ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

గ్రామీణప్రాంతాల్లో వైద్యవసతుల కల్పనలో ప్రభుత్వంతో ప్రైవేటు రంగం కలిసి పనిచేయాలి: ఉపరాష్ట్రపతి

అందుబాటు ధరల్లోనే వైద్యం అందించే ప్రయత్నాలు జరగాలి

నాణ్యమైన వైద్యం ప్రతి భారతీయుడి హక్కు అన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

అర్హులైన వారంతా కరోనా టీకాను తీసుకుని కరోనాపై జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు కావాలని సూచన

ప్రపంచ ఫార్మసీగా మన దేశానికి ఉన్న పేరు మరింత పెరిగింది

అమర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

Posted On: 04 MAR 2021 4:40PM by PIB Hyderabad

మార్చి 4, 2021, తిరుపతి

వైద్య మౌలికవసతుల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరంపై గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంతరాన్ని తగ్గించేవిషయంలో ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల విషయలో ప్రైవేటు రంగం కూడా కలిసి నడవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటు ధరల్లోనే నాణ్యమైన వైద్యం పొందేందుకు అవసరమైన వసతుల కల్పన జరగాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

నాణ్యమైన వైద్యం పొందండం ప్రతి భారతీయ పౌరుడి హక్కు అన్న ఉపరాష్ట్రపతి.. గ్రామీణ ప్రాంతాల్లోని వారు కూడా ఆధునిక వైద్య వసతులను తమ గ్రామంలోనే పొందేందుకు వీలుగా ప్రయత్నాలను ముమ్మరం చేయాలన్నారు. వైద్య సేవలు అందకుండా బాధపడేవారు ఉండకూడదనేదే తన ఉద్దేశమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

తిరుపతిలో అమర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి.. అర్హులైన వారంతా కరోనా టీకాను తీసుకుని.. మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు కావాలని సూచించారు.

తాజా బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ.2.23 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడంపై కేంద్ర  ప్రభుత్వాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. భారతదేశంలో వైద్య వసతుల మౌలిక కల్పనతోపాటు వైద్యానికి అయ్యే ఖర్చులను తగ్గించుకునే విషయంలో కేంద్రం నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలపై చైతన్యం కలిగించడం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు ఉన్నతమైన వైద్యసేవలను అందుబాటులోకి వస్తాయన్నారు.

కరోనాపై పోరాటంలో ముందువరసలో ఉన్న యోధుల సేవలను ప్రశంసిస్తూ.. కరోనా సమయంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా వర్కర్లు చేసిన సేవలకు యావద్భారతం ఎన్నటికీ రుణపడి ఉంటుందిఅని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ సందర్భంగా పోలీసులు, భద్రతాసిబ్బంది పాత్రను మరిచిపోలేమని.. పాత్రికేయులు కూడా ప్రజలను నిరంతరం చైతన్య పరచడంలో కీలకంగా వ్యవహరించారని ఆయన అన్నారు.

కరోనా సందర్భంగా తన దగ్గరున్న వనరులను ప్రపంచంతో పంచుకునేందుకు భారతదేశం ఏమాత్రం సంకోచించలేదని.. మన ప్రాచీన జీవన విధానమైన వసుధైవ కుటుంబకంస్ఫూర్తితో.. మందులను, వైద్య పరికరాలను 150కి పైగా దేశాలకు పంపిణీ చేసిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు.

జనవరిలో స్వదేశీ తయారీ కరోనా టీకా సిద్ధమైన తర్వాత కూడా వివిధ దేశాలకు పంపిణీ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఫార్మసీ ఆఫ్ వరల్డ్గా పేరున్న భారతదేశం కరోనా తదనంతర పరిస్థితులతో తన గౌరవాన్ని మరింతగా పెంచుకుందన్నారు.

తరచుగా ఆసుపత్రులకు రావడంతో బాధితులు, వారి కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారన్న ఉపరాష్ట్రపతి.. ఈ అంశంపై ఆరోగ్య సంరక్షణతో సంబంధమున్న భాగస్వామ్యపక్షాలన్నీ ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.

అసంక్రమిత వ్యాధుల ప్రభావం పెరిగిపోతుండటంపైనా ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, యోగ, ధ్యానం చేయడం ద్వారా అసంక్రమిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చన్నారు.

అమర ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ గౌరినేని ప్రసాద్, డాక్టర్ గౌరినేని రమాదేవిలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రపంచస్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కె.నారాయణ స్వామి, అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు శ్రీ గల్లా రామచంద్రనాయుడు, మాజీ రాష్ట్ర మంత్రి శ్రీమతి గల్లా అరుణకుమారి, గుంటూరు లోక్‌సభ ఎంపీ శ్రీ గల్లా జయదేవ్, అమర ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ గౌరినేని ప్రసాద్, డాక్టర్ గౌరినేని రమాదేవితోపాటు ఆసుపత్రి సిబ్బంది, పలువురు పుర ప్రముఖులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1702572) Visitor Counter : 188