స్పెషల్ సర్వీస్ మరియు ఫీచర్ లు
అత్యవసర ఆరోగ్య సేవల లభ్యత మెరుగు దిశగా బ్యాంకులకు రూ.50,000 కోట్ల ద్రవ్యత్వ సౌలభ్య కల్పన
వ్యక్తులు.. చిన్న వ్యాపారాలు.. ఎంఎస్ఎంఈలకు రుణ మద్దతు చర్యలపై ప్రకటన;
రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం నిబంధనలను సడలించిన ఆర్‌బిఐ;
భవిష్యత్ దశ విపత్తులపై జాగ్రత్తలతో రెండోదశ మహమ్మారి
సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందుకు రండి: ఆర్‌బిఐ గవర్నర్
Posted On:
05 MAY 2021 1:02PM by PIB Hyderabad
కోవిడ్-19 రెండోదశ విసిరిన సవాలుపై దేశం చేస్తున్న పోరాటానికి మద్దతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) చేపట్టిన పలు చర్యలను గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు ‘‘ప్రభుత్వం, ఆస్పత్రులు, వైద్యశాలలు, ఔషధశాలలు, టీకా/మందుల తయారీ/దిగుమతిదారులు, వైద్య ఆక్సిజన్ తయారీ/సరఫరాదారులు, కీలక ఆరోగ్య సంరక్షణ సరఫరా కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రైవేటు నిర్వాహకులు తదితర భాగస్వాములకు ఆర్థికపరమైన తోడ్పాటుకు సంబంధించిన అవరోధాలను తొలగించాల్సి ఉంది. ముఖ్యంగా సామాన్య పౌరులపై ఆరోగ్య వ్యయభారం హఠాత్తుగా పెరిగిన నేపథ్యంలో వారికి నిర్దిష్ట సమగ్ర ప్రతిస్పందనాత్మక విధాన మద్దతు తప్పనిసరి. మరోవైపు రెండోదశ మహమ్మారి విజృంభణ వల్ల చిన్న వ్యాపారాలు, క్షేత్రస్థాయిలోని ఆర్థికసహాయ సంస్థలు పెనుభారాన్ని భరించాల్సి వస్తోంది’’ అని శ్రీ దాస్ అన్నారు.
మహమ్మారిపై పోరులో భాగంగా గవర్నర్ ప్రకటించిన క్రమబద్ధ, సమగ్ర వ్యూహం ఆధారిత తొలిదశ చర్యలు కిందివిధంగా ఉన్నాయి:
- అత్యవసర ఆరోగ్య సేవల అందుబాటు కోసం రూ.50,000 కోట్లతో నియమితకాల ద్రవ్య లభ్యత
కోవిడ్ సంబంధిత ఆరోగ్య మౌలిక సదుపాయాలు-సేవల లభ్యత పెంపు నిమిత్తం అత్యవసర ఆరోగ్య సేవల సంస్థలకు రెపోరేట్ మేరకు మూడేళ్లపాటు ద్రవ్యలభ్యత కింద రూ.50,000 కోట్ల నిధులు అందుబాటులో ఉంటాయి. ఈ సదుపాయం కింద బ్యాంకులు వివిధ రకాల భాగస్వాములకు తాజా రుణమద్దతు ఇవ్వగలుగుతాయి. ఈ రుణ సదుపాయం 2020 మార్చి 31వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయం కింద రుణాలిచ్చే బ్యాంకులకు ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి.
- చిన్న ఆర్థిక సహాయ బ్యాంకుల ద్వారా ప్రత్యేక దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలు
దేశంలోని సూక్ష్మ-చిన్న-ఇతర అసంఘటిత రంగంలోని సంస్థలకు మరింత ఆర్థిక మద్దతునిచ్చే దిశగా రెపోరేట్ వద్ద రూ.10,000 కోట్ల మేర మూడేళ్లపాటు రెపో కార్యకలాపాలకు అనుమతి; దీనికింద ప్రతి రుణగ్రహీతకు రూ.10 లక్షల పరిమితికి లోబడి తాజా రుణాలు ఇవ్వవచ్చు; ఈ సదుపాయం 2021 అక్టోబరు 31వరకూ అందుబాటులో ఉంటుంది.
- సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థల రుణవితరణకోసం చిన్న ఆర్థికసహాయ బ్యాంకుల రుణమద్దతు ఇకపై ప్రాధాన్యరంగ రుణంగా వర్గీకరణ
తాజా సవాళ్ల నేపథ్యంలో రూ.500 కోట్ల పరిమాణంగల సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థలకు రుణవితరణ కోసం చిన్న ఆర్థికసహాయ బ్యాంకులు ప్రాధాన్యరంగ రుణంకింద తాజా రుణాలు మంజూరు చేసేందుకు అనుమతి. ఈ సదుపాయం 2022 మార్చి 31వరకూ లభ్యమవుతుంది.
- ‘ఎంఎస్ఎంఈ’ వ్యవస్థాపకులకు రుణ లభ్యత
బ్యాంకింగ్ కార్యకలాపాల పరిధిలో లేని ‘ఎంఎస్ఎంఈ’లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తేవడాన్ని మరింత ప్రోత్సహించే దిశగా 2021 ఫిబ్రవరిలో మినహాయింపు ఇవ్వబడింది. ఇందులో భాగంగా షెడ్యూల్డు బ్యాంకుల ‘సీఆర్ఆర్’ లెక్కింపు నిమిత్తం నికర సమయం-డిమాండ్ లయబిలిటీస్ నుంచి కొత్త ‘ఎంఎస్ఎంఈ’ రుణగ్రహీతలకు ఇవ్వబడిన రుణం కోత పెట్టేందుకు అనుమతించబడింది. తాజాగా ఈ అనుమతి 2021 డిసెంబరు 31 వరకూ పొడిగించబడింది.
5. వ్యక్తులు.. చిన్న వ్యాపారాలు.. ‘ఎంఎస్ఎంఈ’లకు ఒత్తిడి పరిష్కార చట్రం 2.0
రుణగ్రహీతలలో అత్యంత దుర్బల వర్గాలైన- వ్యక్తులు, చిన్న వ్యాపారులు, ‘ఎంఎస్ఎంఈ’లు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించేందుకు రిజర్వు బ్యాంకు కింద చర్యలను ప్రకటించింది.
ఎ) వ్యక్తులు, చిన్న వ్యాపారులతోపాటు మునుపటి పరిష్కార చట్రం కింద పునర్ వ్యవస్థీకరించని రుణం రూ.25 కోట్లదాకాగల ‘ఎంఎస్‌ఎంఈ’లు 2021 మార్చి 31న ప్రమాణీకృత వర్గీకరణలోకి వచ్చేట్లయితే పరిష్కార చట్టరం 2.0 కింద వారు పరిగణనలోకి వస్తారు. కొత్త పరిష్కార చట్రం కింద పునర్ వ్యవస్థీకరణను 2021 సెప్టెంబర్ 30లోగా ప్రారంభించవచ్చు. అటుపైన 90 రోజుల్లోగా దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
బి) వ్యక్తులు, చిన్న వ్యాపారులు పరిష్కార చట్రం 1.0 కింద రుణ పునర్ వ్యవస్థీకరణ చేసుకుని, రెండేళ్లకు లోపు మారటోరియం అనుమతించబడి ఉంటే రుణసహాయ సంస్థలు సదరు వ్యవధిని లేదా మిగిలిన వ్యవధిని మొత్తం 2 సంవత్సరాల స్థాయికి పెంచవచ్చు.
సి) లోగడ రుణ పునర్ వ్యవస్థీకరణ చేసుకున్న చిన్న వ్యాపారాలు, ‘ఎంఎస్ఎంఈ’లకు సంబంధించి ఏకకాల పరిష్కార చర్య కింద నిర్వహణ మూలధన మంజూరు పరిమితులను రుణసహాయ సంస్థలు సమీక్షించేందుకు అనుమతించబడింది.
