కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
చండీగఢ్‌లోని లేబర్ బ్యూరోలో ‘కోవిషీల్డ్’ టీకా తొలి శిబిరం నిర్వహణ
Posted On:
11 MAY 2021 6:29PM by PIB Hyderabad
చండీగఢ్‌లోని లేబర్ బ్యూరో ప్రాంగణంలో ‘కోవిషీల్డ్’ టీకా ఇవ్వడం కోసం ఇవాళ తొలి శిబిరం నిర్వహించబడింది. ఇందులో భాగంగా 45 సంవత్సరాలు, అంతకుపైగా వయసుగల వారికి టీకాలు వేశారు. ఈ మేరకు పలువురు అధికారులు, లేబర్ బ్యూరో/పే అండ్ అకౌంట్స్ ఆఫీస్, చండీగఢ్ లేబర్ బ్యూరో/చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్)తోపాటు వారి కుటుంబసభ్యులు మొత్తం 30 మంది టీకాలు వేయించుకున్నారు. చండీగఢ్ ఆరోగ్య శాఖ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించగా, టీకాలు వేయడంలో శిక్షణ పొందిన ప్రత్యేక ఆరోగ్య కార్యకర్తల బృందాన్ని అధికారులు ఇందుకోసం నియమించారు. ఈ బృందం కార్యకలాపాలను ఆరోగ్యశాఖ పంపిన డాక్టర్ పర్యవేక్షించారు.
లేబర్ బ్యూరోకు చెందినవారందరూ సకుటుంబంగా, స్వచ్ఛందంగా టీకాలు వేయించుకోవాలని లేబర్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీ డి.పి.ఎస్.నెగి సూచించారు. ఈ సందర్భంగా టీకాల కార్యక్రమం ప్రాముఖ్యం గురించి కూడా ఆయన వివరించారు. ఈ టీకా కేవలం వ్యక్తుల రక్షణకు మాత్రమే ఉద్దేశించింది కాదని, భవిష్యత్తులో వారిద్వారా మరొకరి వ్యాధి సోకకుండా కాపాడుతుందని పేర్కొన్నారు. అందువల్ల టీకా తీసుకున్నవారికి స్వీయ రక్షణసహా వారి కుటుంబసభ్యులకు ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తినుంచి రక్షణ లభిస్తుందని నొక్కిచెప్పారు. దీనివల్ల అధికారులు, సిబ్బంది మరింత ఆత్మవిశ్వాసంతో, అంకితభావంతో పనిచేయగలరని పేర్కొన్నారు. ఈ టీకాకు సంబంధించిన అపనమ్మకంతో కూడిన ఆందోళనలేవీ అవసరం లేదని, టీకా తీసుకోవడం సామాజిక శ్రేయస్సులో భాగమని శ్రీ నెగి స్పష్టం చేశారు. ఇది మహమ్మారి వ్యాప్తి శృంఖలాన్ని ఛేదిస్తుందని, మన దేశానికి ఇది తక్షణావసరమని ఆయన వివరించారు.
***
(Release ID: 1717904)
Visitor Counter : 170