ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

“కోవిడ్ పై పోరులో కొన్ని రాష్ట్రాల వైఫల్యం”


“దృష్టిని మరల్చేందుకు, ప్రజాందోళన ప్రబలడానికి అవి
చేసే ప్రయత్నాలు గర్హణీయం, బాధ్యతా రాహిత్యం”
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటన

Posted On: 07 APR 2021 6:06PM by PIB Hyderabad

    కోవిడ్ మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో,. ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకులు, నాయకులు చేస్తున్న అనేక బాధ్యతారహితమైన ప్రకటనలు నా దృష్టికి వచ్చాయి. అవి నాలో వ్యాకులతను పెంచేస్తున్నాయి. ఈ ప్రకటలన్నీ ప్రజలను తప్పుదారి పట్టించి, వారిలో ఆందోళన పెంచే ఆస్కారం ఉన్నందున వాస్తవాలను నేరుగా ప్రజలముందు పెట్టవలసిన అవసరం ఏర్పడింది.

  దేశంలో కొత్తగా కోవిడ్-19 కేసుల విజృంభణ పెరుగుతున్న తరుణంలో, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు నాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేలా ప్రతిస్పందించడంలో, అందుకు దీటైన చర్యలు తీసుకోవడంలో  పలు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న వాస్తవం బాధ కలిగిస్తోంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంబంధించి గత ఏడాది కాలంలో నేర్చుకున్న పాఠాలను అమలు చేయడంలో కూడా విఫలమై పోయామన్న వాస్తవం నన్ను ఎంతగానో బాధిస్తోంది.

  ఈ నేపథ్యంలో, పద్దేనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకా వేయాలనో, లేదా వ్యాక్సినేషన్ అర్హతా వయస్సును బాగా తగ్గించాలనో కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనలు,  మరింత ఆందోళనకరంగా ఉంటున్నాయి. వ్యాక్సినేషన్ కు ఉన్న డిమాండ్, వ్యాక్సినేషన్ల సరఫరా పరిస్థితి, దానికి అనుగుణంగా టీకా అందించేందుకు చేపట్టిన వ్యూహం గురించి భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తరచుగా తెలయజేస్తూనే ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంటోంది. నిజానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి, విస్తృతంగా చర్చించిన మీదటే రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే వ్యాక్సినేషన్ వ్యూహానికి రూపకల్పన జరిగింది. అనేక నెలలుగా ఇవే అంశాలను బహిరంగంగా నమోదు చేస్తూనే ఉన్నాం.

   ఏదేమైనా, సమాజంలో వ్యాధి సులభంగా సోకే ఆస్కారం ఉన్న వారి మరణాలను తగ్గించి, మహమ్మారి వైరస్ పై సమాజం విజయం సాధించేలా చూడటమే లక్ష్యంగా టీకా కార్యక్రమం చేపట్టామని మేం పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. ఈ లక్ష్యానికి అనుగుణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశంలో ప్రారంభమైంది. ఆరోగ్య రక్షణ సిబ్బందికి, కోవిడ్ వైరస్  నియంత్రణకు ముందువరుసలో పోరాడే ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు మొట్టమొదటగా టీకా అందించాలన్న నిర్ణయం జరిగింది. ఈ కార్యక్రమం ఒక స్థాయి వరకూ పురోగమించిన అనంతరం, మిగిలిన వర్గాల ప్రజలకు కూడా వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన ప్రజలందరికీ టీకా అందించే కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రులు, తదితర సదుపాయాల ద్వారా వ్యాక్సినేషన్ తీసుకునే వారిందరికీ టీకాను ఉచితంగానే ఇస్తున్నట్టు ముందే ప్రకటించాం.

   వ్యాక్సీన్ల సరఫరా పరిమితంగా ఉన్నన్ని రోజులూ టీకాను ప్రాధాన్యతా ప్రాదిపదిన మాత్రమే అందించడం తప్ప మనకు గత్యంతరం లేదు. ప్రపంచం అంతటా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ తెలుసు.

  18 సంవత్సరాలు దాటిన వారందరికీ టీకా అందించాలని రాష్ట్రాలు కోరినపుడు, ఆరోగ్య రక్షణ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు, వయోవృద్ధులకు ఆయా రాష్ట్రాలు సంతృప్త స్థాయిలో వ్యాక్సీన్ అందించాయని భావించాల్సి వస్తుంది. అయితే, క్షేత్రస్థాయిలోని వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

 మహారాష్ట్ర కేవలం 86శాతం ఆరోగ్య కర్తలకు మాత్రమే తొలి డోస్ టీకాను అందించింది. ఢిల్లీలో ఇది 72శాతం, పంజాబ్.లో 64శాతం మాత్రమే. మరో వైపు దేశంలోని పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం 90శాతం పైగా వ్యాక్సినేషన్ జరిగింది.

