గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
‘ఆరోగ్యకర ఆహార... అందరికీ రవాణా నగరాలు’ పేరిట పోటీలకు శ్రీకారం
సరైన ఆహార పద్ధతులు-అలలవాట్ల వాతావరణం
సృష్టి లక్ష్యంగా ‘ఆరోగ్యకర ఆహార నగరాల’ పోటీ;
తొలిదశ పోటీల ముగింపునాటికి 11 నగరాల ఎంపిక;
సురక్షితం.. అందుబాటు.. సౌకర్యం.. విశ్వసనీయ
ప్రజా రవాణా లక్ష్యంగా ‘అందరికీ రవాణా నగరాల’ పోటీ
Posted On:
15 APR 2021 2:40PM by PIB Hyderabad
కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఇవాళ “ఆరోగ్యకర ఆహార... అందరికీ రవాణా నగరాలు” పేరిట ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే రెండు పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ దుర్గాశంకర్ మిశ్రా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాగా, సంయుక్త కార్యదర్శి శ్రీ కునాల్ కుమార్, ‘ఆహార భద్రత-నాణ్యత ప్రమాణాల సంస్థ’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ అరుణ్ సింఘాల్ సహా ఇతర కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు ప్రత్యక్ష సాదృశ మాధ్యమంద్వారా ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆరోగ్యకర ఆహార నగరాలు’ పోటీగురించి శ్రీ పూరి మాట్లాడుతూ- “ఆరోగ్యకర నగరాల పోటీ ప్రారంభించడం ద్వారా అత్యాధునిక నగరాలను ఆరోగ్యకర ఆహారపు అలవాట్ల వైపు నడిపించే కృషి ఫలించనుండటం ఎంతో గర్వించాల్సిన విషయం. పట్టణ ప్రజల్లో సరైన ఆహార ఎంపికకు అలవాటు పడేలా చేయడంద్వారా ఆరోగ్యకర, ఆనందభరిత దేశ నిర్మాణానికి ఈ ఉద్యమం దోహదపడుతుంది. అత్యాధునిక నగరాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సాగిన విశేష కృషికి ఇది మరింత తోడ్పాటునిస్తుంది” అని ఆయన చెప్పారు. ఇక ‘అందరికీ రవాణా నగరాలు’ పోటీని ప్రారంభిస్తూ- కోవిడ్-19 ఫలితంగా తీవ్రస్థాయిలో దెబ్బతిన్న రంగాల్లో రవాణా రంగం కూడా ఒకటి కావడంతో ప్రపంచమే స్తంభించిందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రయాణ సంక్షోభం నుంచి నగరాలు బయటపడటంలో ‘అందరికీ రవాణా డిజిటల్ ఆవిష్కరణల పోటీ’ సహాయపడగలదని ఆయన చెప్పారు.
ఆహార సంబంధిత సమస్యలకు అత్యాధునిక పరిష్కారాల అమలుసహా సంస్థాగత, శారీరక, సామాజిక-ఆర్థిక మౌలిక సదుపాయాల మద్దతుతో ఆరోగ్యకర, సురక్షిత, సుస్థిర ఆహార వాతావరణ కల్పనకు తోడ్పడగల ప్రణాళిక రూపకల్పనలోనూ అత్యాధునిక నగరాలను ప్రోత్సహించడం ఈ ‘ఆరోగ్యకర ఆహార నగరాల’ పోటీ లక్ష్యం. అలాగే ప్రతి ఒక్కరికీ ‘సురక్షిత.. సరసమైన.. సౌకర్యవంతమైన.. విశ్వసనీయ’ ప్రజా రవాణా లభ్యత దిశగా డిజిటల్ ఆవిష్కరణలద్వారా పరిష్కారాలను చూపడమే ‘డిజిటల్ ఆవిష్కరణల ద్వారా అందరికీ రవాణాపై పోటీ’ లక్ష్యమని తెలిపారు. శ్రీ దుర్గాశంకర్ మిశ్రా మాట్లాడుతూ- ‘డిజిటల్ ఆవిష్కరణల ద్వారా అందరికీ రవాణాపై పోటీ’ని ప్రారంభించడం గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఎంతో సంతోషం కలిగిస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, అంకుర సంస్థలు పట్టణ ప్రాంతాల్లో రవాణారంగం డిజిటల్ దిశగా పరివర్తన చెందడంలో ఈ పోటీ మద్దతిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యకర, సురక్షిత, పోషకాహారం అందించడం కోసం నగర ప్రణాళిక-అభివృద్ధి విభాగాలతో ఆహార వ్యవస్థల అనుసంధానంలో భారతదేశం మార్గదర్శక పాత్ర పోషించడానికి ‘ఆరోగ్యకర ఆహార నగరాల’ పోటీ అవకాశం కల్పిస్తుందన్నారు.
