ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్ సంక్షోభంలో అక్కౌంట్స్ కంట్రోలర్ జనరల్ సేవలు అభినందనీయం

45వ సివిల్ అక్కౌంట్స్ దినోత్సవంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

Posted On: 01 MAR 2021 7:47PM by PIB Hyderabad

   45వ సివిల్ అక్కౌంట్స్ దినోత్సవం సోమవారం న్యూఢిల్లీలో జరిగింది. ముఖ్య అతిథి, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్; భారత కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ జి.సి. ముర్ము,; ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శి డాక్టర్ టి.వి. సోమనాథన్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సోమా రాయ్ బర్మన్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ వార్షిక కార్యక్రమాన్ని తొలిసారిగా వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. భారతీయ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (ఐ.సి.ఎ.ఎస్.) అధికారులు, సివిల్ అకౌంట్స్ సంస్థ సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఎన్నో సవాళ్లు ఎదురైన తరుణంలో కూడా ప్రభుత్వ వ్యయ నిర్వహణా వ్యవస్థను సజావుగా కొనసాగించడం అభినందనీయమని అన్నారు.  కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తితో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ, సివిల్ అక్కౌంట్స్ సంస్థ తగిన రీతిలో సత్వరం స్పందించి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో, సమర్థమైన పరిష్కారాలతో నిధుల ప్రవాహంతో తగిన చర్యలు తీసుకోవడం సతోషదాయకమన్నారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణా వ్యవస్థ ద్వారా  ప్రత్యక్ష నగదు బదిలీ ప్రక్రియ విజయవంతం కావడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తితో తీవ్రమైన ప్రతికూల పరిస్థితి నెలకొన్నప్పటికీ కొత్తగా రూపొందించిన లడఖ్ యు.టి. కోసం కొత్త ఖాతా వ్యవస్థను సజావుగా బదిలీ చేసినందుకు ఆమె ఆర్థిక సంస్థలను ప్రశంసించింది.

 

  నిధుల ప్రవాహం సజావుగా సాగేందుకు వీలుగా తొలిదశలో 15 స్వయంప్రతిపత్తి సంస్థల్లో ట్రెజరీ సింగిల్ అక్కౌంట్ (టి.ఎస్.ఎ.) వ్యవస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు., రానున్న స్వాతంత్ర్య దినోత్సవానికల్లా మరో 40 స్వయంప్రతిపత్తి సంస్థలకు టి.ఎస్.ఎ. వ్యవస్థను విస్తరింపజేయాలన్న లక్ష్యంకోసం సివిల్ అక్కౌంట్స్ సంస్థ చిత్తశుద్ధితో పనిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. టి.ఎస్.ఎ. అన్నది వ్యవస్థాపరమైన సంస్కరణా విధానమని, ఇది ద్రవ్య విలువను కాపాడి, ప్రభుత్వంపై రుణభారాన్ని తగ్గిస్తుందని అన్నారు. సివిల్ అక్కౌంట్స్ సంస్థకోసం 3 సూత్రాలను కేంద్ర ఆర్థిక మంత్రి సూచించారు. కాగిత రహిత, పారదర్శక పరిపాలన, సాంకేతిక పరిజ్ఞాన ప్రగతికి అనుగుణంగా పురోగమనం, వినియోగయోగ్యమైన మార్గాల్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ కొనసాగింపు అన్న మూడు సూత్రాలను ఆమె సూచించారు.

https://ci5.googleusercontent.com/proxy/GTG8yzBSUGkYQJUHrRMtzy_dCdi4z_6z39IFcbYYiRwpLniAiNSjBKs9DGwaOcXvGrA3Ir-7dzQBcMOs5FKfOwjVftDdR3geA8NhyLn0mM4PcNz39NKjIC5OWA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WY71.jpg

  కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ జి.సి. ముర్ము మాట్లాడుతూ, సమర్థవంతంగా, ప్రతిస్పందనా పూర్వకంగా బడ్జెటింగ్ ప్రక్రియను, చెల్లింపులు, ఖాతాల నిర్వహణను సాగిస్తున్న సివిల్ అక్కౌంట్స్ సంస్థ సేవలను అభినందించారు. భారత ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ లావాదేవీలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణా సంస్థ (పి.ఎఫ్.ఎం.ఎస్.) దోహదపడిందని అన్నారు. పి.ఎం. కిసాన్ పథకం కూడా పి.ఎఫ్.ఎం.ఎస్. ద్వారా విజయవంతంగా అమలైందని అన్నారు. ఆస్తుల నిర్వహణా ఖాతా ప్రక్రియ, సహజ వనరులపై ఖాతా నిర్వహణ తదితర సంస్కరణలకు ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం ద్వారా జియో ఫిజికల్ ట్యాగింగ్ (జి.పి. ట్యాగింగ్) చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

   కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ, వ్యయ విభాగం కార్యదర్శి డాక్టర్ టి.వి. సోమనాథన్ మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయంలో సివిల్ అక్కౌంట్స్ సంస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ సంస్థను అత్యవసర సంస్థగా ప్రకటించారని, కోవిడ్ పై పోరులో ముందువరసలో నిలిచిన ఫ్రంట్ లైన్ సిబ్బందిలా ఈ సంస్థ పనిచేసిందని అన్నారు. నాణ్యత విషయంలో కూడా ఎలాంటి రాజీ పడకుండా, చెల్లింపుల ప్రక్రియను సజావుగా నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.

