రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఇ-సంజీవని ఒ.పి.డి. పై ఆన్‌-లైన్ సంప్రదింపులు అందించనున్న - మాజీ రక్షణ శాఖ వైద్యులు

Posted On: 07 MAY 2021 4:53PM by PIB Hyderabad

రక్షణ శాఖలో పనిచేసిన మాజీ వైద్యులు ఇప్పుడు దేశంలోని పౌరులందరికీ ఇ-సంజీవని ఒ.పి.డి. పై ఆన్‌-లైన్ లో వైద్య పరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు.   అనుభవజ్ఞులైన ఈ వైద్య నిపుణులు, దేశ ప్రజల పిలుపుకు సమాధానం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.  వైద్య సంరక్షణ అవసరమైన ప్రజలకు సహాయం చేయడానికి వారి సేవలు అందించనున్నారు. ఈ విధంగా, తమ సేవలందించడానికి ముందుకు వచ్చిన అనుభవజ్ఞులైన వైద్య నిపుణులను ఉద్దేశించి, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, సాయుధ దళాల వైద్య సేవల డైరెక్టర్ జనరల్ (ఏ.ఎఫ్.ఎం.ఎస్) సర్జన్ వైస్ అడ్మిరల్ రజత్ దత్తా, 2021 మే, 7వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.  

దేశ ప్రజలెవరైనా ,  ఈ సేవలను,   https://esanjeevaniopd.in/ అనే, వెబ్-సైట్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. 

ఇ-సంజీవని ఒ.పి.డి. అనేది కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన టెలి-మెడిసిన్ వేదిక. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ) ఆధ్వర్యంలో, మొహాలిలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (సి-డి.ఏ.సి) అనే సంస్థ, దీనిని,  అభివృద్ధి చేసింది.  ఇది భారతీయ పౌరులందరికీ, ఉచిత సంప్రదింపులు అందిస్తూ, చాలా విజయవంతంగా పనిచేస్తోంది.  అయితే, కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా, వైద్యుల డిమాండ్ పెరిగింది, దీనికి తోడు, ఇక్కడ పనిచేసే వైద్యులను కోవిడ్ వార్డులలో విధులకు వినియోగించడం వలన వైద్యుల కొరత ఏర్పడింది.  ఈ పరిస్థితుల్లో, ఇక్కడ వైద్యుల కొరత తీర్చడానికి, రక్షణ శాఖకు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు ముందుకు వస్తున్నారు. 

సమగ్ర రక్షణ శాఖ సిబ్బంది (ఐ.డి.ఎస్) ప్రధాన కార్యాలయానికి చెందిన వైద్య విభాగం, సర్వీసులో ఉన్న మరియు రిటైర్ అయిన రక్షణ శాఖ సిబ్బందికి,  టెలీ-మెడిసిన్ సేవలను అందిస్తూ,  ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. మరియు ఎన్.ఐ.సి. ల సమన్వయంతో, సాధారణ పౌరులకు కూడా ఈ మాజీ సైనికోద్యోగుల ఓ.పి.డి. సేవలు అందించడానికి కృషి చేస్తోంది.   ఈ కార్యక్రమంలో పాల్గొని, దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో పౌరులకు విలువైన సలహాలు, సూచనలు అందించాలని, డిప్యూటీ చీఫ్ ఐ.డి.ఎస్. (మెడికల్) లెఫ్టినెంట్ జనరల్ మాధురి కనిట్కర్, ఏ.ఎఫ్.ఎం.ఎస్. కు చెందిన మాజీ వైద్యాధికారులను కోరారు. 

రక్షణ శాఖ నుండి రిటైరైన మాజీ వైద్యాధికారుల నుండి ఈ ప్రతిపాదన పట్ల మంచి స్పందన వచ్చింది.  త్వరలో, మరింతమంది, ఈ సేవలో చేరే అవకాశం ఉంది. తదనంతరం, దేశవ్యాప్తంగా, రక్షణ శాఖకు చెందిన మాజీ వైద్యాధికారులతో ఒక ప్రత్యేక ఓ.పి .డి.ని ఏర్పాటు కానుంది.   వారి విస్తారమైన అనుభవం, నైపుణ్యం,  దేశంలోని అనేక మంది ప్రజలు వారి ఇంటి నుండి వైద్య సలహాలు, సూచనలు పొందడం ద్వారా, ప్రస్తుత పరిస్థితులను అధిగమించడానికి, సహాయపడుతుంది. 

 

*****


(Release ID: 1716941) Visitor Counter : 267