ఆరోగ్యకర ఆహార నగరాల పోటీ
సురక్షిత, ఆరోగ్యకర ఆహారాన్ని నిత్యం తీసుకోవడంపై దేశ ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని భారత ఆహార భద్రత-నాణ్యత ప్రమాణాల సంస్థ చేపట్టిన ‘సమతుల ఆహార భారతం’ ఉద్యమం ఇప్పటికే సత్ఫలితాలు సాధించింది. ఈ నేపథ్యంలో నేడు మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’తో సంయుక్తంగా ‘ఆరోగ్యకర ఆహార నగరాల’ పోటీ ప్రారంభించబడింది. సమతుల ఆహారం తీసుకోవడంపై పట్టణ ప్రజల్లో ప్రేరణ తేవడంద్వారా ఈ పోటీ వారి జీవితాల్లో సానుకూల ప్రభావం చూపుతుందని ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ ముఖ్య కార్వనిర్వహణాధికారి శ్రీ అరుణ్ సింఘాల్ చెప్పారు. ఆహారభద్రత, పరిశుభ్రత, పోషకాహారంపై సామాజిక-ప్రవర్తనాత్మక మార్పు తేవడంలో ఈ పోటీ ఒక వినూత్న ఉపకరణంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
‘సమతుల ఆహార భారతం’ ఉద్యమం కింద వివిధ కార్యక్రమాలు చేపట్టడం, ముమ్మరం చేయడంలో ఆయా నగరాలు చేస్తున్న కృషిని గుర్తించడం కోసం ఆరోగ్యకర ఆహార నగరాల పోటీ’ రూపొందించబడింది. ఇది అత్యాధునిక నగరాల భాగస్వామ్యంతో చేపట్టిన ఒక విశిష్టమైన పోటీ. సరైన ఆహార తయారీ పద్ధతులు, అలవాట్లతో కూడిన వాతావరణాన్ని సృష్టించడంతోపాటు ఆహార భద్రత, నియంత్రణ పర్యావరణ వ్యవస్థలను ఇది బలోపేతం చేస్తుంది. అలాగే వినియోగదారులలో అవగాహన పెంచి, ప్రధాన భారతీయ నగరాల్లో మెరుగైన ఆహార ఎంపిక దిశగా వారిని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఇతర నగరాలు వాటిని అనుసరించేలా ప్రేరణనిస్తుంది. అన్ని అత్యాధునిక నగరాలతోపాటు ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాలు సహా 5 లక్షల జనాభా దాటిన నగరాలు కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఈ పోటీ తొలిదశ ముగిసే సమయానికి అత్యుత్తమంగా నిలిచిన 11 నగరాలు ఎంపిక చేసి, అవి రూపొందించిన ప్రణాళికలను మరింత లోతుగా అమలు చేయడం కోసం గడువు పొడిగించబడుతుంది. పోటీకి సంబంధించిన వివరాలను https://eatrightindia.gov.in/eatsmartcity) వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
అందరికీ ప్రజా రవాణా పోటీ
సామాజిక శ్రేయస్సు, అనధికార రవాణా సేవల సంపూర్ణ పునర్నవీకరణ, వినియోగదారుల అనుభవం మెరుగు దిశగా డిజిటల్ ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ ప్రజా రవాణాలో పెట్టుబడులపై భారతీయ నగరాలకు ఇదొక సువర్ణావకాశం. ‘అందరికీ ప్రజారవాణా పోటీ’ని కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐటీడీపీ సహకారంతో ప్రారంభించింది. పౌరులందరి అవసరాలు తీర్చేవిధంగా ప్రజా రవాణాను మెరుగుపరిచే పరిష్కారాల అన్వేషణలో నగరాలు, పౌర సమాజాలు, అంకుర సంస్థలను ఒకే వేదికపైకి తేవడమే ఈ పోటీ లక్ష్యం.
