అంతరిక్ష విభాగం

అంతరిక్ష రంగంలో సహకారంపై బ్రెజిల్ మంత్రి మార్కస్ పొంటెస్ తో చర్చలు జరిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారత్ :
డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 01 MAR 2021 5:00PM by PIB Hyderabad

అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారతదేశం ఆవిర్భవిస్తుందని కేంద్ర ఈశాన్యప్రాంతాల అభివృద్ధి, సిబ్బంది వ్యవహారాలు,ప్రజాఫిర్యాదులు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ ( స్వతంత) శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. ఈ రోజు డాక్టర్ జితేంద్రసింగ బ్రెజిల్ దేశ శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి మార్కస్ పొంటెస్, ఆ దేశ అంతరిక్ష సంస్థల అధిపతులతో వర్చ్యువల్ విధానంలో చర్చలు జరిపారు. నిన్న బ్రెజిల్  చెందిన ఉపగ్రహం అమజానియా-1ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన నేపథ్యంలో రెండు దేశాలకు చెందిన మంత్రులు సమావేశం అయ్యారు. అంతరిక్ష రంగంలో కుదిరిన అవగాహన వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్న మంత్రి ఇతర దేశాలకు ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంతో ఇస్రో వాణిజ్య విభాగం అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ పని కూడా ప్రారంభం అయ్యిందని మంత్రి అన్నారు. గత అయిదారు సంవత్సరాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ అంతరిక్ష పరిజ్ఞానంతో సహా శాస్త్రీయ అంశాలను వివిధ రంగాలలో అమలు చేయడానికి

ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడపాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి ఈ విధానాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి అన్నారు. రైల్వేలు, వ్యవసాయం, స్మార్ట్ నగరాలు, జాతీయ రహదారులు, రక్షణరంగ అభివృద్ధిలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తున్నదని మంత్రి వివరించారు.

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి స్థానం కల్పించాలన్న ప్రధానమంత్రి నిర్ణయాన్ని ప్రస్తావించిన మంత్రి ప్రజల జీవనస్థితిగతులు,పర్యావరణం, ప్రజా శ్రేయస్సులను మెరుగుపరచడానికి ఇది దోహదపడుతుందని అన్నారు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశం ఆలస్యంగా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిందని మంత్రి అన్నారు. అయితే, ప్రస్తుతం అమెరికాకి చెందిన నాసా లాంటి ప్రముఖ సంస్థలకు మంగళ్ యాన్, చంద్రయాన్ ల ద్వారా సేకరించిన సమాచారాన్ని అందించగల స్థాయికి ఎదిగిందని అన్నారు.

బ్రెజిల్ మంత్రి మార్కస్ పొంటెస్ మాట్లాడుతూ భారత్ బ్రెజిల్ దేశాలు అంతరిక్ష రంగంలో  ప్రారంభించిన జాయింట్ వెంచర్ వల్ల నూతన సంస్థలను ఏర్పాటు చేయడానికి, మరిన్ని ఉపాధి అవకాశాలను అందించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. బ్రెజిల్ దేశంలో ముఖ్యంగా అమెజాన్ ప్రాంతంలో అడవులను నరికివేతకి సంబందించిన సమాచారాన్ని రిమోట్ సెన్సింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, దేశంలో వ్యవసాయ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి  అమజానియా-1 ఉపగ్రహాన్ని ప్రయోగించామని తెలిపారు.

ఉపగ్రహ ప్రయోగం వల్ల వ్యాపార వాణిజ్య అవకాశాలు మెరుగుపడతాయని ఆయన వివరించారు. తమ ప్రయోగాలకు అవసరమైన వస్తువులు, వ్యవస్థలను అందించాలని భారతదేశాన్ని బ్రెజిల్  కోరింది.

అంతరిక్ష పరిశోధనలు,  పరిశోధనల ