి వస్తుందని ప్రభుత్వం నమ్ముతోందని, శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు.
ఈ పధకం నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పిస్తుందనీ, అనుబంధ పరిశ్రమలైన స్టీల్, సిమెంట్ వంటి వాటికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని, ఆర్థిక మంత్రి చెప్పారు. దీని తోడు, ఈ పధకం, బ్యాంకులు, ఎన్.బి.ఎఫ్.సి. ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం తో పాటు, దేశంలో ఆర్థిక మనోభావాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని, ఆమె వివరించారు.
ఒక విధాన ప్రకటనను క్షేత్ర స్థాయి నిధులను సమకూర్చే సంస్థగా మార్చినందుకు, ఎస్.బి.ఐ-సి.ఏ.పి. వెంచర్స్ బృందాన్ని శ్రీమతి సీతారామన్ అభినందిస్తూ, తక్కువ వ్యవధిలో గణనీయమైన పురోగతిని సాధించినందుకు, ప్రశంసించారు.
గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా, ఈ సందర్భంగా మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ పరిశ్రమ భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి కల్పనా రంగమనీ, ఎమ్.ఓ.హెచ్.యు.ఏ. గత రెండు సంవత్సరాల కాలంలో అనేక చర్యలు తీసుకుంది, తద్వారా రియల్ ఎస్టేట్ రంగం ఆర్థిక అసమానతల నుంచి బయటపడటంతో పాటు, ఆర్.ఈ.ఆర్.ఏ; జి.ఎస్.టి. రేట్లు తగ్గించడం, పి.ఎం.ఏ.వై. పథకాల వంటి చర్యల ద్వారా వృద్ధి చెందిందని వివరించారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, చివరి నిముషంలో అవసరమైన నిధులను సమకూర్చడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలకు ఎమ్.ఓ.హెచ్.యు.ఏ. తగిన చేయూత అందించిందని కూడా ఆయన తెలియజేశారు.
శ్రీ దినేష్ కుమార్ ఖారా (ఛైర్మన్-ఎస్.బి.ఐ) ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ఎస్.బి.ఐ. మరియు భాగస్వాముల ముందు ఉంచిన భారీ అంచనాలను సాధించడానికి, ఈ నిధి, నిర్విరామంగా కృషి చేస్తోందని, చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని పునరుద్ధరించడానికీ, గృహ కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా, ఎస్.బి.ఐ. గ్రూప్ పూర్తిగా కట్టుబడి ఉందని, ఆయన భరోసా ఇచ్చారు. ఇతర ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ల ద్వారా 3 నుండి 4 సంవత్సరాలలో సాధారణంగా సాధించే స్థాయికి, ఈ నిధి కార్యకలాపాల స్థాయిని పెంచడానికి ఎస్.బి.ఐ. గత 15 నెలల్లో, గణనీయమైన పురోగతి సాధించిందని శ్రీ ఖారా తెలియజేశారు.
ఎస్.డబ్ల్యూ.ఏ.ఎం.ఐ.హెచ్. గురించి :
ప్రారంభమైనప్పటి నుండి ఒకటిన్నర సంవత్సరాల స్వల్ప వ్యవధిలో, ఎస్.డబ్ల్యూ.ఏ.ఎం.ఐ.హెచ్. పెట్టుబడి నిధి-I, ఈ రోజు, భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ బృందాల్లో ఒకటిగా నిలవడంతో పాటు, కోవిడ్-19 సంబంధిత పరిమితులు ఉన్నప్పటికీ ప్రశంసనీయమైన పని చేసింది. 44,100 గృహాలను పూర్తి చేయబోయే 72 ప్రాజెక్టులకు ఈ నిధి తుది అనుమతి ఇచ్చింది. కాగా, అదనంగా 72,500 గృహాలను పూర్తి చేసే, మరో 132 ప్రాజెక్టులకు కూడా ప్రాథమిక అనుమతి లభించింది. ఈ విధంగా, మొత్తం 1,16,600 గృహాలను పూర్తి చేయాలని ఈ నిధి లక్ష్యంగా పెట్టుకుంది. గృహ కొనుగోలుదారులు మరియు డెవలపర్ల మధ్య నెలకొన్న అపనమ్మకాలను తొలగించి, ఇతర ఏ ఆర్థిక వనరుల పైనా ఆధారపడకుండా, ఈ నిధి, నిర్మాణాన్ని పూర్తి చేసి, గృహాలను పంపిణీ చేస్తోంది.
*****
(Release ID: 1718512)
Visitor Counter : 285