ఈ పోటీలో పౌరులదే కీలక పాత్ర... రవాణాకు సంబంధించి పరిష్కరాన్వేషణకు వీలైన సమస్యలను వారు చక్కగా నిర్వచించగలరు. దాంతోపాటు తమ అవసరాలకు తగినట్లుగా పరిష్కారాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలకు, నగరపాలికలకు తోడ్పడగలరు. ఈ పోటీ తొలిదశలో ప్రధానంగా డిజిటల్ ఆవిష్కరణలపై దృష్టి సారించబడుతుంది. వివిధ పరిష్కారాలను రూపొందించి పరీక్షించడంలో నగరాలు, అంకుర సంస్థలకు మార్గనిర్దేశం చేయబడుతుంది. ఈ అనుభవాల ఆధారంగా వాటి స్థాయిని పెంచి ప్రజా రవాణాపై ప్రజల్లో నమ్మకాన్ని ఇనుమడింపజేసి, ఆ వాహనాల్లో ప్రయాణించడాన్ని ముమ్మరం చేస్తుంది. ఈ పరిష్కారాలు సురక్షిత.. సౌకర్యవంతమైన... అందుబాటు ధరతో కూడిన అధికారిక, అనధికారిక ప్రజా రవాణాను అందరికీ చేరువ చేస్తాయి. అన్ని అత్యాధునిక నగరాలతోపాటు ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాలు సహా 5 లక్షల జనాభా దాటిన నగరాలు కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు.
మూడు దశల్లో పోటీ నిర్వహణ
‘డిజిటల్ ఆవిష్కరణల ద్వారా అందరికీ రవాణాపై పోటీ’లో మూడు దశలుంటాయి:
- 1వ దశ: సమస్యల గుర్తింపు: పౌరులు, ప్రజా రవాణారంగం పదేపదే ఎదుర్కొంటున్న కీలక సమస్యలను స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో నగరాలు గుర్తిస్తాయి.
- 2వ దశ: పరిష్కారాల సృష్టి: నగరాలు, స్వచ్ఛంద సంస్థల అందించే సమాచారం ఆధారంగా ప్రజా రవాణా మెరుగుకు అంకుర సంస్థలు నమూనా పరిష్కారాలను రూపొందిస్తాయి.
- 3వ దశ: ప్రయోగాత్మక పరీక్ష: భారీ స్థాయిలో ప్రయోగ పరీక్షలు నిర్వహణలో అంకుర సంస్థలను నగరాలు నియోగిస్తాయి. తద్వారా పౌరులనుంచి అందే సమాచారం ఆధారంగా పరిష్కారాలను మరింత మెరుగుపరుస్తాయి.
