విద్యుత్తు మంత్రిత్వ శాఖ
అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం రాష్ట్రాలలో విద్యుత్ ప్రసారం, పంపిణీని బలోపేతం చేయడానికి వీలుగా సవరించిన వ్యయ అంచనాలను ఆమోదించిన - కేంద్ర మంత్రి మండలి
Posted On:
16 MAR 2021 4:00PM by PIB Hyderabad
అంతర్-రాష్ట్ర ప్రసారం, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టిన ప్రధాన చర్యలో భాగంగా, అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కింలో 9,129.32 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన, ప్రసారం, పంపిణీల ను బలోపేతం చేసే సమగ్ర పథకం యొక్క సవరించిన వ్యయ అంచనా (ఆర్.సి.ఈ) ని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, ఆమోదించింది.
సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సహకారంతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ (పి.ఎస్.యు), పవర్-గ్రిడ్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కాంట్రాక్టు ఇవ్వడానికి అవకాశం ఉన్న పనులు 2021, డిసెంబర్ నాటికీ, కాంట్రాక్టు ఇవ్వడానికి అవకాశం లేని పనులు ఆర్.ఈ.సి. ఆమోదం లభించిన నాటి నుండి 36 నెలల్లో, దశలవారీగా ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించారు. నిర్మాణం పూర్తైన అనంతరం, ఈ ప్రసార, పంపిణీ వ్యవస్థను, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన, సంబంధిత వినియోగ సంస్థలకు, నిర్వహణ, యాజమాన్యం కోసం అప్పగిస్తారు.
కేంద్ర ప్రభుత్వ నిబద్ధత కింద, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో సంపూర్ణ ఆర్థికాభివృద్ధిని సాధించడంతో పాటు, సుదూర, మారుమూల ప్రాంతాలను గ్రిడ్ తో అనుసంధానించడం ద్వారా ఆయా రాష్ట్రాలలో అంతర్-రాష్ట్ర ప్రసార, పంపిణీ వ్యవస్థల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా, విశ్వసనీయమైన పవర్ గ్రిడ్ నిర్మాణం జరుగుతుంది, భవిష్యత్తులో విద్యుత్తును భారీగా వినియోగించుకునే కేంద్రాలకు, ఈ రాష్ట్రాల అనుసంధానత మెరుగుపడుతుంది. ఫలితంగా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని, మారుమూల, సరిహద్దు ప్రాంతాలతో సహా గ్రామాలు, పట్టణాలలోని లభ్డిదారులకు చెందిన అన్ని వర్గాల వినియోగదారులు, గ్రిడ్ తో అనుసంధాన మైన విద్యుత్ ప్రయోజనాలను పొందుతారు.
ఈ రాష్ట్రాల తలసరి విద్యుత్ వినియోగాన్ని పెంచడంతో పాటు, ఆయా రాష్ట్రాల సంపూర్ణ ఆర్థికాభివృద్ధికి, ఈ పధకం దోహదం చేస్తుంది.
ఈ పధకాన్ని అమలు చేసే సంస్థలు తమ నిర్మాణ పనులలో గణనీయమైన సంఖ్యలో, నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తాయి.
ఈ పధకం పూర్తయిన తరువాత, ఈ ఆస్తులు కొత్తగా ఏర్పాటు చేసినవి కాబట్టి, ప్రామాణిక నిబంధనల ప్రకారం పనులు చేయడానికి, నిర్వహణ కోసం అదనపు స్థానిక మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇది రాష్ట్రాలకు గణనీయమైన అదనపు స్థానిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
నేపధ్యం :
ఈ పథకాన్ని ప్రారంభంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర రంగ ప్రణాళిక పథకంగా 2014 డిసెంబర్ లో ఆమోదించారు. పథకానికయ్యే మొత్తం వ్యయాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రణాళిక పథకం ద్వారా భారత ప్రభుత్వం భరిస్తుంది.
*****
(Release ID: 1705250)
Visitor Counter : 177