- మెరుగైన వినియోగదారు అనుభవం రీత్యా కేవైసీ నిబంధనల హేతుబద్ధీకరణ
ఈ దిశగా ప్రతిపాదిత చర్యలేమిటంటే: (ఎ) యాజమాన్య సంస్థల వంటి కొత్త వినియోగదారు వర్గీకరణలో కేవైసీని వీడియో విధానంలోకి విస్తరించే వీలు; (బి) పరిమిత కేవైసీ ఖాతాలు సంపూర్ణ కేవైసీ స్థాయికి మార్పిడి; (సి) కేవైసీ ఉన్నతీకరణలో మరిన్ని వినియోగదారు-హిత ఎంపికలను ప్రవేశపెట్టడం; (డి) వ్యక్తిగత గుర్తింపు కింద ‘వి-సీఐపీ’, ఎలక్ట్రానిక్ పత్రాల సమర్పణ కోసం కేంద్రీకృత కేవైసీ భాండాగారం (సీకేవైసీఆర్)కు చెందిన కేవైసీ గుర్తింపు ఉపకరణం వినియోగ సౌలభ్య కల్పన.
- చలన కేటాయింపులు... ప్రతిదిశ నిల్వల కేటాయింపు
బ్యాంకులు 2020 డిసెంబరు 31నాటికి తమవద్దగల 100 శాతం తాత్కాలిక కేటాయింపులను నిర్దిష్ఠ నిరర్థక ఆస్తుల కోసం కేటాయించవచ్చు; ఇలా నిధుల వినియోగం 2022 మార్చి 31వరకూ మాత్రమే అనుమతించబడుతుంది.
- రాష్ట్రాలకు ఓవర్‌డ్రాఫ్ట్ నిబంధనల సడలింపు
రాష్ట్ర ప్రభుత్వాలు త్రైమాసికంలో ఓవర్‌డ్రాఫ్ట్ చెల్లించాల్సిన గరిష్ఠ గడువు 36 రోజుల నుంచి 50 రోజులకు; ఓవర్‌డ్రాఫ్ట్ వరుస దినాల సంఖ్య 14 నుంచి 21 రోజులకు పెంపు. ఈ సౌలభ్యం 2021 సెప్టెంబరు 30దాకా మాత్రమే అమలులో ఉంటుంది.
‘‘గాఢాంధకారంలోనూ నా విశ్వాసం ఎంతో ఉజ్వలం’’: మహాత్మాగాంధీ
ఈ మేరకు రిజర్వు బ్యాంకు చేపట్టిన చర్యలను ప్రకటించిన సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ మాటలను ఆర్‌బిఐ గవర్నర్ శ్రీ శక్తికాంతదాస్ ఉటంకించారు. మహమ్మారి నుంచి ఉపశమనం లభించాక, రెండోదశ విజృంభించి వ్యాధి పీడితుల సంఖ్యతోపాటు మరణాలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని, వైద్యపరమైన మద్దతును అనూహ్య స్థాయికి పెంచడంలో భారత్ వీరోచితంగా ముందంజవేసిందని ఆయన పేర్కొన్నారు. ఇంతటి భీకర పరిస్థితుల నడుమ జీవనోపాధికి మద్దతివ్వడం, కార్యాలయాలు/విద్యాలయాలకు చేరడంలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ, ఆదాయ లభ్యత కల్పన తదితరాలకు అండగా నిలవడం అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు.
వైరస్ అనూహ్య వేగంతో విజృంభించడాన్ని అడ్డుకోవడంలో భాగంగా అత్యంత దుర్బల వర్గాలుసహా అందరికీ ఉపశమనం కలిగించే విధంగా సకాల, సత్వర, విస్తృత, వరుస క్రమంతో కూడిన చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ దిశగా ఆరోగ్య రక్షణ రంగంతోపాటు, శాంతిభద్రతల సిబ్బందిసహా ముందువరుస పోరాట కార్యకర్తలు మహమ్మారితో సాహసోపేత పోరాటం చేస్తున్నారని వివరించారు. సూక్ష్మ ఆర్థిక, ద్రవ్యరంగంలోని పరిస్థితులపై కోవిడ్-19 రెండోదశ ప్రభావాన్ని రిజర్వు బ్యాంకు నిశితంగా పర్యవేక్షిస్తున్నదని ఆయన చెప్పారు. ‘‘పౌరులు ఎదురైన తీవ్ర కష్టనష్టాలను తొలగించేందుకు మేం శక్తివంచన లేకుండా ప్రభుత్వంతో సంయుక్తంగా మా వంతు కృషిచేస్తాం’’ అని ఆయన తన ప్రకటనలో స్పష్టం చేశారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై ఆయన అంచనాల్లోని కొన్ని ముఖ్యాంశాలు కిందివిధంగా ఉన్నాయి:
- అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నట్లు సంకేతాలు అందుతున్నాయి
- అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతోపాటు వర్ధమాన మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో 2021 వేసవినాటికి, ఇతర దేశాల్లో 2022 రెండో అర్థభాగంనాటికి టీకాలు అందుబాటులోకి రాగలవన్న అంచనాల నేపథ్యంలో 2021కిగాను ప్రపంచ వృద్ధి అంచనా స్థాయిని 2021 ఏప్రిల్ నెలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) 5.5 శాతం నుంచి సవరించి 6 శాతానికి పెంచింది.
