జల శక్తి మంత్రిత్వ శాఖ
వచ్చే మార్చికల్లా 65వేల ఇళ్లకు నీటి కుళాయిల ఏర్పాటు
జలజీవన్ మిషన్ కింద అరుణాచల్ లక్ష్యం 2023కల్లా ‘ప్రతి ఇంటికీ నీరు’ అందించే సంకల్పం
రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక సమర్పణ
Posted On:
21 APR 2021 1:24PM by PIB Hyderabad
జలజీవన్ మిషన్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు మంచినీటి కుళాయిల ఏర్పాటుకు సంబంధించి వార్షిక కార్యాచరణ ప్రణాళికను అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో సమర్పించింది. 2021-22వ సంవత్సరానికి సంబంధించి సంతృప్తి స్థాయిలో ఈ ప్రణాళకను సమర్పించారు. 2023వ సంవత్సరానికల్లా ‘ప్రతి ఇంటికీ నీరు’ అన్న లక్ష్యాన్ని సాధించేందుకు తాము చిత్తశుద్ధితో కృషిచేస్తున్నట్టు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తన ప్రణాళికలో మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 2.17లక్షల ఇళ్లు ఉండగా, వాటిలో లక్ష ఇళ్లకు అంటే, 47శాతం ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు ఉన్నాయి. పర్వతమయమైన ఈ రాష్ట్రంలో 2020-21వ సంవత్సరంలో దాదాపు 65వేల ఇళ్లకు కొత్తగా నీటి కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ నీరు అన్న లక్ష్యాన్ని 2021-22వ సంవత్సరంలో 3 జిల్లాలకు, 18 సమితులకు, 1,825 గ్రామాలకు వర్తింప జేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అంటే, ఈ ప్రాంతంలో వందశాతం ఇళ్లకు నీటిసరఫరా అందజేసినట్టవుతుంది. ఇంకా 2021-22 సంవత్సరంలో కూడా 65వేల ఇళ్లకు నీటి కుళాయిలతో మంచినీటిని సరఫరా చేయాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది.
కాగా, ఇళ్లకు పైపులద్వారా నీటి సరఫరా విషయంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రాబల్యం ఉన్న ఆవాసాలకు, ఆశావహ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికీ పైపుల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని ఒక ప్రధాన పథకంగా చేపట్టింది. నీటి సరఫరాకు సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 345కోట్ల కేంద్ర నిధులు ఈ రాష్ట్రానికి విడుదలయ్యాయి. ఇక జలజీవన్ మిషన్ కింద 2021-22లో రూ. 600కోట్లు అందనున్నాయి. నీటి సరఫరా పథకాల అమలులో పనితీరు మెరగుదులకు గుర్తింపుగా గత ఏడాది ఈ రాష్ట్రానికి ప్రోత్సాహక గ్రాంట్ విడుదలైంది. దీనితో ఇతర వనరుల నిధులను కూడా నీటి సరఫరా పనులకోసం సమర్థంగా వినియోగించుకునేందుకు గల అవకాశాలను అన్వేషించాలని మంత్రిత్వ శాఖ అధికారులు రాష్ట్రానికి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ లోని 86శాతం ఆరోగ్య రక్షణ కేంద్రాలకు, 79శాతం పాఠశాలలకు, 60శాతం ఆశ్రమశాలలకు, 57శాతం అంగన్ వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా మంచినీటి సరఫరా ఏర్పాటైంది. ఇక 2021-22వ సంవత్సరంలో ఈ సంస్థలన్నింటికీ వందశాతం నీటి సరఫరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇక జలజీవన్ మిషన్ పనులను నిరాటంకంగా అమలయ్యేలా చూసేందుకు, పనుల నిర్వహణలో అంతరాలను పూడ్చేందుకు వీలుగా రాష్ట్ర స్థాయి, జిల్లాల, డివిజన్ల స్థాయిలో నిపుణుల సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వందశాతం నీటి సరఫరాను వర్తింపజేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జలజీవన్ మిషన్ కింద రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో నీటి నాణ్యతను పరీక్షించే పరిశోధనాశాలలు ప్రారంభించారు. నామమాత్రపు రుసుం చెల్లింపుతో సాధారణ ప్రజలు కూడా నీటి నాణ్యతను పరీక్షించుకునే సదుపాయంతో వీటిని ఏర్పాటు చేశారు. నీటి నాణ్యతపై నిఘాతో వ్యవహరించేలా ప్రజాసంఘాలకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ ఇందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సకాలంలో పరీక్షల కిట్లు సరఫరా చేయడం, ప్రజా సంఘాల్లో ప్రాతినిధ్యం కోసం ప్రతి గ్రామనుంచి కనీసం ఐదుగురు మహిళలను గుర్తించడం, క్షేత్రస్థాయి నీటి నాణ్యతా పరీక్షల కిట్లను, పరికరాలను వినియోగించడంలో, పరీక్షా ఫలితాలపై నివేదిక ఇవ్వడంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలకు ప్రణాళిక వేసుకున్నారు. 2020-21వ సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నీటి వనరుల వద్ద 83.4శాతం రసాయన పరీక్షలను, నీటి సరఫరా జరిగే ప్రాంతాల్లో 91.8శాతం పరీక్షలు నిర్వహించింది. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకైతే వందశాతం రసాయన పరీక్షలు, బాక్టీరియా సంబంధ పరీక్షలు నిర్వహించారు. ప్రజలు కూడా నామమాత్రపు చార్జీలు చెల్లించి నీటి నాణ్యతను పరీక్షించుకునే వెసులుబాటును కల్పించేందుకు వీలుగా నీటి పరీక్షల లేబరేటరీలకు ఎన్.ఎ.బి.ఎల్. గుర్తింపును పొందవలసిందిగా రాష్ట్రానికి కేంద్రం సూచించింది.
