నీతి ఆయోగ్

భారత దేశపు ఆరోగ్య రంగంలో పెట్టుబడి అవకాశాలపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల

Posted On: 30 MAR 2021 3:42PM by PIB Hyderabad

భారతదేశంలో ఆరోగ్య రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలన్నిటినీ సోదాహరణంగా వివరిస్తూ నీతి ఆయోగ్ ఈ రోజు ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఆస్పత్రులు. వైద్య పరికరాలు, వైద్య బీమా. టెలీమెడిసిన్. ఇంటింటికీ వైద్యరక్షణ, వైద్యంతో కూడిన ప్రయాణం లాంటివి ఇమిడి ఉన్నాయి. ఈ నివేదికను నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్, సీఈవో అమితాబ్ కాంత్, అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్ విడుదలచేశారు.

భారత ఆరోగ్య రక్షణ పరిశ్రమ 2016 నుంచి ఏడాదికేడాది 22% చొప్పున పెరుగుతూ వస్తోంది. ఇది 2022 లో 372 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఆరోగ్యరంగం భారత ఆర్థిక వ్యవస్థలో అటు ఆదాయం పరంగాను, ఇటు ఉద్యోగపరంగాను అతిపెద్ద రంగాలలో ఒకటిగా మారంది. 

వయసు పైబడుతున్న జనాభా, పెరుగుతున్న మధ్య తరగతి, జీవనశైలి యాధుల పెరుగుదల, ప్రజల-ప్రైవేటు భాగస్వామ్యంలో పెరుగుదల, వేగం పుంజుకుటున్న డిజిటల్ టెక్నాలజీ వినియోగం లాంటి అనేక అంశాలు భారత వైద్య రంగం ఎదుగుదలకు కారణాలుగా నిలిచాయి. కోవిడ్ సంక్షోభం విసిరిన సవాలు అనేక అవకాశాలకు కూడా దారితీయటం వలన భారత ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెరిగినట్టు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ నివేదిక ముందుమాటలో రాశారు.  

భారత ఆరోగ్య రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, ఇప్పుడున్న వ్యాపార, పెట్టుబడి అవకాశాలు, ఆకట్టుకుంటున్న ప్రభుత్వ విధానం లాంటి అంశాలను మొదటి భాగంలో ప్రస్తావించారు.  ఎదుగుదలకు ఉన్న ప్రధాన అంశాలను రెండోభాగంలో పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, ఆరోగ్య బీమా, ఔషధాల తయారీ, బయోటెక్నాలజీ. వైద్య పరికరాలు, ఆరోగ్య పర్యాటకం, టెలీమెడిసిన్, టెక్నాలజీ వినియోగం లాంటి అంశాలను ప్రస్తావించారు.   

ఆస్పత్రుల విభాగంలో రెండో శ్రేణి, మూడో శ్రేణి పట్టణాలలో సైతం ప్రైవేట్ ఆస్పత్రుల పెరుగుదలను ప్రస్తావిస్తూ అక్కడ పెట్టుబడులకున్న అవకాశాలను గుర్తుచేశారు. ఔషధాల రంగంలో ఇటీవల కోవిడ్ ఔషధాలు,  పరికరాలు. వాక్సిన్ తయారీలో ఆత్మ నిర్భర్ భారత్ ను చాటుకున్న తీరును గుర్తుచేశారు. మరింత మెరుగు పడటానికి అవకాశాలను కూడా ప్రస్తావించారు. టెక్నాలజీలో ముందడుగు వేస్తూ కృత్రిమ మేథను వాడుతున్న తీరును గుర్తుచేశారు. ఇవన్నీ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చాటుతున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. .

నివేదిక పూర్తి పాఠం కోసం ఇక్కడ చూదవచ్చుhttps://niti.gov.in/sites/default/files/2021-03/InvestmentOpportunities_HealthcareSector_0.pdf

 

***



(Release ID: 1708498) Visitor Counter : 232