- వ్యవసాయరంగం కూడా 2020-21లో పరిస్థితులకు ఎదురొడ్డి రికార్డు స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తిని కొనసాగించింది. తద్వారా అన్ని ఇతర రంగాలకూ ఆహార భద్రత, రక్షణకు భరోసా లభించింది.
- అలాగే 2021-22లో రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో గ్రామీణ డిమాండ్ సుస్థిరంగా కొనసాగుతూ ఉత్పాదకత ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఉపశమింప చేయగలదన్న ఆశాభావం ఏర్పడింది.
- స్థానికీకృత, లక్షిత నియంత్రణ చర్యలు వ్యాపారాలు, కుటుంబాల మనుగడకు తోడ్పాడుతున్నాయి. కాబట్టి నిరుటితో పోలిస్తే మొత్తం డిమాండుపై ప్రభావం ఓ మోస్తరుకు పరిమితం కావచ్చు.
- ఆహార-ఇంధన ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఫలితంగా వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 2021 ఫిబ్రవరిలో 5.0 శాతం నుంచి 2021 మార్చిలో 5.5 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో సాధారణ రుతుపవనాల వల్ల ముఖ్యంగా పప్పులు, తృణధాన్యాల ఆధారిత ఆహార ధరల ఒత్తిడి నియంత్రణ సాధ్యం కాగలదని అంచనా.
- వాణిజ్య రంగంలో ఎగుమతి-దిగుమతులకు సంబంధించి 2021 ఏప్రిల్ నెలలోనూ గణనీయ వృద్ధి కొనసాగినట్లు స్పష్టమైంది.
- అంతర్జాతీయంగా ద్రవ్య ఒడుదొడుకులు ఏర్పడినా మన విదేశీమారక నిల్వలతో మనం ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు.
- పుష్కల అదనపు ద్రవ్య లభ్యత నేపథ్యంలో దేశీయ ఆర్థిక పరిస్థితులు స్థిమితంగానే కొనసాగుతాయి.
మార్కెట్ల సానుకూల స్పందన నేపథ్యంలో రూ.35,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీలను రెండో దఫా కొనుగోలును 2021 మే 20న చేపడతామని ఆయన ప్రకటించారు. మహమ్మారి రెండోదశ అధిగమించలేనంత కష్టసాధ్యమైనదేమీ కాదని గవర్నర్ స్పష్టం చేశారు. వీలైన అన్ని మార్గాలద్వారా మానవ ప్రాణరక్షణ, జీవనోపాధి పునరుద్ధరణే మన తక్షణ కర్తవ్యాలని ఆయన పునరుద్ఘాటించారు. ఇందులో తన వంతుగా ఆర్థిక పరిస్థితుల సానుకూలత, మార్కెట్ల నిరంతర సమర్థ పనితీరు దిశగా రిజర్వు బ్యాంకు సదా యుద్ధ సంసిద్ధతతో ఉంటుందని గవర్నర్ ప్రకటించారు. తదనుగుణంగా డిమాండు మేరకు సంప్రదాయ విరుద్ధంగానైనా సరికొత్త రీతిలో స్పందించడానికి రిజర్వు బ్యాంకు కట్టుబడి ఉందని శ్రీ దాస్ సుస్పష్టం చేశారు.
***
(Release ID: 1716322)
Visitor Counter : 237