ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చుల శాఖ "మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం" పథకం కింద రాష్ట్రాలకు 11,830 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఆర్ధిక మంత్రి 2020 అక్టోబర్ 12 వ తేదీన "మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం" పథకాన్ని ప్రకటించారు. కోవిడ్-19 కారణంగా పన్ను రాబడులు తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో మూలధన వ్యయాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
మూలధనంపై చేసే వ్యయం బహుళ ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనివల్ల ఆర్ధిక వ్యవస్థ భవిష్యత్తు ఉత్పాదకత పెరుగుతుంది. దీనితో ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్ధిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ మూలధన వ్యయం కింద రాష్ట్రాలకు 2020-21లో కేంద్రం ప్రత్యేక సహాయాన్ని అందించింది. 2021-22లో కూడా ఈ పథకం అమలు జరుగుతున్నది.
ఈ పథకానికి నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. 27 రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనలను ఆమోదించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చుల శాఖ వీటికి 11,830 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, నీటిపారుదల, విధ్యుత్,రవాణా,విద్య, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి మూలధన వ్యయం ప్రాజెక్టులను అమలు చేయనున్నారు.
ఈ పథకాన్ని మూడు భాగాలుగా అమలుచేయడం జరుగుతుంది. ఈ పథకం మొదటి భాగం కిందకి ఈశాన్య మరియు కొండ రాష్ట్రాలు వస్తాయి. దీనిలో భాగంగా తొమ్మిది ఈశాన్య రాష్ట్రాలు, కొండప్రాంత రాష్ట్రాలకు 2500 కోట్ల రూపాయలను కేటాయించారు. పథకం పార్ట్- IIలో పార్ట్ -1 లో లేని అన్ని ఇతర రాష్ట్రాలను చేర్చి వీటికి 7,500 కోట్ల రూపాయలను కేటాయించారు. 2020-21 సంవత్సరానికి 15 వ ఆర్థిక కమిషన్ ఇచ్చిన తాత్కాలిక నివేదిక ప్రకారం కేంద్ర పన్నులో ఈ రాష్ట్రాల వాటాకు అనుగుణంగా ఈ మొత్తాన్ని కేటాయించారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న సంస్కరణలను పథకం మూడవ భాగంలో చేర్చారు. దీనికి 2,000 కోట్ల రూపాయలను కేటాయించారు. 2020 మే 17వ తేదీన ఆర్ధిక మంత్రిత్వశాఖ సూచించిన నాలుగు సంస్కరణల్లో మూడు సంస్కరణలను అమలులోకి తెచ్చిన రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని విడుదల చేస్తారు. ఈ సంస్కరణలను సంబంధిత మంత్రిత్వశాఖ ఆమోదించవలసి ఉంటుంది. ఒక దేశం ఒక రేషన్ కార్డ్, సులభతరం వాణిజ్యం, పట్టణ సంస్థలు/ వినియోగ అంశాలు, విద్యుత్ రంగాల్లో ఈ సంస్కరణలు అమలు జరుగుతున్నాయి. ఈ తరగతిలో 11 రాష్ట్రాలు అర్హత సాధించడంతో వాటికి పథకం మూడవ భాగంగా అదనపు నిధులు విడుదల అయ్యాయి.
****