తాగు నీటి వనరులను బలోపేతం చేయడం, మురుగునీటి నిర్వహణ, పునర్వినియోగం, గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణ తదితర అంశాలను కూడా అరుణాచల్ ప్రదేశ్ తన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది. నీటి సరఫరాకు సంబందించి రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహణా విభాగం సిబ్బందికి, గ్రామ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీ, పానీ సమితి సభ్యులకు పటిష్టమైన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో దాదాపు 5వేల మందికి మేస్త్రీలుగా, ప్లంబర్లుగా, ఎలెక్ట్రీషియన్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇలా శిక్షణ పొందిన వారిని నీటి సరఫరా మౌలిక సదుపాయాల నిర్మాణానికి, వాటి నిర్వహణకు వినియోగించుకుంటారు.
జలజీవన్ మిషన్ పథకం కింద 2021-22లో బడ్జెట్లో కేటాయించిన రూ. 50,011 కోట్ల కు అదనంగా, గ్రామీణ స్థానిక సంస్థలకు నీరు, పారిశుద్ధ్యానికి సంబంధించి15వ ఆర్థిక సంఘంతో అనుబంధించిన రూ. 26,940కోట్ల నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు రాష్ట్రంనుంచి మ్యాచింగ్ వాటా నిధులు, రాష్ట్ర ప్రాజెక్టుల నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో మొత్తం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాకోసం 2021-22లో లక్షకోట్ల రూపాయలకు పైగా నిధులను ఖర్చుపెట్టాలని సంకల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంతటి భారీ స్థాయి పెట్టుబడులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మంచి ఊపందుకుంటుంది..
జలజీవన్ మిషన్ కింద గ్రామ స్థాయిలో అందుబాటులో ఉన్న ఇతర వనరుల నిధులన్నింటినీ కూడగట్టేందుకు కృషి జరుగుతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత మిషన్ నిధులు, పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు, కాంపా నిధులు, స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు తదితర నిధులను కూడగట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థలు దీర్ఘకాలం మనగలిగేలా, తద్వారా గ్రామాలకు తాగునీటి రక్షణ కల్పించేలా గ్రామ సంఘాలకు, గ్రామ పంచాయతీలకు, వినియోగ సంఘాలకు తగిన ప్రమేయం కల్పించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇందుకోసం నీటి సరఫరా ప్రణాళిక, అమలు, నిర్వహణలలో ఆయా గ్రూపులకు తగిన పాత్ర కల్పించాలని సూచించారు. జలజీవన్ మిషన్ పథకం, లక్ష్యాలను గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు అధునాతన ఎలెక్ట్రానిక్ పద్ధతుల్లో ప్రచారం ప్రారంభించాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది.
ఇందులో భాగగా జలజీవన్ మిషన్ ప్రతి ఏడాది రాష్ట్రాల అధికారులతో చర్చించి, నీటి సరఫరా పనుల అంచనాపై కసరత్తు చేస్తుంది. తద్వారా వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తుంది. ఈ ప్రతిపాదిత ప్రణాళికను తాగునీరు, పారిశుద్ధ్యం శాఖ కార్యదర్శి అధ్యక్షతలోని జాతీయ కమిటీ మధింపు చేస్తుంది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖల విభాగాల సభ్యులకు, నీతీ ఆయోగ్ సభ్యులకు ఈ జాతీయ కమిటీలో ప్రాతినిధ్యం ఉంటుంది. వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఖరారైన అనంతరం ఎప్పకప్పుడు పనుల ప్రగతి, జరిగిన ఖర్చు వంటి అంశాల ప్రాతిపదికన నిధులను విడుదల చేస్తారు. సాంకేతిక నిపుణుల బృందం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిధులు అందిస్తారు. తద్వారా జలజీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ నీరు అందించాలన్న లక్ష్యాన్ని సాధించే పనులను సజావుగా అమలు చేసేందుకు ఈ నిపుణుల బృందం తగిన మార్గదర్శకత్వం వహిస్తుంది.
***
(Release ID: 1713301)
Visitor Counter : 163