 మహారాష్ట్రలో 41 శాతం ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే రెండవ డోస్ వరకూ టీకా అందింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఇది 41శాతం, 27 శాతంగా ఉంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 60శాతానికి వ్యాక్సినేషన్ జరిగింది. 

  ఇక మహారాష్ట్రలోని ఫ్రంట్ లైన్ కార్యకర్తల్లో 73 శాతానికి మాత్రమే తొలి డోసు టీకా అందింది. ఢిల్లీకి సంబందించి 71శాతం, పంజాబ్.లో 65శాతం ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు టీకా అందించారు. మరో 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇదే కేటగిరీకి చెందిన వారికి ఇప్పటికే 85శాతం మందికిపైగా వ్యాక్సినేషన్ జరిగింది.

 మహారాష్ట్రలో 41శాతం ప్రంట్ లైన్ కార్యకర్తలకు రెండవ డోన్ టీకా అందుకున్నట్టుగా  నమోదైంది. ఇదే కేటగిరీకి సంబంధించి ఢిల్లీలో 22శాతం మందికి, పంజాబ్.లో 20 శాతం మందికి మాత్రమే రెండవ డోస్ టీకా అందింది. కాగా, ఇదే కేటగిరీకి సంబంధించి 6 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే 45శాతం మందికిపైగా వ్యాక్సినేషన్ జరిగింది.  

 ఇక వయోవృద్ధుల విషయానికి వస్తే,.మహారాష్ట్రలో కేవలం 25శాతం మందికి, ఢిల్లీలో 30శాతం మందికి, పంజాబ్ లో 13శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. కాగా, నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం 50శాతం మందికి పైగా టీకా అందింది.

  దీన్నిబట్టి చూస్తే, ఆయా రాష్రాలు వ్యాక్సినేషన్ లక్ష్యాల్లో మార్పు చేయాలంటూ  మాట్లాడుతున్నాయంటే, అది, వ్యాక్సినేషన్ ప్రక్రియలో తమ వైఫల్యాలనుంచి దృష్టిని మళ్ళించడానికేనని అనిపించడం లేదా? ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను రాజకీయం చేస్తున్నారనడానికి ఇదే బలమైన సాక్ష్యం.

  ప్రత్యేకించి, టీకా కొరత గురించి మహారాష్ట్రకు చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు కూడా నా దృష్టికి వచ్చాయి. వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో మహారాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనుంచి దృష్టిని మళ్లించడానికే ఈ ప్రకటనలు చేస్తున్నారు. ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమవుతున్నదో అర్థం కావడంలేదు. ప్రజల్లో ఆందోళనను వ్యాప్తి చేయడం అంటే పొరపాట్లను మరింతగా పెంచుకొని పరిస్థితిని క్లిష్టతరం చేసుకోవడమే అవుతుంది. వ్యాక్సీన్ల సరఫరాపై వాస్తవాల ప్రాతిపదికన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూనే ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమాచారం అందుతూనే ఉంది. అందువల్ల వ్యాక్సీన్లకు కొరత ఏర్పడిందన్న ఆరోపణలు పూర్తిగా అర్థరహితం.

  వైరస్ తో పోరాటం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరమైన వైఫల్యాలు, ఉదాసీన వైఖరిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా  గత ఏడాదిగా నేను ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నా. ఆ రాష్ట్ర ప్రభుత్వపు నిరాసక్త, ఉదాసీన వైఖరి కారణంగా వైరస్ పై పోరాటంకోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలన్నీ పూర్తిగా దెబ్బతింటున్నాయి.

 వైరస్ తో పోరాటం, అందుకు తీసుకోవలసిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం తరఫున మేం మహారాష్ట్ర ప్రభుత్వానికి క్రమం తప్పకుండా సలహా సహకారాలు అందిస్తూ వచ్చాం. అన్ని వనరులనూ ఆందుబాటులో ఉంచుతూ వచ్చాం. సహాయంకోసం కేంద్ర బృందాలనూ పంపించాం. అయితే, రాష్ట్ర ప్రభుత్వంనుంచి కృషి లోపించింది. ఇది ఇప్పుడు స్పష్టంగా గోచరిస్తోంది. దీని ఫలితం  మనందరినీ వెన్నాడేందుకు తయారైంది.  

   ఈ రోజున దేశంలో నమోదయ్యే కోవిడ్ కేసులేకాక, మరణాలు కూడా మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉంటున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ పాజిటివిటీ రేటు అక్కడ నమోదవుతోంది. వారు కోవిడ్ టెస్టులు చేస్తున్న తీరు సంతృప్తికరంగా లేదు. పాజిటివ్ కేసులుగా నిర్ధారితమైన బాధితులకు సన్నిహితులైన వారిని గుర్తించే ప్రక్రియ కూడా అక్కడ ఆశించినట్టుగా జరగడం లేదు.