ఈ పోటీలో భాగంగా నగరాలు తమ పరిధిలో ‘అందరికీ రవాణా కార్యాచరణ బృందాల’ (టీటీఎఫ్)ను ఏర్పాటు చేస్తాయి. వీటిలో కీలక భాగస్వాములు... ఉదా॥ పురపాలక సంస్థ, స్మార్ట్ సిటీ ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్పీవీ), సిటీబస్సుల నిర్వాహకులు, నగర-శివారు రైళ్లు, ప్రాంతీయ రవాణా కార్యాలయం, ట్రాఫిక్ పోలీసులు, రోడ్ల నిర్వహణ సంస్థలు, మధ్యంతర ప్రజా రవాణా (ఐపీటీ) సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సుస్థిర రవాణా రంగంలో పనిచేస్తున్న విద్యాసంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మరిన్ని వివరాల కోసం www.transport4all.inను చూడవచ్చు,
అత్యాధునిక నగరాల కార్యక్రమంపై తాజా సమాచారం
అత్యాధునిక నగరాల కార్యక్రమం (ఎస్‌సీఎం) గడచిన ఏడాది కాలంలో వివిధ కార్యకలాపాల అమలును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పథకాల సత్వరం ప్రారంభం-పూర్తిపై ప్రధానంగా దృష్టా సారించింది. అత్యాధునిక నగరాల ప్రణాళికలకు ఆమోదం తెలిపిన మేరకు అంగీకరించిన మొత్తం రూ.2,05,018 కోట్ల పెట్టుబడులలో 2021 ఏప్రిల్ 9నాటికి రూ.1,73,600 కోట్ల (85 శాతం) విలువైన 5,600 పథకాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. తదనుగుణంగా రూ.1,40,500 కోట్ల (69 శాతం) విలువైన 4,900 పథకాలకు సంబంధించి పనుల ప్రారంభానికి అనుమతి ఇవ్వబడింది. అలాగే రూ.40,263 కోట్ల (20 శాతం) విలువైన 2,426 పథకాలు ఇప్పటికే పూర్తి కావడంతోపాటు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు గడచిన 30 నెలల్లో టెండర్ల ప్రక్రియ పరంగా 247 శాతం, పథకాల ప్రారంభం/పూర్తిలో 353 శాతం, పథకాలు సంపూర్ణం కావడంలో 663 శాతం వంతున వృద్ధి నమోదైంది.
పట్టణ స్థానిక సంస్థలలో తాజా పట్టభద్రుల నైపుణ్యాభివృద్ధి అవసరాలు-అవకాశాలను బేరీజు వేయడం లక్ష్యంగా ‘ది అర్బన్ లెర్నింగ్ అండ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం’ (టులిప్) కొనసాగుతోంది. మొత్తం 280కి పైగా పట్టణ స్థానిక సంస్థలు 15,823 ఇంటర్న్‌షిప్‌లను మంజూరు చేయగా, ఇప్పటిదాకా 376 మంది విద్యార్థులు శిక్షణ పూర్తిచేశారు. మరో 919 మంది విద్యార్థులు కొనసాగుతున్నారు. కాగా, 2022నాటికి 100 అత్యాధునిక నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను (ఐసీసీసీ) ప్రారంభించాలని ‘ఎస్సీఎం’ లక్ష్యంగా పెట్టుకుంది. అత్యాధునిక నగరాల కార్యక్రమం పూర్తయ్యేనాటికి మరో 500 నగరాల్లో “డేటాస్మార్ట్ సిటీస్” వ్యూహాన్ని అమలును ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగా 500 నగరాల్లో ‘ఓపెన్ డేటా ప్లాట్‌ఫామ్/ఇండియా అర్బన్ డేటా ఎక్స్ఛేంజి (ఐయూడీఎక్స్) ఉనికిలోకి రానుంది. ఆయా నగరాలు తమ డేటా సంసిద్ధతపై స్వీయ అంచనాలు రూపొందించుకునేలా అత్యాధునిక నగరాల్లో ప్రస్తుతం ‘డేటాస్మార్ట్ సిటీస్’ వ్యూహంతో అనుసంధానించిన ‘డేటా మెచ్యూరిటీ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్’ రెండో పునశ్చరణ కార్యక్రమం కొనసాగుతోంది.
***
(Release ID: 1712188)
Visitor Counter : 199