జల శక్తి మంత్రిత్వ శాఖ
జలజీవన్ మిషన్ కింద జమ్ము కాశ్మీర్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక!
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర కమిటీకి సమర్పణ
2022 సెప్టెంబరులోగా పల్లెల్లోని ఇళ్లన్నింటికీ వర్తింపజేయడమే లక్ష్యం
Posted On:
12 APR 2021 5:28PM by PIB Hyderabad
జల జీవన్ మిషన్ (జె.జె.ఎం.) పథకం కింద రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను జమ్మూ కాశ్మీర్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమర్పించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన గల జాతీయ కమిటీకి జమ్ము కాశ్మీర్ ఈ ప్రణాళికను సమర్పించింది. ఇలా వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు రూపొందించిన ప్రతిపాదిత వార్షిక కార్యాచరణ ప్రణాళికలను జాతీయ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వాటిని ఖరారు చేస్తుంది. ఆ తరువాత ఆయా ప్రణాళికల భౌతిక, ఆర్థిక పురోగతి, క్షేత్రస్థాయి సందర్శనల ప్రాతిపదికన వాటికి విడతల వారీగా నిధులు విడుదల అవుతాయి. జలజీవన్ మిషన్ కార్యక్రమ లక్ష్యాన్ని సాధించేలా, వార్షిక కార్యాచరణ ప్రణాళిక పక్కాగా అమలు జరిగేలా చూసేందుకు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తారు.
జలజీవన్ మిషన్ కింద ‘ప్రతి ఇంటికీ నీరు’ అందించాల్సిన జిల్లాలుగా శ్రీనగర్, గండర్ బాల్ జిల్లాలను జమ్ము కాశ్మీర్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు వందశాతం నీటి కుళాయిల కనెక్షన్లు అందించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్ లోని గ్రామీణ ప్రాంతాల్లో 18.16లక్షల ఇళ్లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి దాదాపు పది లక్షల ఇళ్లకు మంచి నీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. 2021-22వ సంవత్సరంలో 4.9లక్షల నీటి కుళాయిల కనెక్షన్లు కల్పించాలని జమ్ము కాశ్మీర్ సంకల్పించింది. మరో 9 జిల్లాలను కూడా ‘ప్రతి ఇంటికీ నీరు’ కార్యక్రమ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. అంటే,.జమ్ము కాశ్మీర్. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ మంచి నీటి కుళాయిల కనెక్షన్ అందుతుందన్నమాట.
జలజీవన్ మిషన్ పథకం కింద వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి, అంటే జాతీయ స్థాయిలో నిర్దేశించిన గడువుకు ముందుగానే, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీటిని సరఫరా చేయనున్నట్టు జమ్ము కాశ్మీర్ తన ప్రణాళిక ద్వారా జాతీయ కమిటీకి హామీ ఇచ్చింది. నీటి సరఫరా పథకం అమలులో తాము సాధించిన ప్రగతిని, పనుల నిర్వహణకు సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను జమ్ము కాశ్మీర్ అధికారులు ఈ నాటి సమావేశంలో వివరించారు.
వేసవి కాలంలో నీటి నాణ్యతను రక్షించడం ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో నీటి పరీక్షల నిర్వహణకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు జమ్ము కాశ్మీర్ అధికారులకు సూచించారు. నీటి పరీక్షలకు సంబంధించి ప్రస్తుత సంవత్సరంలో 20 పరిశోధన శాలలకు ఎన్.ఎ.బి.ఎల్. గుర్తింపు తెచ్చుకోవాలని జమ్ము కాశ్మీర్ పరిపాలనా యంత్రాంగం సంకల్పించింది. నీటి నాణ్యతా లోపాలను సరిదిద్దేలా చూసేందుకు వివిధ సంఘాల స్థాయిలో క్షేత్రస్థాయి పరీక్షా పరికరాలు, హెచ్.టుఎస్. వయల్స్ ఏర్పాటు చేయనున్నారు. నీటి నాణ్యత సరిగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరా సేవలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, వాణ్యతా పరీక్షలు జరిపే లేబరేటరీల్లో సదుపాయాలను గరిష్టస్థాయిలో వినియోగించుకోవాలని జాతీయ కమిటీ జమ్ము కాశ్మీర్ అధికారులకు సూచించింది.