   అక్కౌంట్స్ కంట్రోలర్ జనరల్ (సి.జి.ఎ.) సోమా రాయ్ బర్మన్ మాట్లాడుతూ, తొలి దశ లాక్ డౌన్ సందర్భంగా గత ఏడాది మార్చి 30, 31వ తేదీల్లో రికార్డు స్థాయిలో 4.16కోట్ల మేర లావాదేవీలను నిర్వహించినట్టు వివరించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద,.. జన్ ధన్  యోజన ఖాతాదారులైన దాదాపు 21కోట్ల మంది మహిళలకు రూ. 30,000కోట్ల రూపాయల మేర నగదు బదిలీ జరిగిందని, పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దాదాపు 10కోట్ల మంది రైతులకు రూ. 56,000కోట్ల రూపాయల మేర నగదు బదిలీ జరిగిందని కూడా ఆమె వివరించారు. 2021-22 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నింటిలో టి.ఎస్.ఎ. వ్యవస్థ అమలు విషయంలో అక్కౌంట్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయం ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరించిందని అన్నారు.  సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా  చెల్లింపులు, వసూళ్లు, ఖాతాల నిర్వహణ, అంతర్గత ఖాతాల తనిఖీ విషయంలో కొత్త శిఖరాలను అందుకునేందుకు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంటామని ఆమె చెప్పారు.

  ప్రధానమంత్రి ఆర్థిక వ్యవరాల సలహా మండలి చైర్మన్ డాక్టర్ బిబేక్  దేబ్ రాయ్ ఈ కార్యక్రమంలో ప్రధానోపన్యాసం చేస్తూ, జాతి నిర్మాణంలో బాధ్యాతాయుత సంస్థలు నిర్వహించవలసిన నిర్మాణాత్మక పాత్రను వివరించారు. పంచాయతీలు, పట్టణ స్థానిక పరిపాలనా సంస్థల యంత్రాంగాలకు సంబంధించి రాజ్యాంగంలోని 7వ షెడ్యూలును మరోసారి పరిశీలించవలసిన అవసరం ఉందని, ప్రజాసంబంధమైన సరకుల వాస్తవ బట్వాడా స్థానిక సంస్థల స్థాయిలోనే జరగలవసి ఉందని అన్నారు.

 

భారతీయ సివిల్ అక్కౌంట్స్ సర్వీస్-ఐ.సి.ఎ.ఎస్.

  ప్రభుత్వ ఆర్థిక నిర్వహణా వ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1976లో ప్రధానమైన సంస్కరణను ప్రారంభించింది. ఆడిట్, అక్కౌంట్స్ విధులను విభజన జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఖాతాల తయారీ బాధ్యతనుంచి కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కు విముక్తి కలిగించారు. దీనితో,..భారతీయ సివిల్ అక్కౌంట్స్ సర్వీస్ (ఇండియన్ సివిల్ అక్కౌంట్స్ సర్వీస్-ఐ.సి.ఎ.ఎస్.) ఏర్పాటైంది. ఇండియన్ ఆడిట్, అక్కౌంట్స్ సర్వీస్ (ఐ.ఎ., ఎ.ఎస్.) నుంచి ఐ.సి.ఎ.ఎస్.ను రూపొందించారు. 1976వ సంవత్సరపు కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి.ఎ.జి.) విధులు, అధికారాలు, సర్వీస్ నిబంధనల చట్టం సవరణతో  ఒక ఆర్డినెన్స్ ను జారీ చేయడం ద్వారా ఐ.సి.ఎ.ఎస్. ను రూపొందించారు. ఆ తర్వాత,..కేంద్ర ప్రభుత్వ ఖాతాల (సిబ్బంది బదలీ) డిపార్ట్ మెంటలైజేషన్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. 1976, ఏప్రిల్ 8వతేదీన ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అయితే,..1976 మార్చి ఒకటవ తేదీనుంచే ఈ చట్టం అమలులోకి వచ్చినట్టు పరిగణించారు. దీనికి అనుగుణంగా, ప్రతి సంవత్సరం మార్చి ఒకటవ తేదీని “సివిల్ ఖాతాల దినోత్సవం”గా నిర్వహిస్తూ వస్తున్నారు.

  ప్రభుత్వ ఆర్థిక సేవల నిర్వహణలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో అమలు చేసే సంస్కరణలకు ఐ.సి.ఎ.ఎస్. సారథ్యం వహిస్తూ వస్తోంది. పి.ఎఫ్.ఎం.ఎస్. రూపకల్పన, నిర్వహణా విధానం, ప్రభుత్వం తరఫున చెల్లింపులు, ఖాతాల నిర్వహణకోసం సమీకృత, సింగిల్ ఐ.టి. వేదిక అమలుచేయడం వంటి విధులను కూడా ఐ.సి.ఎ.ఎస్. నిర్వహిస్తూ వస్తోంది. కోవిడ్ సంక్షోభం కారణంగా వినియోగ వ్యవస్థ కుప్పకూలిన తరుణంలో నిరాటంకంగా నిధుల ప్రవాహం జరిగేలా చూడటం, ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగేలా చూడటం ప్రభుత్వానికి తప్పనిసరి విధులుగా మారాయి. కేవలం మందులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచడం, శాంతి భద్రతలను పరిరక్షించడం మాత్రమే కాక, ఆర్థిక వ్యవస్థ నిలదొక్కులేనా చూడటం కూడా ప్రభుత్వానికి అత్యవసర విధిగా పరిగణించారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల క్లెయిములను, బిల్లులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పరిష్కారమయ్యేలా చూడటం, ప్రభుత్వ వ్యయ నిర్వహణా వ్యవస్థ చక్రాలు ముందుకు సాగేలా చూడటం వంటి విధుల నిర్వహణలో ఐ.సి.ఎ.ఎస్. కీలకపాత్ర పోషించింది.

 

****

 



(Release ID: 1701873) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Hindi , Bengali