హోం మంత్రిత్వ శాఖ

కొవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల వల్ల ఏర్పడుతున్న పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్‌ షా సమీక్ష; వైద్య ఆక్సిజన్ సరఫరాను పెంచేలా వివిధ చర్యలకు ఆదేశం


రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ఆక్సిజన్‌ కేటాయించేలా నిపుణుల బృందానికి ఆదేశం

ఆక్సిజన్‌ సరఫరా వాహనాలకు తగిన భద్రత కల్పించాలని, రవాణా కోసం ప్రత్యేక మార్గాలు ఉండేలా నిబంధనలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలకు మంత్రిత్వ శాఖ నుంచి లిఖితపూర్వక నిర్దేశం

కొన్ని అత్యవసర రంగాలకు తప్ప, పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్‌ సరఫరాను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

Posted On: 23 APR 2021 8:42PM by PIB Hyderabad

పెరుగుతున్న కొవిడ్‌ కేసుల కారణంగా వైద్య ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్‌ షా సమీక్షించారు. వైద్య చికిత్సలకు ఆక్సిజన్ సరఫరాను పెంచేలా వివిధ చర్యలకు ఆదేశించారు. దీని ప్రకారం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలకు తగ్గట్లుగా ఆక్సిజన్ కేటాయింపులను ఒక నిపుణుల బృందం పర్యవేక్షిస్తోంది. దీంతోపాటు, క్రియాశీల కేసులను దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్ పంపిణీ సమయం తగ్గేలా చూస్తోంది.

    దేశవ్యాప్తంగా వైద్య అవసరాలకు ఆక్సిజన్‌ సరఫరాలో ఆటంకాలు రాకుండా చూడాలని, విపత్తుల నిర్వహణ చట్టం-2005 ప్రకారం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఈ నెల 22వ తేదీ హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ ఆదేశానికి కట్టుబడి ఉండాలని, ఆక్సిజన్‌ సరఫరా వాహనాలకు తగిన భద్రత కల్పించాలని, రవాణా కోసం ప్రత్యేక మార్గాలు ఉండేలా నిబంధనలు రూపొందించాలని, ఆక్సిజన్‌ సరఫరా వాహనాలను కూడా అంబులెన్సుల్లాగే పరిగణనించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

    కొన్ని అత్యవసర రంగాలకు తప్ప, పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్‌ సరఫరాను నిషేధిస్తూ, ఈ నెల 18వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆదేశం వెలువరించింది. వైద్య ఆక్సిజన్‌ పెంపును ఈ ఆదేశం గణనీయంగా మెరుగుపరుస్తుంది. పారిశ్రామిక ఆక్సిజన్ వినియోగాన్ని మరింత తగ్గించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల వైద్య చికిత్సలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది.

    జిల్లాల్లో వివిధ రకాల ఆక్సిజన్‌లను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు, వాటి స్థాపన సామర్థ్యంతో ఒక జాబితా రూపొందించేలా కలెక్టర్లు లేదా ఉప కమిషనర్లను ఆదేశించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. మూతబడిన సంస్థలను తిరిగి తెరిపించే చర్యలు కూడా తీసుకోవాలని సూచించింది. సాధారణ మార్గాల ద్వారా రవాణాతోపాటు, జిల్లా స్థాయుల్లోనూ వైద్య ఆక్సిజన్ సిద్ధంగా ఉండేలా ఈ చర్యలు భరోసానిస్తాయి.

    ఆమోదించిన కేటాయింపు ప్రణాళిక ప్రకారం దేశవ్యాప్తంగా వైద్య ఆక్సిజన్‌ సరఫరాను కేంద్ర హోం శాఖ కల్పిస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్‌ చేరిన తర్వాత ఖాళీ అయిన ట్యాంకర్లను జాప్యం లేకుండా తిరిగి ఉత్పత్తి ప్రాంతాలకు చేర్చేందుకు వైమానిక దళం రంగంలోకి దిగింది. ఆక్సిజన్ పంపిణీకి అదనపు ట్యాంకర్లను అందుబాటులో ఉంచేందుకు, సింగపూర్‌, యూఏఈ వంటి దేశాల నుంచి అధిక సామర్థ్యంగల ట్యాంకర్లను వైమానిక దళ రవాణా విమానాల ద్వారా మంత్రిత్వ శాఖ తెప్పిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లున్న ప్రత్యేక రైళ్లను రైల్వే మంత్రిత్వ శాఖ మరింత వేగంగా నడుపుతోంది.

    వైద్య ఆక్సిజన్‌ను సమర్థంగా వినియోగించేలా చూసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. వైద్య ఆక్సిజన్, అత్యవసర మందుల వృథా జరగకుండా క్రమం తప్పకుండా మదింపు చేస్తున్నాయి.

***



(Release ID: 1713678) Visitor Counter : 137