మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2021 -22 సంవత్సరంలో కేంద్ర విద్యాశాఖ విడుదల చేసే గ్రాంట్లపై చర్చకు కేంద్ర విద్యాశాఖ మంత్రి సమాధానం
Posted On:
17 MAR 2021 5:56PM by PIB Hyderabad
విద్యాశాఖ 2021 -22 సంవత్సరంలో విడుదల చేసే గ్రాంట్లపై మార్చి 16న లోక్ సభలో జరిగిన చర్చకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ వివరంగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి జాతీయ విద్యా విధానం 2020 విశిష్టత గురించి వివరించారు. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సాధనకు అవసరమైన పునాదులు నిర్మించడం జరుగుతుందని ఆయన అన్నారు. తద్వారా విశ్వగురుగా భారతదేశం తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యారంగంతో సంబంధమున్న పలువురితో ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు తదితరలతో సమగ్రమైన చర్చలు చేసిన తర్వాతనే జాతీయ విద్యావిధానాన్ని (నేసనల్ ఎడ్యుకేషన్ పాలసీ: ఎన్ ఇపి) ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు.
ఎన్ ఇపి అనేది జాతీయంగా , అంతర్జాతీయంగా పనిచేసే విధానమని అన్నారు. సమానత్వం, నాణ్యత, అందరికీ అందుబాటు అనే బలమైన పునాదుల మీద దీన్ని తయారు చేశామని ఇది ప్రభావవంతమైనదని, వినూత్నమైనదని , అందరినీ కలుపుకొని పోతూ అన్ని వర్గాలకు మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఎన్ ఇపికి సంబంధించిన పలు ముఖ్య అంశాల గురించి ఆయన మాట్లాడారు. ఆరవ తరగతి, ఆ తర్వాత విద్యార్థులకు వృత్తి విద్యలను అందించడం జరుగుతుందని, రిపోర్ట్ కార్డు స్థానంలో ప్రోగ్రెస్ కార్డ్ వుంటుందని, 5+3+3+4 పద్థతిలో విద్యావిధానం వుంటుందని ఆయన అన్నారు. బహుళ అంశాలకు సంబంధించిన విద్యను అందించడం జరుగుతుందని విద్యార్థులు ఆయా కోర్సులలో సులువుగా చేరడం, వద్దనుకుంటే సులువుగా వేరే తరగతులకు మారడం జరుగుతుందని అన్నారు. అంతే కాదు క్రెడిట్ పాయింట్లతో కూడిన బ్యాంకును నిర్వహిస్తామని అన్నారు. మన దేశంలో తీసుకొచ్చిన విద్యారంగ సంస్కరణ ఎన్ ఇపి అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సంస్కరణగా గుర్తింపు పొందుతోందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా 2021-22 విద్యాసంవత్సరానికి బడ్జెట్ కేటాయింపుల గురించి ఆయన వివరంగా మాట్లాడారు. స్కూలు విద్య, అక్షరాస్యత సాధన కోసం 2021-22 సంవత్సరానికిగాను రూ. 54873.66 కోట్లు కేటాయించడం జరిగిందని ఆయన అన్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ. 2, 684.59 కోట్లు అదనంగా నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు.అలాగే ఉన్నత విద్యారంగంకోసం 2021-22 సంవత్సరంలో రూ. 38350.65 కోట్లు కేటాయించామని అన్నారు. గత ఏడాదితో పోలిస్తూ రూ. 5450.65 అధికమని స్పష్టం చేశారు. దేశంలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకోసం జరుగుతున్న కృషిని వివరించారు. జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు. ప్యాకేజీ కల్చర్ నుంచి పేటెంట్ కల్చర్ వైపు విద్యార్థులను మరలుస్తున్నామని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా విద్యారంగంలో చేసిన మార్పుల గురించి ఆయన వివరించారు. ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు బోధనా సేవలు అందించామని వివరించారు. 2019-20 సంవత్సరంలో ఇగ్నో ద్వారా 8.19 లక్షల మంది విద్యార్థులకు విద్యనందించామని 2013-14లో ఈ సంఖ్య 3.98 లక్షలేనని గణాంకాలను సభ ముందు వుంచారు. 2019-20లో ఉన్నత విద్యారంగంలోని పరిశోధక విద్యార్థులు 2.02 లక్షలని 2013-14లో ఈ సంఖ్య 1.07 లక్షలు మాత్రమే అని ఆయన వివరించారు.
****
(Release ID: 1705758)
Visitor Counter : 143