గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

దాద్రా, నగర్ హవేలీ,.. డామన్, డయ్యూలతో


ట్రైఫెడ్ అవగాహనా ఒప్పందం
గిరిజన ఉత్పాదనలకు కనీసమద్దతు ధర,
వన్ ధన్ యోజన అమలుకోసం కసరత్తు

Posted On: 30 MAR 2021 5:47PM by PIB Hyderabad

చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పథకం, వన్ ధన్ యోజన పథకం అమలుకు సంబంధించి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని గిరిజన సహకార మార్కెటింగ్ సమాఖ్య (ట్రైఫెడ్) ఇటీవల ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.  కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా, నగర్ హవేలీ,.. డామన్ & డయ్యూ పరిపాలనా యంత్రాంగాలతో  ఈ అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ అవగాహనా ఒప్పందాన్ని అమలు పరిచే సంస్థలుగా ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాల షెడ్యూల్డ్ కులాల, తెగల, ఇతర వెనుకబడిన తరగతుల, మైనారిటీల ఆర్థిక అభివృద్ధి సంస్థలను నియమించారు. గిరిజనుల, ఆదివాసుల, గిరిజన చేతివృత్తులవారి జీవనోపాధిని మెరుగుపరిచి,  వారికి సాధికారత కల్పించాలన్న లక్ష్యం లో, ట్రైఫెడ్ ఇలాంటి అనేక కార్యక్రమాలను, పథకాలను చేపడుతూ వస్తోంది.

 

A group of people in a meetingDescription automatically generated with low confidence

ఈ ఏడాది మార్చి 5వ తేదీన కుదిరిన ఈ అవగాహనా ఒప్పందం ప్రకారం, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పథకం కింద మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి, ఆయా ఉత్పత్తులకు విలువను జోడించే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాన్ని పటిష్టంగా అమలు చేస్తారు. ఇందులో భాగంగా తొలుత వన్ ధన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా రూపొందించారు.

  చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పథకం అనేది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రధాన ( ఫ్లాగ్.షిప్) కార్యక్రమం. అటవీ ఉత్పత్తిదారులైన గిరిజనులకు, ఆదివాసులకు సరసమైన గిట్టుబాటు ధరలను కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఇతరత్రా పద్ధతుల ద్వారా వారికి లభించే ధరకు దాదాపు మూడురెట్లు ఎక్కువ ధరను కల్పించి, వారి మొత్తం ఆదాయాన్ని మూడురెట్లు చేయాలనే సంకల్పంతో ఈ పథకం రూపొందించారు. గత ఏడాది గిరిజన ఆర్థిక వ్యవస్థలోకి రూ. 3,000కోట్లను సముపార్జించి పెట్టడంలో ఈ పథకం విజయం సాధించింది. దీనితో గిరిజనుల జీవన పరిస్థితుల్లో మార్పును తీసుకువచ్చే ఆశాదీపంగా ఈ పథకం ఆవిర్భవించింది.  చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు విలువను జోడించడానికి, బ్రాండింగ్, మార్కెటింగ్ ఏర్పాటు చేయడానికి వన్ ధన్ యోజన (వి.డి.వై.) కార్యక్రమాన్ని రూపొందించారు. అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా వన్ ధన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా ఈ పథకంలో ఒక భాగమే.

  గిరిజనులకు, ఆదివాసులకు, గిరిజన హస్తకళా కారులకు ఉపాధి కల్పన లక్ష్యంగా వన్ ధన్ గిరిజన స్టార్టప్ కంపెనీలు కూడా ఆవిర్భవించాయి. దాద్రా, నగర్ హవేలీ,..డామన్, డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాగాలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం, గిరిజనుల జీవనోపాధి మెరుగుదలకోసం పథకాలను అమలు చేయడంతో ఆయా ప్రాంతాల పరిధిలోని గిరిజనుల పరిస్థితులు తప్పనిసరిగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

  దీనికి తోడు, ట్రైబ్స్ ఇండియా వ్యవస్థ ద్వారా గిరిజనులకు మరింత పెద్ద మార్కెట్లతో అనుసంధానం ఏర్పుడుతుంది. భౌతికంగా దుకాణాలను ఏర్పాటుచేయడంతోపాటు, ట్రైబ్స్ ఇండియా డాట్ కామ్ (Tribesindia.com) వెబ్ పోర్టల్ ద్వారా వారికి పెద్ద మార్కెట్లతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన గిరిజన సరఫరాదారులతో ఒక ప్యానెల్ ను ట్రైఫెడ్ ప్రస్తుతం తయారు చేస్తోంది. ఇక దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ ప్రాంతాల గిరిజన ఉత్పాదనలను కూడా తన కేటలాగులో చేర్చే ప్రక్రియను ట్రైబ్స్ ఇండియా పోర్టల్ త్వరలోనే ప్రారంభించే అవకాశాలున్నాయి. తద్వారా ఈ ప్రాంతానికి చెందన విభిన్న ఉత్పాదనలు మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. చిన్న తరహా అటవీ ఉత్పాదనలకోసం కనీస మద్దతు ధర, వన్ ధన్ యోజన పథకాలతోపాటుగా, ట్రైఫెడ్ చేపట్టే ఇతర పథకాల ద్వారా గిరిజనుల ఉత్పత్తులు, హస్తకళా ఖండాలు మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తాయి. దీనితో గిరిజనులకు తగిన ఆదాయం లభించడమేకాక, వారి జీవనోపాధి గణనీయంగా మెరుగుపడుతుంది.

 

*****



(Release ID: 1708690) Visitor Counter : 91


Read this release in: English , Urdu , Hindi , Punjabi