జలజీవన్ మిషన్ పథకం ప్రకారం జిల్లాలు, రాష్ట్రాల స్థాయిలో ఉన్న నీటి నాణ్యతా పరీక్షల లేబరేటరీల్లోకి సాధారణ ప్రజలు కూడా అనుమతిస్తారు. సాధారణ ప్రజలు కూడా నామమాత్రపు ధరలపై నీటి నాణ్యతను పరీక్షించుకోవడానికి వీలు కల్పిస్తారు. నీటి నాణ్యతపై నిఘాతో వ్యవహరించేలా ప్రజా సంఘాలకు కూడా తగిన ప్రోత్సాహం అందిస్తారు. ఇందుకు తగిన సాధికారత కల్పించేందుకు ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ కూడా సదుపాయం కల్పిస్తుంది. ఇందుకోసం ఒక కార్యాచరణ ప్రణాళికను చేపట్టారు. సకాలంలో నీటి నాణ్యతా పరీక్షా కిట్లను సేకరించడం, వివిధ సంఘాలకు వాటిని సరఫరా చేయడం, ఈ కమిటీలకోసం ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు మహిళలను గుర్తించడం, క్షేత్రస్థాయి పరీక్షా పరికరాల వినియోగంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం తదితర అంశాలను పొందుపరిచేలా ఈ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు.
వందశాతం ఇళ్లకు కుళాయిల ద్వారా మంచినీటిని సరఫరా చేసే లక్ష్యం పూర్తయిన రెండు జిల్లాల్లోనూ సెన్సార్ల ప్రాతిపదికన నీటి పరిమాణం లెక్కించి పర్యవేక్షించే వ్యవస్థను చేపట్టాలని కూడా జమ్ము కాశ్మీర్ పరిపాలనా యంత్రాగం నిర్ణయించింది. ఈ జిల్లాల్లో నీటి సరఫరా వ్యవస్థలను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించి, అందుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషణ కోసం వెంటనే నమోదు చేస్తారు. ఏదైనా సమస్య ఉంటే సత్వరమే పరిష్కార చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ పర్యవేక్షణ నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా మంచినీరు అందించేందుకు జాతీయ జలజీవన్ మిషన్, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న కృషి,.. కోవిడ్ మహమ్మారి వైరస్ వ్యాప్తి సమయంలో ప్రజాజీవనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు కచ్చితంగా దోహదపడుతుంది. మహిళలకు నీటిని మోసుకువచ్చే ప్రయాస తప్పుతుంది. వారు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు ఉపయోగపడుతుంది.
జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) అనేది జాతీయ ప్రాధాన్యం కలిగిన కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికీ 2024నాటికి పైపుల ద్వారా నీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. 2021-22వ సంవత్సరపు బడ్జెట్లో ఈ పథకానికి రూ. 50వేల కోట్ల మేర నిధులను కేటాయించారు. దీనికి తోడుగా, గ్రామీణ స్థానిక సంస్థలకు, పంచాయతీ రాజ్ సంస్థలకు 15వ ఆర్థిక సంఘం కింద నీరు, పారిశుద్ధ్య సదుపాయాలకోసం కేటాయించిన రూ. 26,940 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక,.. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు కుళాయిల ద్వారా నీటి సరఫరా కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్షకోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టాలని సంకల్పించారు. ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో వస్తు తయారీ రంగం వృద్ధి చెందడానికి, ఉపాధి అవకాశాలు పెరగడానికి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావడానికి అవకాశం ఉంటుంది.
****
(Release ID: 1711505)
Visitor Counter : 155