ఆయుష్
“ఆయుష్ -64” గురించి తరచుగా అడిగే ప్రశ్నలకు స్పందించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 స్వల్ప,తేలికపాటి లక్షణాలున్న కేసులకు చికిత్స చేయడానికి పాలిహెర్బల్ ఔషధం అయిన ఆయుష్ 64 ఉపయోగపడుతుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడయింది.
Posted On:
04 MAY 2021 11:15AM by PIB Hyderabad
1980లో మలేరియాకు చికిత్స కోసం అభివృద్ధి చేసిన పాలిహెర్బల్ ఔషధం ఆయుష్ -64..ఇప్పుడు కోవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు ఓ ఆశాకిరణంగా నిపుణులు భావిస్తున్నారు. ద సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సిసిఆర్ఎఎస్ ) ఆయుర్వేదానికి అంకితమైన ఆయుష్ మంత్రిత్వ శాఖలోని ఒక పరిశోధనా సంస్థ. ఇటీవల కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) మరియు దేశవ్యాప్తంగా అనేక ఇతర పరిశోధనా సంస్థలు మరియు వైద్య కళాశాలల సహకారంతో ఈ సంస్థ విస్తృతమైన మరియు బలమైన క్లినికల్ ట్రయల్స్‌ను చేపట్టింది. దేశంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తల నేతృత్వంలోని ట్రయల్స్‌లో ఆయుష్ 64 లో ముఖ్యమైన యాంటీవైరల్, ఇమ్యూన్-మాడ్యులేటర్ మరియు యాంటిపైరేటిక్ లక్షణాలు ఉన్నాయని తేలింది. లక్షణం లేని, తేలికపాటి మరియు మితమైన కొవిడ్-19 సంక్రమణ చికిత్సలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని కనుగొనబడింది. దాంతో ఈ ఔషధం ఇప్పుడు కొవిడ్-19 చికిత్స కోసం తిరిగి తయారు చేయబడుతోంది.
2021 ఏప్రిల్ 29 న విలేకరుల సమావేశంలో క్లినికల్ ట్రయల్స్ పై మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ప్రజలలో మరియు వైద్య అభ్యాసకులలో ఆయుష్ -64 పై గణనీయమైన ఆసక్తిని కలిగించింది. దాంతో ఈ విషయంపై స్పందించిన మంత్రిత్వ శాఖ ఇప్పుడు తరచూ అడిగే ప్రశ్నలు ఆకృతిలో దానికి సమాధానాలను విడుదల చేసింది.ఆ ప్రశ్నలు వాటికి సమాధానాలు కింద వివరించబడ్డాయి:
1. ఆయుష్ -64 అంటే ఏమిటి
ఆయుష్ -64 ఒక ఆయుర్వేద సూత్రీకరణ.ఆయుర్వేదంలో పరిశోధన కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ అత్యున్నత సంస్థ అయిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (సిసిఆర్ఎఎస్) చే ఇది అభివృద్ధి చేయబడింది. వాస్తవానికి 1980లో మలేరియా నిర్వహణ కోసం అభివృద్ధి చేయబడిన ఈ ఔషధం ఇప్పుడు కోవిడ్ 19 కొరకు పునర్నిర్మించబడింది. ఎందుకంటే దాని పదార్థాలు ముఖ్యమైన యాంటీవైరల్, రోగనిరోధక-మాడ్యులేటర్ మరియు యాంటీపైరెటిక్ లక్షణాలను చూపించాయి. ఆయుష్ 64 పై చేసిన ఇన్-సిలికో అధ్యయనం దాని ఫైటో-కాంపోనెంట్లలో 36 లో 35 లో కొవిడ్ 19 వైరస్ కు వ్యతిరేకంగా ఉందని తేలింది. ఇన్ ఫ్లూయింజా వంటి అనారోగ్యాలపై ఇది చాలా మంచి ఫలితాలను చూపించింది. భారతదేశం అంతటా 6 క్లినికల్ అధ్యయనాలతో పాటు శాస్త్రీయ ఆధారాలతో ఆయుష్ 64 క్లినికల్ రికవరీ మరియు జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు లక్షణరహిత, తేలికపాటి మరియు మితమైన కొవిడ్-19 కేసులలో గుర్తించబడింది.
2. ఆయుష్ -64 ను ఎవరు తీసుకోవచ్చు?
