ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

మహిళాసాధికారతకు ఉపరాష్ట్రపతి ‘ఎడ్యుకేట్, ఎన్‌లైటెన్, ఎంపవర్’ మంత్రం


• మహిళలు మన భావి పురోగతి నిర్దేశకులు, దేశాభివృద్ధికి లింగ బేధాన్ని పక్కన పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు

• వేతనాల్లో లింగ సమానత్వం, అధికారిక రంగంలో అడ్డంకులను అధిగమించే దిశగా భారత్ నాయకత్వ పాత్ర పోషించాలని సూచన

• కరోనా మహమ్మారి బాలికల విద్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది, దీన్ని యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దాలి

• కోవిడ్ -19 మహమ్మారితో సాగిస్తున్న పోరాటంలో ముందు వరుస మహిళా యోధుల పాత్రను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి

• ఫిక్కి మహిళా సంస్థ (ఎఫ్.ఐ.సి.సి.ఐ. ఎఫ్.ఎస్.ఓ) నిర్వహించిన వందేమాతరం- ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో అంతర్జాలం ద్వారా పాల్గొన్న ఉపరాష్ట్రపతి

Posted On: 30 APR 2021 5:29PM by PIB Hyderabad

ప్రస్తుతం మహిళా శ్రామికశక్తి 20 శాతం మేర మాత్రమే ఉందని, భారతదేశ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ఈ లింగబేధాన్ని పక్కన పెట్టి, సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పారిశ్రామిక రంగానికి పిలుపునిచ్చారు.

మహిళాసాధికారతకు, ఎడ్యుకేట్ (విద్యావంతులు కావడం), ఎన్‌లైటెన్ (జ్ఞానాన్ని సముపార్జించడం), ఎంపవర్ (సాధికారిత సంపాదించడం) అనే త్రిపద సూత్రాన్ని ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి, మహిళలు మన దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే దిశగా ఈ మంత్రం మార్గనిర్దేశనం చేస్తుందన్నారు.

 

 ఫిక్కీ మహిళా సంస్థ (ఎఫ్‌ఐసీసీఐ- ఎఫ్‌ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన, ‘వందేమాతరం-ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి అంతర్జాల మాధ్యమం ద్వారా ప్రసగించారు. మనం అద్భుతమైన మానవ వనరులను కలిగి ఉన్నామన్న ఆయన, అందులో మహిళ పాత్ర కూడా మరింత కీలకమనే విషయాన్ని విస్మరించకూడదని తెలిపారు. మహిళల నేతృత్వంలో వేగవంతమైన పారిశ్రామిక వృద్ధి సాధ్యమని నొక్కి చెప్పిన ఆయన, భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్న ఆయన, మహిళలు భారతదేశ భావి వృద్ధి నిర్దేశకులు అని తెలిపారు.

పనిచేసే ప్రదేశాల్లో మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి ఉన్న అడ్డంకులను, సమస్యలను పరిశీలించి, పరిష్కరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, కరోనా మహమ్మారి వల్ల లింగ వివక్ష మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. మహిళలను మరింత శక్తి వంతం చేయడానికి ప్రాతినిధ్యం, వేతనం, అవకాశం వంటి అంశాల్లో వారి ప్రాధాన్యత పెంచాలని సూచించారు. 

వేతన అసమానతల సమస్యను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, సమాన పనికి సమాన వేతనం అనేది నేటికీ ఓ ప్రాథమిక డిమాండ్‌గా కొనసాగడం బాధాకరమని, ఈ వివక్ష అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, కార్పొరేట్  రంగంలోనూ నేటికీ పరిష్కారానికి నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ యొక్క ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020’ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో కూడా 15శాతం వేతన అసమానతలున్నట్లు ఈ నివేదిక తెలియజేస్తోందని, ఇప్పటి వరకూ ఏ దేశమూ వేతనాల్లో లింగ సమానత్వాన్ని సాధించలేకపోయిందని అభిప్రాయపడ్డారు.

లింగ వివక్షను రూపు మాపే విషయంలో భారత్ ముందుండాలని ఆకాంక్షించిన ఉపరాష్ట్రపతి, ప్రగతిశీల ప్రసూతి ప్రయోజన (సవరణ) చట్టం – 2017 ను ప్రశంసించారు. జీతంతో కూడిన ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఇది మార్గం చూపించిందన్నారు. మాతృత్వం, పిల్లల సంరక్షణ కొనసాగిస్తూనే తమ కర్తవ్యాలను నిర్విహించే మహిళల విషయంలో వేతన లింగ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఈ చట్టం సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. 

