జల శక్తి మంత్రిత్వ శాఖ
భారత్-బంగ్లాదేశ్ జల వనరుల కార్యదర్శుల స్థాయి సమావేశం
జల వనరులకు సంబంధించిన సమస్త అంశాల్లో సహకారం పెంపునకు రెండు వర్గాల అంగీకారం
Posted On:
17 MAR 2021 11:38AM by PIB Hyderabad
ఉమ్మడి నదుల కమిషన్ విధానం కింద, భారత్-బంగ్లాదేశ్ జల వనరుల కార్యదర్శుల స్థాయి సమావేశం ఈనెల 16న దిల్లీలో జరిగింది. భారత్ తరపున, జల వనరుల విభాగం కార్యదర్శి శ్రీ పంకజ్ కుమార్ నేతృత్వంలోని అధికార బృందం చర్చల్లో పాల్గొనగా, బంగ్లాదేశ్ తరపున, ఆ దేశ జల వనరుల శాఖ సీనియర్ కార్యదర్శి శ్రీ కబీర్ బిన్ అన్వర్ ఆధ్వర్యంలోని బృందం పాల్గొంది.
రెండు దేశాల్లోని ప్రజల జీవనోపాధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే 54 ఉమ్మడి నదులు భారత్, బంగ్లాదేశ్‌లో ఉన్నాయని గుర్తు చేసుకున్న అధికార బృందాలు, ఈ అంశంలో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న సహకారాన్ని ప్రశంసించాయి.
నదీ జలాల పంపకం, కాలుష్య నియంత్రణ, తీరాల సంరక్షణ, వరద నిర్వహణ, పరివాహక ప్రాంతాల నిర్వహణ సహా జల వనరులకు సంబంధించిన సమస్త అంశాల్లో సహకారం పెంపునకు రెండు దేశాలు అంగీకరించాయి. సంయుక్త సాంకేతిక కార్యనిర్వాహక బృందం ఈ అంశంలో సాయం చేస్తుంది.
ప్రాధాన్యత గల ఈ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి. జేఆర్‌సీ విధానం కింద, ఇరు వర్గాలకు అనుకూల తేదీల్లో తదుపరి సమావేశాన్ని ఢాకాలో నిర్వహించడానికి రెండు పక్షాలు అంగీకరించాయి.
***
(Release ID: 1705703)
Visitor Counter : 243