రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వైమానిక దళం ద్వారా కొవిడ్‌ ఉపశమన చర్యలు

Posted On: 24 APR 2021 5:07PM by PIB Hyderabad

భారత వైమానిక దళం కొవిడ్‌ ఉపశమన చర్యలను కొనసాగిస్తోంది.

    వైమానిక దళానికి చెందిన ఒక సీ-17 విమానం శనివారం తెల్లవారుజామున 2 గంటలకు హిందాన్‌ వైమానిక దళ స్థావరం నుంచి బయల్దేరి, ఉదయం 7.45కు సింగపూర్‌లోని చాంగి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ 4 ఖాళీ క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లను విమానంలోకి ఎక్కించుకుని, తిరిగి బయల్దేరి, పనాగర్‌ వైమానిక స్థావరానికి వాటిని చేర్చింది.

    మరో సీ-17 విమానం ఉదయం 8 గంటలకు హిందాన్‌ వైమానిక స్థావరం నుంచి బయల్దేరి ఉదయం 10 గంటలకు పుణె వైమానిక స్థావరానికి చేరుకుంది. అక్కడి నుంచి 2 ఖాళీ క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లను తీసుకుని, జామ్‌నగర్‌ వైమానిక స్థావరానికి చేర్చింది. మరోసారి పుణె వెళ్లి, మరో 2 ఖాళీ క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లను తీసుకుని మళ్లీ జామ్‌నగర్‌కు రవాణా చేసింది.

    మరో సీ-17 విమానం కూడా, శనివారం ఉదయం 2 ఖాళీ కంటైనర్లను జోధ్‌పూర్‌ నుంచి జామ్‌నగర్‌కు తరలించింది.

    వైమానిక దళానికి చెందిన చినోక్‌ హెలికాప్టర్‌ జమ్ము నుంచి లెహ్‌కు, ఏఎన్‌-32 రవాణా విమానం జమ్ము నుంచి కార్గిల్‌కు కొవిడ్‌ పరీక్ష పరికరాలను తరలించాయి. బయో సేఫ్టీ క్యాబినెట్లు, సెంట్రిఫ్యూజ్‌లు, స్టెబిలైజర్లు ఈ సామగ్రిలో ఉన్నాయి. వీటిని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) తయారు చేసింది. కొవిడ్‌ పరీక్షలను పెంచడానికి లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతానికి వాటిని అందించింది.

    కరోనా వైరస్‌ను నియంత్రించడానికి, ఓడించడానికి దేశం చేస్తున్న భారీ పోరాటంలో ఉత్పన్నమవుతున్న అవసరాలను ఉన్నత మార్గంలో తీర్చడానికి రంగంలోకి దిగిన భారత వైమానిక దళం, తన నిబద్ధతను మరోమారు చాటింది. 

***



(Release ID: 1713854) Visitor Counter : 128