కొవిడ్-19 వ్యాధి యొక్క ఏ దశలోనైనా రోగులు దీనిని తీసుకోవచ్చు. అయితే ఇది ప్రమాద కారకాలు లేకుండా లక్షణరహిత, తేలికపాటి మరియు మితమైన వ్యాధి చికిత్సలో సమర్థ వంతమైన ఫలితాన్ని చూపించినట్టు అధ్యయనంలో వెల్లడయింది. అత్యవసర సహాయం లేదా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని వారు ఆయుష్-64 తీసుకోవడానికి అర్హులు. జ్వరం, అనారోగ్యం, శరీర నొప్పి, జలుబు, తలనొప్పి, దగ్గు మొదలైన ప్రారంభ లక్షణాలను చూపించే తేలికపాటి నుండి మితమైన కొవిడ్-19 కేసులు మరియు కొవిడ్-19 యొక్క లక్షణం లేని కేసుల రోగులు ఆర్టీ-పిసిఆర్ పరీక్ష ద్వారా రోగ నిర్ధారణ జరిగిన 7 రోజుల్లో ఆయుష్ 64 తీసుకోవడం ప్రారంభించవచ్చు.
3. నేను ఆయుష్ -64 ను ఎందుకు తీసుకోవాలి?
ఆయుష్ -64 వ్యాధి లక్షణాలు మరియు తీవ్రత పరంగా క్లినికల్ రికవరీ వేగాన్ని గణనీయంగా పెంచుతుందని కనుగొనబడింది. ఇది సాధారణ ఆరోగ్యం, అలసట, ఆందోళన, ఒత్తిడి, ఆకలి, సాధారణ శ్రేయస్సు మరియు నిద్రపై గణనీయమైన ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది.
4. కొవిడ్-19 పై దీని సామర్థ్యం శాస్త్రీయంగా నిరూపించబడిందా?
ఆయుష్ -64 అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆయుర్వేదంలో పరిశోధన కోసం అత్యున్నత సంస్థ అయిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సిసిఆర్ఎఎస్) చేత నియంత్రణ అవసరాలకు అనుగుణంగా నాణ్యత మరియు ఫార్మాకోపోయియల్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడిన పాలీ హెర్బల్ సూత్రీకరణ. దేశంలో నిర్వహించిన బలమైన క్లినికల్ ట్రయల్స్ ద్వారా ప్రామాణిక సంరక్షణకు అనుబంధంగా లక్షణరహిత, తేలికపాటి మరియు మితమైన కొవిడ్-19 సంక్రమణ చికిత్సలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. క్లినికల్ ట్రయల్స్ యొక్క ఫలితాలు ఆయుష్ 64 స్టాండర్డ్ ఆఫ్ కేర్ (ఎస్ వో సీ) కు అనుబంధంగా వైద్యపరంగా గణనీయమైన మెరుగుదలను చూపించాయి.
5. కొవిడ్-19 రోగులలో ఆయుష్ -64 కి అనువైన మోతాదు ఏమిటి?
లక్షణం లేని కొవిడ్-19 రోగుల యొక్క మోతాదు 14 రోజుల పాటు భోజనం చేసిన గంట తర్వాత వెచ్చని నీటితో రోజుకు రెండుసార్లు రెండు 500 మి.గ్రా మాత్రలు తీసుకోవాలి. తేలికపాటి నుండి మితమైన లక్షణాలున్న రోగులు 14 రోజుల పాటు భోజనం చేసిన గంట తర్వాత వెచ్చని నీటితో రోజుకు మూడుసార్లు రెండు 500 మి.గ్రా మాత్రలు తీసుకోవాలి.
6. ఆయుష్ -64 వల్ల ఏదైనా దుష్ప్రభావాలు ఉన్నాయా?
కొంతమంది రోగులలో విరోచనాలు కనిపించాయి. అయితే అదికూడా పరిమితం. దానికి వైద్యుల చికిత్స అవసరం లేదు.
7. ఆయుష్-64 ను రోగనిరోధక ఔషధంగా కూడా తీసుకోవచ్చా?
రోజూ రెండుసార్లు 500 మి.గ్రా 2 టాబ్లెట్ల మోతాదులో ఇది రోగనిరోధకత కోసం కూడా ఉపయోగించబడుతుంది. అయితే రోగనిరోధక ఏజెంట్‌గా దీని సామర్థ్యాన్ని క్లినికల్ అధ్యయనాల్లో పరిశీలించలేదు. ఒక వ్యక్తి కొవిడ్-19కు గురైనట్లయితే లక్షణాలు కనిపించినప్పుడు ఆయుష్ -64 తీసుకోవచ్చు. అటువంటి సందర్భాలలో ఆ వ్యక్తి ఆర్టీ-పిసిఆర్ లేదా రాపిడ్ యాంటిజెన్ పరీక్ష ద్వారా కొవిడ్-19 కొరకు పరీక్షించబడాలి. అలాగే ఎస్ వో సిని అనుసరించాలి.
