కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా- ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందానికి మంత్రిమండలి ఆమోదం

Posted On: 12 MAY 2021 3:44PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) - ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్ అథారిటీ (క్యూఎఫ్‌సీఏ) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ అవగాహన ఒప్పందంతో ఖ‌తార్‌లో అకౌంటింగ్ వృత్తితోపాటు వ్యవస్థాపక పునాదుల బలోపేతానికి రెండు సంస్థల సంయుక్త కృషి దిశగా సహకారం విస్తృతమవుతుంది.

ప్రభావం:

   ‘ఐసీఏఐ’కి మధ్యప్రాచ్యంలో 6000 మంది సభ్యులతో కూడిన బలమైన పునాది ఉండటమేగాక ఈ సంస్థకుగల శక్తిమంతమైన శాఖలలో ఖతార్ (దోహా) కూడా ఒకటిగా ఉంది. ఆ మేరకు ఐసీఏఐ సభ్యులు వివిధ ప్రభుత్వ-ప్రైవేట్ సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అంతేకాకుండా ఖతార్‌లో అకౌంటింగ్ వృత్తికి మద్దతు, ప్రగతిపరంగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తి కావడంతో మధ్యప్రాచ్యంలోని అన్నిప్రాంతాల్లోగల ఐసీఏఐ సభ్యుల అవకాశాలకు అదనపు ఊపు లభించనుంది. తదనుగుణంగా మరింత మెరుగైన గుర్తింపు లభిస్తుంది. అలాగే ఖతార్‌లో వ్యాపార నిర్వహణ ఆకాంక్షగల భారతీయ వ్యాపార సంస్థలకు మద్దతు లభించేలా కృషి చేయడానికి, ఖతార్-భారత దేశాల ఆర్థిక వ్యవస్థల పురోగతికి సంయుక్త తోడ్పాటు లభిస్తుంది.

ప్రయోజనాలు:

   ఖతార్ రాజధాని దోహా నగరంలో ఐసీఏఐ 1981లో తన శాఖను ప్రారంభించగా, ప్రస్తుతం ఇది చురుగ్గా పనిచేస్తోంది. అంతేకాకుండా విదేశాల్లోని మొత్తం 36 ఐసీఏఐ శాఖలకుగాను ఇది అత్యంత పురాతనమైనది. ఈ శాఖ ప్రారంభమైన నాటినుంచీ సభ్యుల సంఖ్య స్థిరంగా పెరుగుతూ రాగా, వీరిలో ప్రస్తుతం 300 మంది వివిధ ప్రభుత్వ-ప్రైవేటు కంపెనీలలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుండటం విశేషం. నేడు వీరందరూ ఖతార్‌లో అకౌంటింగ్ వృత్తికి మద్దతు, ప్రగతిపరంగా చురుకైన భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ కుదిరిన తాజా అవగాహన ఒప్పందం భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖతోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్ అథారిటీ (క్యూఎఫ్‌సీఏ)లకూ ఎంతో ప్రయోజనకరం కాగలదు.

అమలు వ్యూహం - లక్ష్యాలు:

  • ఖతార్‌లో ‘‘హామీ-ఆడిటింగ్, సలహా-సంప్రదింపులు, పన్ను వ్యవహారాలు, ఆర్థిక సేవలతోపాటు అనుబంధ రంగాల’’లో వృత్తిపరమైన సేవల సంబంధిత కార్యకలాపాల నిర్వహణ ఏర్పాటుద్వారా ‘ఐసీఏఐ’ సభ్యులకు వృత్తిపరమైన సేవలందించే అవకాశాలను పెంచడంలో ఈ అవగాహన ఒప్పందం కృషి చేస్తుంది.
  • ఖతార్‌లోని ‘క్యూఎఫ్‌సీఏ’ సహకారంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలద్వారా ‘ఐసీఏఐ’ స్థానిక వృత్తి నిపుణులు, వ్యవస్థాపకులు, విద్యార్థులను తీర్చిదిద్ది, వారి ప్రగతికి బాటలు వేస్తుంది.
  • భారత వ్యాపార సంస్థల కోసం ఖతార్‌లో వ్యాపార అవకాశాల అన్వేషణకు ‘ఐసీఏఐ’, ‘క్యూఎఫ్‌సీఏ’ సంయుక్తంగా కృషిచేస్తాయి. ఈ దిశగా పరస్పర అంగీకారానికి అనుగుణంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తాయి.
  • అలాగే ‘‘కార్పొరేట్ పాలన, సాంకేతిక పరిశోధన-సలహాలు, నాణ్యతకు హామీ, న్యాయసంబంధ అకౌంటింగ్, చిన్న-మధ్యతరహా వృత్తి వ్యవహారాలు (ఎస్ఎంపీ), ఇస్లామిక్ ఆర్థిక వ్యవహారాలు, నిరంతర వృత్తిపరమైన ప్రగతి (సీపీడీ) తదితర పరస్పర ప్రయోజన రంగాల్లో అవకాశాలపై ‘ఐసీఏఐ’, ‘క్యూఎఫ్‌సీఏ’లు సంయుక్తంగా కృషి చేస్తాయి.

నేపథ్యం:

   భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి నియంత్రణ లక్ష్యంగా పార్లమెంటు ఆమోదిత చట్టం ‘‘ది చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్-1949’’ ప్రకారం ఏర్పడిన సంస్థ ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ (ఐసీఏఐ). అదేవిధంగా ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్ అథారిటీ (క్యూఎఫ్‌సీఏ) ‘2005నాటి ఖతార్ చట్టం నం.7 ప్రకారం ఏర్పాటైన చట్టబద్ధ సంస్థ. ఖతార్‌లోని ఫైనాన్షియల్ సెంట‌ర్‌ (క్యూఎఫ్‌సీ) అంతర్జాతీయ స్థాయి ఆర్థిక-వాణిజ్య కేంద్రంగా ఎదగటానికి ప్రోత్సహించడమే ఈ అథారిటీ బాధ్యత.

 

***



(Release ID: 1718074) Visitor Counter : 132