ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పరిపాలనా విధానాన్ని క్రమబద్ధీకరించాలి, సమయబద్ధంగా సేవలందించాలి: ఉపరాష్ట్రపతి

• కనీస సదుపాయాలను పొందడం కోసం సామాన్యుడు పోరాడే పరిస్థితి  రాకూడదని ఆకాంక్ష

• వసతులు పెంచేందుకు ‘విశ్వాస ఆధారిత పరిపాలన’ రావాలన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

• తిరుమల దర్శన నిర్వహణా విధానానికి ఉపరాష్ట్రపతి ప్రశంస

• సాంకేతిక నవకల్పన ద్వారా ప్రతి ఒక్కరికీ అన్ని వసతులు అందేలా చూడాలని సూచన

• పరిపాలనలో ఫలితాల ఆధారిత విధానాన్ని అవలంబించాలి, పథకాల రూపకల్పన, అమలు మధ్య అంతరాన్ని తగ్గించాలి

• ప్రజలు లబ్ధిదారులుగా గాక, మార్పులో భాగస్వాములు కావాలని ఆకాంక్ష

• ‘బ్రింగింగ్ గవర్నమెంట్స్ అండ్ పీపుల్ క్లోజర్’ పుస్తకం అంతర్జాలం ద్వారా ఆవిష్కరణ సందర్భంగా ఉపరాష్ట్రపతి

Posted On: 20 MAR 2021 5:46PM by PIB Hyderabad

ప్రజల జీవితాల నాణ్యతను పెంచడం, సౌకర్యాలను అందించడమే సుపరిపాలనకు గీటురాయి అని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు చేరువై, వారి సమస్యల పరిష్కారంలో మరింత బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, అత్యవసర సేవలను క్రమబద్ధీకరించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కనీస సదుపాయాలు పొందేందుకు కూడా పౌరులు పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడే పరిస్థితి రాకూడదని ఆకాంక్షించారు.

శనివారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం. రామచంద్రన్ రచించిన ‘బ్రింగింగ్  గవర్నమెంట్స్ అండ్ పీపుల్ క్లోజర్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ప్రభుత్వ  కార్యకలాపాలను సౌకర్యవంతంగా, పారదర్శకంగా, ఇబ్బందుల్లేకుండా పొందాలని ప్రజలు భావిస్తారన్న రచయిత అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానన్న ఉపరాష్ట్రపతి, ఈ సదుపాయాన్ని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. ఇందుకోసం కేంద్రీయ ప్రజాసమస్యల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ (సీపీజీఆర్ఏఎమ్ఎస్) ద్వారా  జవాబుదారీతనాన్ని మరింతగా క్రమబద్ధీకరించాల్సిన అవసరం, నిర్దిష్ట సమయంలో సమస్యను పరిష్కరించడాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. ప్రభుత్వానితో సామాన్య మానవుడు తన భావాలను పంచుకునేందుకు వీలుగా ఓ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరాన్ని పేర్కొన్న రచయిత సూచనను కూడా ఆయన స్వాగతించారు.

‘విశ్వాస ఆధారిత పరిపాలన’ను తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, దీని ద్వారా సేవల నాణ్యతను మరింతగా పెంచేందుకు వీలవుతుందన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. డిజిటల్ దస్తావేజుల ద్వారా స్వీయ ధ్రువీకృతవ్యవస్థను తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పన్ను చెల్లింపుల వ్యవస్థను సులభతరం చేయడంతోపాటు పన్ను చెల్లింపుదారులు, అధికారులను కలవాల్సిన అవసరం లేకుండా కేంద్రం తీసుకొచ్చిన పన్ను సంస్కరణలను కూడా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.

సాంకేతికాభివృద్ధి ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు చేరువవుతున్న విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, డిజిటల్ ఇండియా, ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలు, స్వచ్ఛభారత్ వంటి పథకాలకు జియో ట్యాగింగ్ తదితర పథకాలు పరిపాలనలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాయని పేర్కొన్నారు. పెరుగుతున్న సాంకేతికాభివృద్ధితో పాటు, ప్రతిపౌరుడూ ప్రభుత్వాలు అందించే సౌకర్యాలను పొందేందుకు వీలుకల్పించడంలో మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  సాంకేతికతను సరైన విధంగా వినియోగించుకోవడం ద్వారా తిరుమల దర్శన విధానంలో వచ్చిన సానుకూల మార్పులను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. అసౌకర్యానికి తావు లేకుండా రోజూ 70 వేల నుంచి లక్ష మంది దర్శనం చేసుకుంటున్న ఆ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, వివిధ రంగాల్లో సానుకూల సాంకేతిక సౌకర్యాలు రావాలని సూచించారు.