8. స్వల్పలక్షణాలున్న కొవిడ్-19 రోగులు ఆయుష్ -64 ను సొంతంగా తీసుకోవచ్చా?
తగిన రిఫెరల్ సదుపాయాల లభ్యత ఉన్నట్లయితే ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో తేలికపాటి కేసులలో ఇది స్వతంత్ర చికిత్సగా తీసుకోవచ్చు. ఏదేమైనా, రోగి ఇంటివద్ద ఒంటరిగా ఉన్నప్పుడు, తేలికపాటి నుండి మితమైన వ్యాధితో ఆయుష్ 64 ను ఎస్ వో సికి అనుబంధంగా తీసుకోవాలని సలహా ఇస్తారు. ఆయుష్ -64 అర్హత కలిగిన ఆయుష్ అభ్యాసకుడి సలహా ప్రకారం మాత్రమే ఉపయోగించబడుతుంది.
9. ఆయుష్ -64 ను ఎన్ని రోజులు తీసుకోవాలి?
ఆయుష్ -64 ను కనీసం 14 రోజులు తీసుకోవచ్చు. అవసరమైతే అర్హత కలిగిన ఆయుష్ అభ్యాసకుడి సలహా ప్రకారం 12 వారాల వరకు తీసుకోవచ్చు. ఇది 12 వారాల పాటు సురక్షితమని క్లినికల్ అధ్యయనాల ద్వారా శాస్త్రీయంగా నిరూపించబడింది.
10. ఆయుష్ -64 ను ఎలా తీసుకోవాలి?
భోజనం చేసిన ఒక గంట తర్వాత ఇది వేడి నీటితో తీసుకోవచ్చు.
11. ఇతర వ్యాధులు ఉన్న కొవిడ్-19 రోగి ఆయుష్ -64 తీసుకోవచ్చా?
రక్తపోటు, డయాబెటిస్ మొదలైన ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులు ఆయుష్-64 ను లక్షణం లేని, తేలికపాటి నుండి మితమైన కేసుల్లో తీసుకోవచ్చు. అలాగే వారు ఇప్పటికే వాడుతున్న మందులను కొనసాగించాలని సూచన.
12. టీకా తీసుకున్న తర్వాత ఆయుష్ -64 సురక్షితమేనా?
అవును. టీకాలు వేసిన తర్వాత కూడా ఒక వ్యక్తికి వ్యాధి సోకినట్లయితే, ఆయుష్ -64 ను ఎస్ఎఆర్ఎస్ సివోవి-2 కొరకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ద్వారా పాజిటివ్ గా తేలిన 7 రోజుల్లో, ఆయుష్ వైద్యుడిని సంప్రదించి తీసుకోవచ్చు. అయినప్పటికీ, శాస్త్రీయ అధ్యయనాల ద్వారా దీనికి అనుకూలమైన ఆధారాలు లభించలేదు.
13. గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలలో ఇది సురక్షితమేనా?
గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలలో ఆయుష్ -64 యొక్క భద్రత శాస్త్రీయ అధ్యయనాల్లో పరిశీలించలేదు.
14. ఆయుష్ -64 మార్కెట్లో అందుబాటులో ఉందా?
ఇది మార్కెట్లో లభిస్తుంది మరియు ఆయుర్వేద ఫార్మసీల నుండి కొనుగోలు చేయవచ్చు. అయినప్పటికీ, ఇది ఓవర్ కౌంటర్ ప్రిస్క్రిప్షన్ (ఓటిసి) గా ఉపయోగించరాదని మరియు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించబడుతుందని నిర్ధారించుకోవాలి.
15. ఆయుష్ -64 తీసుకునేటప్పుడు నేను ఏ మార్గదర్శకాలను అనుసరించాలి?
ఆయుష్ -64 ఉపయోగిస్తున్నప్పుడు అనుసరించాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు ఏమీ లేవు. ఏదేమైనా, ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అన్ని కొవిడ్-19 సంబంధిత మార్గదర్శకాలను మాత్రం తప్పక పాటించాలి.
***
(Release ID: 1715902)
Visitor Counter : 529