సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై 1968నాటి అరుదైన లఘుచిత్రాన్ని సేకరించిన ఎన్‌ఎఫ్‌ఏఐ
Posted On:
13 APR 2021 5:36PM by PIB Hyderabad
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై 1968లో రూపొందించిన అరుదైన లఘుచిత్రాన్ని భారత జాతీయ చలనచిత్ర భాండాగారం (ఎన్‌ఎఫ్‌ఏఐ) కొనుగోలు చేసింది. ఈ చిత్రాన్ని 1968 జూలైలో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రచార విభాగం సంచాలకులు “మహాపురుష్ డాక్టర్ అంబేడ్కర్' పేరిట నిర్మించారు. ‘వాట్కర్ ప్రొడక్షన్స్’ పతాకంపై నామ్‌దేవ్ వాట్కర్ దర్శకత్వం వహించిన ఈ 18 నిమిషాల లఘు చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దత్తా దావజేకర్ సంగీతం సమకూర్చారు. అలాగే ప్రసిద్ధ చలనచిత్ర నటుడు డేవిడ్ అబ్రహామ్ ఈ చిత్రానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు-దర్శకుడైన నామ్‌దేవ్ వాట్కర్ 1957లో సులోచన నటించిన ‘అహెర్’ 1956లో హన్సా వాడ్కర్ నటించిన ‘ముల్గా’వంటి చిత్రాలకు రచనతోపాటు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. అంతకుముందు 1952లో పి.ఎల్.దేశ్‌పాండేతో సంయుక్తంగా రామ్ గబలే చిత్రం ‘ఘర్ధానీ’కి కథారచన చేశారు.
“భారత రాజ్యాంగ నిర్మాణ వాస్తుశిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 130 జయంతిని ఏప్రిల్ 14న నిర్వహించనున్న నేపథ్యంలో ఆయనపై రూపొందిన లఘుచిత్రం సరైన సమయంలో లభ్యం కావడం హర్షదాయకం. డాక్టర్ అంబేడ్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ లఘుచిత్రం కల్పిత కథ రూపంలో తెలియజేస్తుంది. దీంతోపాటు ఆయన తదుపరి సంవత్సరాల జీవిత విశేషాల ప్రత్యక్ష దృశ్యాలు కూడా దీనితోపాటు లభించాయి” అని ‘ఎన్‌ఎఫ్‌ఏఐ’ సంచాలకులు ప్రకాష్ మాగ్దం పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంలో డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధమత స్వీకారం, నేపాల్ పర్యటనసహా ముంబైలోని దాదర్ చౌపటీలో ఆయన అంతిమయాత్ర ఊరేగింపు సన్నిహిత దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రానికి మధుకర్ ఖంకర్ ఛాయాగ్రాహకుడు కాగా, జి.జి.పాటిల్ ఎడిటర్‌గా పనిచేశారు.
“ఈ చిత్రం వాస్తవంగా 35 మిల్లీమీటర్ల ఫిల్మ్‌తో నిర్మించబడినా ప్రస్తుతం లభ్యమైన నకలు 16 మి.మీ. విధానంలోనిది కావడం గమనార్హం. ఇది బహుశా గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉద్దేశించబడినది కావచ్చు. ఈ కాపీ పరిస్థితి ఓ మోస్తరుగా ఉన్నందున త్వరలో దీని డిజటలీకరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. తద్వారా ఇది ప్రజలకు సరైన రీతిలో అందుబాటులోకి వస్తుంది” అని ప్రకాష్ మాగ్దమ్ చెప్పారు. ఇక “వ్యక్తిగతంగా ఇటువంటి పురాతన కళాఖండాలు సేకరించే వ్యక్తులు, పంపిణీదారులుసహా ఇతరులంతా ముందుకు వచ్చి చలనచిత్రాలు, దృశ్య ఖండికలను భద్రపరచడం కోసం ‘ఎన్‌ఎఫ్‌ఏఐ’కి అందుజేయాల్సిందిగా మేం విజ్ఞప్తి చేస్తున్నాం” అని ఆయన అన్నారు.
***
(Release ID: 1711588)
Visitor Counter : 118