  ఆరోగ్య రక్షణ కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు టీకాలు అందించే విషయంలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఏమంత గొప్పగా లేదు. క్వారంటైన్ నిబంధనల అమలునుంచి ప్రజలు తప్పించుకునేందుకు ఆస్కారమిస్తూ, మహారాష్ట్ర ప్రజలను ప్రమాదంలోని నెట్టేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర దిగ్భ్రాంతికరం. తమ వ్యక్తిగత స్వార్థంకోసం ఇలా చేయడం బాధాకరం. మొత్తంగా చూసినపుడు, ఆ రాష్ట్రం ఒక సంక్షోభంనుంచి మరో సంక్షోభంలోకి దొర్లుతూ పోవడాన్ని పరిశీలించినపుడు ఆ రాష్ట్రప్రభుత్వ నాయకత్వం తన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరిస్తోందేమో అనిపిస్తోంది. 

  మహమ్మారి వైరస్ ను నియంత్రించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మరెన్నో చర్యలు తీసుకోవలసి ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వరకూ సహాయ సహకారాలు అందించగలదు. అయితే, రాజకీయాలపైనే దృష్టిని కేంద్రీకరించడం, ప్రజలల్లో ఆందోళనను వ్యాప్తి చేయడం వంటి చర్యల వల్ల మహారాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు.

  అలాగే, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అపార్ధాలు, ఆందోళనలు ప్రబలిపోయేందుకు ఊతమిస్తూ చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా మా దృష్టికి వచ్చాయి. అయితే, ఈ సమయంలో చిల్లర రాజకీయాలకు పాల్పడకుండా ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలన్నింటినీ సమీకరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరిస్తే మంచిదని నేను సవినయంగా సూచిస్తున్నాను.

  గత రెండు మూడు వారాలుగా చత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో మరణాలు నమోదవుతూ వస్తున్నాయి. వారు కేవలం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలపైనే ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యాంటిజెన్ పరీక్షలపైన మాత్రమే ఆధారపడటం ఏ మాత్రం సరైన వ్యూహం కాదు. 

  కోవాగ్జిన్ అనే టీకాను అత్యవసరానికి వాడుకోవచ్చని భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించినప్పటికీ, ఆ వ్యాక్సీన్ వినియోగానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అంతేకాదు,..ఆ రాష్ట్ర ప్రభుత్వ నాయకుల తీరు సందేహాస్పదంగా, సందిగ్ధంగా ఉంది. వ్యాక్సీన్ల విషయంలో సందేహాలు, సంశయాలు రెచ్చగొట్టిన ఏకైక ప్రభుత్వం బహుశా  ప్రపంచంలో ఇది మాత్రమే కావచ్చు. 

  ఇక మిగిలిన ప్రభుత్వాలు కూడా తమ ఆరోగ్య రక్షణ వ్యవస్థలతో మరింత సంతృప్తికరంగా పనిచేయించు కోవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో కోవిడ్ పరీక్షల నాణ్యత మరింత మెరుగుపడాల్సి ఉంది. పంజాబ్ లో అధిక మరణాల రేటు పరిస్థితిని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. అక్కడ తక్షణం ఆసుపత్రి సేవలు అవసరమైన బాధితులను సత్వరం గుర్తించాల్సి ఉంది. మాస్కును ధరించడం, భౌతిక దూరం అన్న నిబంధనలు చాలా రాష్ట్రాల్లో సరిగా అమలు కావడంలేదు. వైరస్ కట్టడికి మరెంతో చేయవలసి ఉంది. ఆ పనులను మనం మరింత వేగంగా, భారీ స్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉంది.

  ఈ విషయంలో నా మౌనాన్ని బలహీనతగా పరిగణించరాదని చెప్పాల్సి వస్తోంది. రాజకీయాలు చేయడం చాలా సులభం. అయితే, పరిపాలనా తీరును, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగు పరుచుకోవడం మనకు అసలు సిసలైన పరీక్ష అవుతుంది.

  ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యమైనంత మేర సహాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు  మరోసారి స్పష్టం చేయదలుచుకున్నాను. ప్రతిభావంతమైన శాస్త్రవేత్తలు, వైద్యులను కలిగి ఉండటం భారతదేశానికి ఉన్న విభిన్నమైన ప్రత్యేకత. ఈ వైరస్ మహమ్మారిపై విజయం సాధించేందుకు మనమంతా కలసికట్టుగా శ్రమించి పనిచేయాల్సి ఉంది. ఇప్పటికే సాధించుకున్న ఫలితాలను మనం చెల్లాచెదురు చేసుకోవద్దు. ప్రజల పట్ల మనకు ఉన్న పవిత్ర బాధ్యతపైనే దృష్టిని కేంద్రీకరిద్దాం. భారతీయ పౌరుల పట్ల మనం నిర్వర్తించవలసిన బాధ్యత ఏ మాత్రం తగ్గరాదు.

 

****(Release ID: 1710344) Visitor Counter : 232