ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు గవర్నర్ల బోర్డు ఆరవ వార్షిక సమావేశానికి దృశ్య మాధ్యమం ద్వారా హాజరైన - కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
30 MAR 2021 7:04PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి మరియు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్.డి.బి) లో భారత గవర్నర్, శ్రీమతి నిర్మలా సీతారామన్, ఈ రోజు న్యూఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు గవర్నర్ల బోర్డు ఆరవ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన గవర్నర్లు / ప్రత్యామ్నాయ గవర్నర్లు కూడా పాల్గొన్నారు.
ప్రస్తుతం నెలకొన్న మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా, ఎన్.డి.బి. ఆరవ వార్షిక సమావేశాన్ని దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించారు. ఈ ఏడాది, వార్షిక సమావేశానికి, దాని ఆదేశంతో బాగా సరిపోయే విధంగా "నూతన అభివృద్ధి లక్షణాలు : మౌలిక సదుపాయాల పరిణామం" అనే అంశాన్ని ఇతివృత్తంగా నిర్ణయించారు.
మహమ్మారి ప్రభావాన్ని పరిమితం చేయడంతో పాటు, భారీగా టీకాలు వేసే కార్యక్రమం చేపట్టడానికి భారతదేశ శీఘ్ర ప్రతిస్పందన ఫలితంగా ‘V ఆకారం రికవరీ’ సాధ్యమయ్యిందని, కేంద్ర మంత్రి నొక్కిచెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాలు వేసే కార్యక్రమం భారతదేశంలో కొనసాగుతోందని కూడా, శ్రీమతి సీతారామన్ గట్టిగా చెప్పారు. భారతదేశం, 80 దేశాలకు 63.9 మిలియన్ మోతాదుల మేర మేడ్-ఇన్-ఇండియా కోవిడ్ వ్యాక్సిన్ ను 80 దేశాలకు, సరఫరా చేసింది. వీటిలో 10.4 మిలియన్ డోసులను గ్రాంటుగా అందజేసింది.
గత ఆరు సంవత్సరాలుగా బ్యాంకు సాధించిన విజయాలు, పురోగతిని, శ్రీమతి సీతారామన్ ప్రస్తావిస్తూ, కోవిడ్ మహమ్మారిపై పోరాడడంలో సభ్య దేశాలకు, 10 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయ కార్యక్రమం ద్వారా, కౌంటర్ సైక్లికల్ రుణాలు అందజేయడంలో ఎన్.డి.బి. పాత్రను ప్రత్యేకంగా పేర్కొన్నారు. తగినంత క్యాపిటలైజేషన్, అధిక నాణ్యత గల పాలన, వివేకవంతమైన నిర్వహణ ద్వారా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు కేటాయించిన రేటింగ్‌లను ఎన్.డి.బి నిర్వహించడం, మెరుగుపరచడం యొక్క అవసరాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు.
ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి, మరింత వినూత్నమైన ఫైనాన్సింగ్ నిర్మాణాలను అన్వేషించడానికి, ఇతర ఎం.డి.బి. లతో సహ-ఫైనాన్సింగ్ అవకాశాలను కనుగొనటానికి, బ్యాంకింగ్ ప్రాజెక్టుల పైప్-లైన్ ను అభివృద్ధి చేయడానికి, మౌలిక సదుపాయాల సుస్థిరతను పెంచడానికి, పర్యావరణ, సామాజిక భద్రతలను ప్రోత్సహించడానికి, కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్.డి.బి.ని ప్రోత్సహించారు.
మౌలిక సదుపాయాలకు ఆర్ధిక సహాయాన్ని అందించడంలో ఆర్థికాభివృద్ధి సంస్థల (డి.ఎఫ్.ఐ.ల) పాత్రను ఆమె ప్రత్యేకంగా పేర్కొంటూ, వచ్చే మూడేళ్లలో 69 బిలియన్ డాలర్ల రుణ లక్ష్యంతో, భారతదేశం 3 బిలియన్ డాలర్ల ప్రారంభ చెల్లింపు మూలధనంతో కొత్త డి.ఎఫ్.ఐ. ని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఎక్కువ ఫలితాలను సాధించడానికి, దాని అభివృద్ధి ప్రాధాన్యతలను పంచుకునే ఈ సంస్థలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవాలని, ఆమె ఎన్ఎ.డి.బి. కి సూచించారు.
బ్రిక్స్ దేశాలతో పాటు, ప్రపంచంలోని ఇతర ఈ.ఎం.డి.సి. లలో మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వనరులను సమీకరించే లక్ష్యంతో, బ్రిక్స్ సభ్య దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) 2014 లో, బహుళ పక్ష అభివృద్ధి బ్యాంకు - ఎన్.డి.బి. ని, స్థాపించాయి. చైనాలోని షాంఘై లో ఉన్న ప్రధాన కార్యాలయం ద్వారా 2015 సంవత్సరం నుండీ, ఈ బ్యాంకు పనిచేస్తోంది. ఎన్.డి.బి. ఇప్పటివరకు, భారతదేశంలోని 18 ప్రాజెక్టులకు, 6,924 మిలియన్ డాలర్ల ఆమోదం తెలిపింది.
*****
(Release ID: 1708604)