రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
సింగిల్-విండో వ్యవస్థతో వివిధ నియంత్రణ సంస్థలను ఒకే వేదికపైకి తేవాల్సిన అవసరం ఉంది: డీఓపీ కార్యదర్శి
దాదాపు 15 శాతం సీఏజీఆర్తో వైద్య పరికరాల రంగం ఆరోగ్య సంరక్షణ రంగంలోని అన్ని విభాగాల కంటే అత్యధిక వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Posted On:
25 MAR 2021 5:32PM by PIB Hyderabad
వైద్య పరికరాల రంగం కరోనా కాలంలో వేగంగా వృద్ధి చెందింది. ఇది 2024 నాటికి 65 బిలియన్ డాలర్ల పరిశ్రమగా అవతరిస్తుందని అంచనా. దేశీయ కంపెనీలకు, ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎంఎస్ఎంఈలు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి అవకాశాన్ని అందిస్తుంది. వర్చువల్ విధానంలో జరిగిన మెడికల్ డివైజెస్ ఎక్స్‌పో 2021 సందర్భంగా కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ ఔషధాల విభాగం కార్యదర్శి ఎస్. అపర్ణ మాట్లాడుతూ కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ, వినియోగం, అనుసంధానం వల్ల దేశవిదేశాల మార్కెట్లలో భారీ అవకాశాలను దక్కించుకోవచ్చని స్పష్టం చేశారు. దాదాపు 15 శాతం వార్షిక వృద్ధితో (సీఏజీఆర్తో) వైద్య పరికరాల రంగం ఆరోగ్య సంరక్షణ రంగంలోని అన్ని విభాగాల కంటే అత్యధిక వృద్ధి సామర్థ్యం ఉంది ఆమె అన్నారు. "ఇది రియాజెంట్లు, డయాగ్నొస్టిక్ కిట్లు, హై-ఎండ్ ఇమేజింగ్ పరికరాలను తయారు చేసే భారీ శ్రేణి ఉత్పత్తులతో కూడిన ఇంటర్ డిసిప్లినరీ రంగం. ఈ సెక్టార్కు ఇది చాలా సూక్ష్మమైన విధానం అవసరం’’ అని అపర్ణ అన్నారు. వైద్య పరికరాల దేశీయ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా, సింగిల్ విండోవ్యవస్థతో వివిధ రెగ్యులేటరీ ఏజెన్సీలను ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అపర్ణ అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారులు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు, రెగ్యులేటరీ ఎకో సిస్టమ్ మధ్య పారదర్శక, స్థిరమైన, అంచనా వేయదగిన, నావిగేట్ చేయగల ఇంటర్‌ఫేస్ ఉండాలని అన్నారు. పిపిఈ కిట్లు, సర్జికల్ గ్లోవ్స్, శానిటైజర్స్ ఎన్ 95 మాస్క్‌ల వంటి వివిధ క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ వస్తువుల ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరిగిందని, హెల్త్‌కేర్ ఇంజనీరింగ్ ఉత్పత్తులను, సేవలను తయారు చేయడానికి, అందించేందుకు మనదేశం కీలకంగా మారిందని వివరించారు. "భారతదేశంలో వైద్య పరికరాల పరిశ్రమ అద్భుతంగా వృద్ధి చెందుతున్నది. ఈ సెక్టార్లో పెద్ద పెద్ద కంపెనీలతోపాటు చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో గణనీయమైన వృద్ధి సాధించే సత్తా ఉంది" అని ఈఈపిసి ఇండియా చైర్మన్ మహేష్ దేశాయ్ ఈ సందర్భంగా అన్నారు. భారత వైద్య పరికరాల మార్కెట్ జపాన్, చైనా దక్షిణ కొరియా తరువాత ఆసియాలో నాలుగో అతిపెద్ద విపణి. గత కొన్నేళ్లుగా ఈ రంగానికి ప్రభుత్వం ఎంతో సాయం చేస్తున్నందున, మన పోటీ దేశాలను మించిపోయే స్థాయిలో ఎదుగుదలకు అవకాశం ఉంది. ఈ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో... 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఇవ్వడం, మెడిటెక్ పార్కుల ఏర్పాటు, ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకం వంటివి ఉన్నాయి. ఇటీవలి వైద్య పరికరాల సవరణ నియమం 2020 ఈ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించనుంది. దేశీయ విదేశీ మార్కెట్లలోని కొత్త అవకాశాలను అందింపుచ్చుకోవడానికి..బలమైన మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడానికి సరఫరాదారులను విక్రేతలను అనుసంధానించాలని ఈఈపీసీ ఇండియా వైద్యపరికరాల ప్రదర్శనకు హాజరైన నిపుణులు కోరారు. హెల్త్‌కేర్ రంగానికి చెందిన 300 మంది విదేశీ కొనుగోలుదారులు వర్చువల్ ఎక్స్‌పోలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో భారతీయ ఉత్పత్తులను ప్రదర్శించడమే గాక, కార్యక్రమానికి హాజరయ్యే దేశాల దిగుమతిదారులు, సరఫరాదారుల మధ్య ప్రత్యక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారు. "కోవిడ్ మహమ్మారి మా వైద్య పరికరాల పరిశ్రమను బలోపేతం చేసేందుకు అవకాశం కల్పించింది. భారతదేశం తగినంత వృద్ది సాధించింది" అని ఈఈపీసీ ఇండియా వైస్ చైర్మన్ అరుణ్ కుమార్ గరోడియా అన్నారు. బలమైన కవరేజ్, సేవలు బలోపేతం కావడం ప్రభుత్వ ప్రైవేటు కంపెనీల పెట్టుబడులు పెరగడం వల్ల భారత ఆరోగ్య సంరక్షణ రంగం వేగంగా ఎదుగుతోంది. ఆసియా పాశ్చాత్య దేశాలలో తోటివారితో పోలిస్తే మన ఉత్పత్తుల, సేవల ఖరీదు చాలా తక్కువ.
***
(Release ID: 1707734)
Visitor Counter : 119