అధికారిక రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, అడ్డంకులను అధిగమించడం అనేది ఒక రోజులోనో, ఒక స్థాయిలోనో సాధించగలిగేది కాదని, ఇది కొనసాగుతూ ఉండాలని తెలిపారు. 500 అతిపెద్ద కంపెనీలను చూస్తే వాటిలో మొత్తం 35 మంది సీఈవోలు మాత్రమే మహిళలు ఉన్నారని తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ప్రాధాన్యత లేమి విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో ఏటా ఎంతో మంది మహిళలు వివిధ రంగాల్లో తమ విజయాలతో తమదైన ముద్ర వేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రాంట్ తోర్న్టన్ వెలువరించిన ‘విమెన్ ఇన్ బిజినెస్ – 2021’ నివేదికను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. దీని ప్రకారం సీనియర్ నిర్వహణా స్థానాల్లో పని చేసే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో భారతదేశంలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందని, ఇది శ్రామిక మహిళ పట్ల భారతీయ వ్యాపార రంగంలో మారుతున్న దృక్పథాన్ని, భారత ఆర్థిక వ్యవస్థ సానుకూల గమనాన్ని సూచిస్తోందని, సంఘటిత పని సంస్కృతి యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిశ్రమలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 

ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, పాఠశాలల్లో బాలికలు అబ్బాయిల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నారని, అయితే ఉన్నత విద్యలో వారి నమోదులో అంతరాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సైతం ఆడపిల్లల విద్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపించిందన్న ఉపరాష్ట్రపతి, ఈ అసమానతలను యుద్ధప్రాతిపదికన సరిదిద్దాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళలను సాధికారపరచడం యొక్క ప్రాధాన్యతను వివరించిన ఉపరాష్ట్రపతి, రాజకీయ సాధికారత కోసం రాష్ట్ర శాసనసభల్లో మరియు పార్లమెంట్ లో మహిళలకు తగిన రిజర్వేషన్లను అందించాలని సూచించారు. ఆర్థిక సాధికారత దిశగా స్టాండ్ అప్ ఇండియా వంటి పథకాల ద్వారా మహిళలు వ్యాపారాలు మరియు సహకార సంస్థలను ప్రారంభించగలగాలని, అదే సమయంలో సామాజిక సాధికారతలో భాగంగా మహిళలు ఏ విధమైన వివక్షను ఎదుర్కోకుండా చూడాలని, మహిళల పట్ల జరిగే దాడుల విషయంలో కఠినమైన చర్యలు ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం సాగిస్తున్న పోరాటంలో ముందుండి తమ సేవలను అందిస్తున్న మహిళా శక్తిని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటరీ కార్మికులు, ఆశా కార్మికులు, మరియు పోలీసుల్లో మహిళా మణుల పాత్రను దేశం మరువదన్నారు. 

కోవిడ్ -19 రెండో వేవ్ గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, కోవిడ్ యొక్క ఈ క్లిష్టమైన దశను అధిగమించి, భారతదేశం బలంగా నిలబడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం మహమ్మారి మీద పోరాటం సాగించేందుకు, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడేందుకు ప్రయత్నించడం మాత్రమే కాకుండా, సరికొత్త సాధారణ పరిస్థితుల వైపుగా ముందుకు సాగాలని సూచించారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెంచడం, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించే విషయంలో ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి, భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సంక్షోభం ఎదురైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో ముందుకు వచ్చిన సహకరించిన పారిశ్రామిక రంగాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. టీకా కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో అన్ని సంస్థలు తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకా వేసేలా ప్రస్తుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎవరినీ విస్మరించకుండా అందరి ఆరోగ్యాన్ని, అభివృద్ధిని కాంక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వందేమాతరం-ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి చిగురుపాటి ఉమ, ఫిక్కి మహిళా సంస్థ (ఎఫ్.ఐ.సి.సి.ఐ. ఎఫ్.ఎస్.ఓ) జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి ఉజ్వలా సింఘానియా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ఆశా వశిష్ట్, ఇండియన్ నావీ లెప్టినెంట్ కమాండర్ వర్తిక జోషి, ఇండియన్ ఆర్మి రిటైర్డ్ కెప్టెన్ శాలిని సింగ్ తదితరులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

***



(Release ID: 1715154) Visitor Counter : 539