మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

యునెస్కో డి.జి.తో కేంద్ర విద్యామంత్రి భేటీ!


జాతీయ విద్యా విధానం,.. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో విద్యారంగంపై భారత్ ప్రతిస్పందన తదితర అంశాలపై విపులంగా చర్చ

“సంస్కరణ, పనితీరు, పరివర్తన” అన్న నినాదంతో విద్యారంగంకోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్న రమేశ్ పోఖ్రకియాల్ ‘నిశాంక్’

కోవిడ్ కారణంగా విద్యాసంవత్సరం కోల్పోకుండా తీసుకున్న చర్యలను ప్రధానంగా వివరించిన మంత్రి

‘అందరికీ విద్య’ అనే సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా
విద్యా విధానం సిఫార్సులు ఉన్నాయన్న పోఖ్రియాల్ ‘నిశాంక్’

కోవిడ్ సంక్షోభ పరిష్కారంలో భారత్ ప్రతిస్పందనకు
యునెస్కో డి.జి. ప్రశంసలు

జాతీయ విద్యావిధానం అమలుకోసం యునెస్కో పూర్తి మద్దతుకు హామీ

Posted On: 25 MAR 2021 7:03PM by PIB Hyderabad

ఐక్యరాజ్య సమితి విద్యా, విజ్ఞానశాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలేతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఈ రోజు న్యూఢిల్లీలో వర్చువల్ విధానంలో ఆన్ లైన్ ద్వారా సమావేశమయ్యారు. ఉభయపక్షాలకు పరస్పర ప్రయోజనకరమైన అనేక కీలకాంశాలపై వారు ఈ సమావేశంలో చర్చించారు. జాతీయ విద్యావిధానం,  ముఖ్యంగా విద్యారంగపరంగా కోవిడ్ మహమ్మారికి భారతదేశం ప్రతిస్పందించిన తీరు, భారత్, యునెస్కో మధ్య సహకారం తదితర అంశాలపై కూడా వారు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి అమిత్ ఖరే, యునెస్కో ప్రతినిధి బృందం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాలుపంచుకున్నారు.

  ఈ సందర్భంగా మంత్రి పోఖ్రియాల్ మాట్లాడుతూ,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని, దేశంలోని మారుమూలలో ఉన్న చిన్నారులకు కూడా విద్యాసదుపాయం అందేలా అనేక చర్యలు తమ మంత్రిత్వ శాఖ తీసుకుందని అన్నారు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా చిన్నారులకు నిరాటంకంగా విద్యావకాశాలు అందేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఇ-విద్యా పథకం కింద దీక్షా- DIKSHA (డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్) వేదిక పేరిట చేపట్టిన కార్యక్రమాలను ఆయన ఉదహరించారు. ఇంటర్నెట్ అనుసంధాన సదుపాయం ఉన్న విద్యార్థులకు విద్యాభ్యాసం కొనసాగించే ధ్యేయంతో దీక్షా వేదికను రూపొందించారు. ఇక ఒక తరగతి, ఒకే ఛానల్ నినాదంతో దేశంలో ఇంటర్నెట్ సదుపాయం లేని చిన్నారుల విద్యాబ్యాసం కోసం ‘స్వయంప్రభ’ పేరిట చేపట్టిన కార్యక్రమాన్ని కూడా మంత్రి ఈ సందర్భంగా ఉదహరించారు.

  విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా నివారించేందుకు తీసుకున్న చర్యలను కూడా మంత్రి వివరించారు. విభిన్నమైన సామర్థ్యాలు కలిగిన చిన్నారులకోసం ప్రత్యేకంగా డైసీ- DAISY (డిజిటల్లీ యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పేరిట రూపొందించిన ప్రత్యేక వ్యవస్థను గురించి వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యుల మానిసిక ఆరోగ్యం, భావోద్వేగపరమైన వారి సంక్షేమం లక్ష్యంగా -మనోదర్పణ్- పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని కూడా కేంద్రమంత్రి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా 12,500మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరినట్టు తెలిపారు.

  కోవిడ్ మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు 23లక్షల మంది విద్యార్థులకోసం దేశవ్యాప్తంగా భారీస్థాయిలో పోటీ ప్రవేశపరీక్షలను నిర్వహించినట్టు తెలిపారు. ప్రపంచంలోనే అతి భారీ స్థాయిలో ఈ పరీక్షలను కోవిడ్ సమయంలో ఎంతో సురక్షితమైన పద్ధతిలో నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వైరస్ వ్యాపించిన కష్టకాలంలో భారతీయ విద్యాసంస్థలు పోషించిన కీలకపాత్రను పోఖ్రియాల్ ప్రధానంగా ప్రస్తావించారు. కోవిడ్ వైరస్ విసిరిన సవాళ్లన్నింటినీ తమకు అందివచ్చిన అవకాశాలుగా భారతీయ విద్యాసంస్థలు మార్చుకున్నాయని ఆయన అన్నారు. తక్కువ ఖర్చుతో కృత్రిమ శ్వాసకోసం ఉపకరించే పోర్టబుల్ వెంటిలేటర్లు, అందుబాటు ధరల్లో అధునాతన కోవిడ్-19 పరీక్షా పరికరాలు, అందుబాటు ధరల్లో ప్రభావవంతమైన పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు (పి.పి.ఇ. కిట్లు), మాస్కులు వంటి సృజనాత్మక ఉత్పాదనలతో ఈ సంస్థలన్నీ ముందుకు వచ్చాయని అన్నారు. భారతదేశంలోనే కాక, 62కు పైగా దేశాల్లోని ప్రజలకు ఆరోగ్య రక్షణ సదుపాయాలు కల్పించడంలో ఈ ఆవిష్కరణలు ఎంతో ప్రభావవంతమైవిగా పేరు తెచ్చుకున్నాయన్నారు.  భారతదేశం రూపొందించిన రెండు వ్యాక్సీన్లు దేశంలోనేకాక, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ పై పోరాటానికి ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు.