పరిపాలన భాషగా మాతృభాషను తీసుకురావలసిన ఆవశ్యకతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఈ దిశగా చేయాల్సిన ముఖ్యమైన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. స్థానికంగా ప్రజలు మాట్లాడుకునే భాషనే ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, న్యాయస్థానాలతో పాటు ఇంటా, బయటా విరివిగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

పరిపాలనలో ఫలితాల ఆధారిత విధానాలను అలవర్చుకోవడాన్ని సమర్థించిన ఉపరాష్ట్రపతి, ప్రభుత్వ పథకాల రూపకల్పన ఉద్దేశాలు, వాటి అమలు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు అభిప్రాయం (ఫీడ్‌బ్యాక్) ఆధారిత విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విద్యావిధానంలో ‘దిశ’, గ్రామీణ విద్యుదీకరణ పథకంలో ‘సౌభాగ్య పోర్టల్’ వంటి విధానాల ద్వారా ప్రభుత్వాలకు కూడా పథకాల అమలుపై స్పష్టత వస్తుందన్నారు. పథకాలకు రూపకల్పన చేయడంతోపాటు వాటి అమల్లోనూ అదే చొరవను చూపడం ద్వారా సమర్థవంతంగా ప్రజలకు సౌకర్యాలను అందించేందుకు వీలుంటుందన్నారు.

పట్టణ ప్రాంతాల్లో పరిపాలన సమస్యలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, నగరాల్లోని అన్ని వర్గాలకు అవసరమైన మౌలికవసతులను కల్పిస్తూ ఆనందకర జీవితానికి అవసమైన పరిస్థితులను కల్పించాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి భూముల రికార్డులు, కోర్టు కేసుల పెండింగ్, విద్యుత్తు, పింఛన్లలో ఆలస్యం, కనీస విద్య, వైద్యం వంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. భూ రికార్డుల డిజిటలీకరణ, రోడ్డు అనుసంధానతను మెరుగుపరచడం, ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ సిలిండర్లు అందించడం వంటి ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయన్నారు. మిగిలిన సమస్యల పరిష్కారంలోనూ ఇదే విధంగా చొరవతీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఉత్తమ పరిపాలన విధానాలను పరస్పరం పంచుకోవడం, వాటికి సరైన ప్రచారం కల్పించడం వంటివి ఈ దిశగా ఎంతగానో ఉపయుక్తం అవుతాయని ఉపరాష్ట్రపతి సూచించారు. పరిపాలన విధానాలు, ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర నివేదికలు ఇవ్వడం ద్వారా ఆయా పథకాల విజయాలు, అపజయాలపై లోతైన అవగాహన కలగుతుందన్నారు. మున్ముందు మరింత సమర్థవంతంగా పథకాల అమలు చేసేందుకు ఇది సహాయపడుతుందని తెలిపారు.

భారత్‌ను ఓ ఆదర్శవంతమైన దేశంగా మార్చేందుకు, 21వ శతాబ్దంలో ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, దేశాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేయడం ఓ చక్కటి ప్రయోగమని.. స్వచ్ఛభారత్, కరోనా మహమ్మారి సమయంలో ప్రజల భాగస్వామ్యంతో సాధించిన విజయమే ఇందుకు మంచి ఉదాహరణ అని ఆయన గుర్తుచేశారు. ‘ప్రజలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఉండటమే కాదు, మార్పులో భాగస్వాములుగా ఉన్నప్పుడే సుపరిపాలన సాద్యమవుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం. రామచంద్రన్, మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ వినోద్ రాయ్, ఎకనమిక్ టైమ్స్ కన్సల్టింగ్ ఎడిటర్ శ్రీ అరుణ్ కుమార్, కోపాల్ పబ్లిషింగ్ హౌస్ నిర్వాహకులు శ్రీ రిషిసేథ్ సహా పలువురు సీనియర్ అధికారులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

***



(Release ID: 1706338) Visitor Counter : 150