కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఈ ఏడాది జనవరిలో ఈపీఎఫ్‌వో సభ్యత్వం పొందిన 13.36 లక్షల మంది నికర చందాదారులు ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 62.49 లక్షల మంది చందాదారుల చేరిక: పేరోల్‌ సమాచారం

Posted On: 20 MAR 2021 5:49PM by PIB Hyderabad

జనవరిలో ఈపీఎఫ్‌వో చందాదారులుగా చేరిన 13.36 లక్షల మంది నికర చందాదారులు సహా, పెరుగుతున్న చందాదారుల సంఖ్యను ప్రముఖంగా ప్రస్తావిస్తూ శనివారం (మార్చి 20, 2021) ఈపీఎఫ్‌వో పేరోల్‌ సమాచారం ప్రచురితమైంది. కొవిడ్‌ ఉన్నా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 62.49 లక్షల మంది చందాదారులుగా చేరినట్లు ఆ సమాచారం వెల్లడించింది.

    ప్రచురిత సమాచారం ప్రకారం, గతేడాది డిసెంబర్‌ కంటే ఈ ఏడాది జనవరిలో 24 శాతం పెరుగుదల కనిపించింది. గతేడాదితో పోలిస్తే, ఏటికేడు చందాదారుల సంఖ్యలో 27.79 శాతం నికర వృద్ధి కనిపిస్తోంది. కొవిడ్‌ ముందున్న స్థాయులకు చేరడాన్ని ఇది సూచిస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈపీఆర్‌వో, పీఎంజీకేవై, పీఎంఆర్‌పీవై పథకాలతోపాటు, నిరంతరాయ సేవల కోసం ఈపీఎఫ్‌వో ఇటీవల చేపట్టిన ఈ-చర్యలు కూడా పేరోల్‌ సంఖ్య పెరుగుదల, వేగవంతమైన విస్తరణకు కారణం.

    జనవరిలో చేరిన 13.36 లక్షల మంది నికర చందాదారుల్లో, సుమారు 8.20 లక్షల మంది కొత్త సభ్యులు తొలిసారి ఈపీఎఫ్‌వో అందించే సామాజిక భద్రత పథకాల ప్రయోజనాన్ని పొందుతారు. ఈపీఎఫ్‌వో నుంచి 5.16 లక్షల మంది వైదొలగడం, తిరిగి చేరడం; ఈపీఎఫ్‌వో పరిధిలోని సంస్థల్లో ఉద్యోగాల మార్పిడిని, చందాదారులు తమ డబ్బును వెనక్కు తీసుకోకుండా ఖాతాను ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు కొనసాగించడాన్ని సూచిస్తుంది. చందాదారులు సంస్థ మారినప్పుడు, పాత ఖాతాలోని నిల్వను కొత్త ఖాతాకు ఇబ్బంది లేకుండా మార్చుకునే సదుపాయాన్ని వినియోగించుకోవడం ద్వారా ఈపీఎఫ్‌వో సభ్యత్వాన్ని కొనసాగిస్తున్నారు. 

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని జూన్‌లో సభ్యత్వాలు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, ఈపీఎఫ్‌వో నుంచి వైదొలిగేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు పేరోల్‌ సమాచారం వెల్లడిస్తోంది. సభ్యుల నిష్క్రమణపై కొవిడ్‌ ప్రతికూల ప్రభావం క్రమంగా తగ్గుతున్న విషయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

    చందాదారులు లేదా సంస్థలు సమర్పించిన క్లెయిములు, యజమానులు అప్‌లోడ్‌ చేసిన సమాచారంపై వైదొలిగిన సభ్యుల ఆధారపడి ఉంటుంది. అలాగే, కొత్తగా ఉత్పత్తయిన 'యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్ల'పై (యూఏఎన్‌) కొత్త చందాదారుల సంఖ్య ఆధారపడి ఉంటుంది.

    జనవరిలో చేరినవారిని వయస్సుల వారీగా విశ్లేషిస్తే; 22-25 ఏళ్ల వయస్సున్నవారిలో 3.48 లక్షల నికర సభ్యత్వాలతో గణనీయమైన వృద్ధి కనిపించింది. వీరిని కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారిగా చూడవచ్చు. 29-35 ఏళ్ల వయస్సున్నవారి సభ్యత్వాల సంఖ్య 2.69 లక్షలు. వీరిని ఉద్యోగాలు మారిన అనుభవజ్ఞులుగా, ఈపీఎఫ్‌వో ఖాతాను వదులుకోకుండా కొనసాగించినవారిగా పరిగణించవచ్చు.

    విభాగాల ఆధారంగా విశ్లేషిస్తే, గత నెలలతో పోలిస్తే ఆరోగ్యకరమైన వృద్ధి కనిపిస్తోంది. జనవరిలో, నిపుణుల సేవల విభాగం 5.65 లక్షల నికర చేరికలతో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. తొలి 10 పరిశ్రమల విశ్లేషణలో; గత డిసెంబర్‌తో పోలిస్తే, ఎలక్ట్రికల్, మెకానికల్, సాధారణ ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల విభాగాలతో పోటీపడి కంప్యూటర్, ఐటీ విభాగం అత్యధికంగా 40 శాతం నెలవారీ వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్‌లో 42,205, జనవరిలో 77,392 నికర చేరికలు జరిగాయి. ట్రేడింగ్, వాణిజ్య సంస్థల విభాగంలో, డిసెంబర్‌తో పోలిస్తే 27 శాతం వృద్ధితో 82,238 నికర చేరికలు జరిగాయి.

    దేశవ్యాప్తంగా చూస్తే, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో చేరిన మొత్తం 62.49 లక్షల మంది నికర చందాదారుల్లో, 34.24 లక్షల నికర చందాదారులతో మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక ముందంజలో ఉన్నాయి.

    లింగ ఆధారిత విశ్లేషణ ప్రకారం, జనవరిలో 2.61 లక్షల మంది మహిళలు సభ్యులుగా చేరారు. డిసెంబర్‌ కంటే ఇది దాదాపు 30 శాతం అధికం.

    ఉద్యోగుల నమోదును ఎప్పటికప్పుడు మారుస్తుండడం నిరంతర ప్రక్రియ కాబట్టి పేరోల్‌ సమాచారం తాత్కాలికం. గత సమాచారం ప్రతి నెలా మారుతుంది. 2017 సెప్టెంబర్‌ నుంచి ఉన్న పేరోల్‌ సమాచారాన్ని 2018 ఏప్రిల్‌ నుంచి ఈపీఎఫ్‌వో విడుదల చేస్తోంది. కొత్తగా చేరిన సభ్యులు, చందా కడుతున్నవారి వివరాలు ఆ సమాచారంలో ఉంటాయి.

***


(Release ID: 1706356) Visitor Counter : 147