    2020వ సంవత్సరాన్ని భారతప్రభుత్వపు జాతీయ విద్యావిధాన సంవత్సరంగా భవిష్యత్తులో గుర్తుచేసుకోవచ్చని, దేశంలోని 34కోట్ల మంది విద్యార్థులకు సంబంధించి విద్యావ్యవస్థను సమూలంగా సంస్కరించే లక్ష్యంతో ఈ విద్యావిధానానికి రూపొందించామని కేంద్రమంత్రి తెలిపారు. సమానత్వం, అందరికీ సమాన ప్రాతిపదికన అవకాశాలు, అనుసంధానం, అందుబాటులో విద్య, జవాబ్దారీ తనం తదితర అంశాలతో కూడిన పునాదుల ప్రాతిపదికన కొత్త విద్యావిధానం రూపుదిద్దుకుందని అన్నారు. భారతదేశాన్ని 'ప్రపంచ స్థాయి విజ్ఞాన అగ్రరాజ్యంగా' తయారు చేసేందుకు, భారతీయులను 'ప్రపంచ స్థాయి పౌరులు'గా పోటీ తత్వంతో  తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా విద్యావిధానాన్ని రూపొందించినట్టు చెప్పారు. భారతదేశపు విద్యా వ్యవస్థను “సంస్కరించి, సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్ది, పరివర్తన చెందించాలన్న” నినాదంతో కొత్త విద్యావిధానం ద్వారా భారత ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. 2030వ సంవత్సరం నాటికి పాఠశాల విద్యలో స్థూలంగా వందశాతం విద్యార్థుల నమోదును, ఉన్నత విద్యలో 2035నాటికి 50శాతం నమోదును సాధించాలన్నదే నూతన విద్యావిధాన లక్ష్యమన్నారు. అదనంగా మూడున్నర కోట్లమంది విద్యార్థులను ఉన్నత విద్యావ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలన్నదే ధ్యేయమని తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లోని 4వది అయిన “అందరికీ విద్య’ అన్న లక్ష్యానికి అనుగుణంగా 2020వ సంవత్సరపు జాతీయ విద్యావిధానం సిఫార్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం సిఫార్సులకు అనుగుణంగా, పర్యావరణ విద్యా ప్రాధాన్యంతో కూడిన పాఠశాల పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం త్వరలోనే వెలువరించ బోతోందని కేంద్రమంత్రి తెలిపారు.

   భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలవుతున్న సందర్భంగా జరుపుకునే స్వాతంత్ర్య అమృత మహోత్సవాల (ఆజాదీకా అమృత మహోత్సవ్) సందర్భంగా యునెస్కో ప్రధాన కేంద్ర కార్యాలయంలో కూడా ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. 75ఏళ్ల కాలంలో భారతదేశం సాగించిన పయనాన్ని విపులంగా వివరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

  యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే, ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్-19వైరస్ సంక్షోభం విసిరిన సవాళ్ళ పరిష్కారంకోసం భారతీయ ప్రభుత్వం ప్రతిస్పందించిన తీరును, తీసుకున్న చర్యలను అభినందించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో కూడా విద్యాబోధన కార్యక్రమం టెలివిజన్, రేడియో, ఆన్.లైన్ పద్ధతుల ద్వారా ప్రతి విద్యార్థికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రసంసనీయమన్నారు. ఈ విషయంలో భారతదేశం తన అనుభవాన్ని యునెస్కోలోని ఇతర సభ్యదేశాలతో పంచుకోవాలని ఆమె మంత్రికి సూచించారు. విద్యారంగాన్ని పరివర్తన చెందించగల కొత్త విద్యా విధానాన్ని తీసుకువచ్చినందుకు ఆమె అభినందనలు తెలిపారు. నూతన విద్యావిధానంలో పేర్కొన్న పరిపాలనా సామర్థ్యాల పటిష్టత, సామాజిక ఉద్వేగభరితమైన అధ్యయనం, పర్యావరణ అవగాహన వంటివి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పతాయని, విద్యార్థుల అభివృద్ధికి అవి ఎంతో కీలకమైనవవి ఆమె అన్నారు. జాతీయ విద్యా విధానం అమలుకోసం యునెస్కో తరఫున తాము పూర్తి మద్దతు అందిస్తామని ఆడ్రీ అజౌలే గట్టి హామీ ఇచ్చారు.

 

*****



(Release ID: 1707713) Visitor Counter : 255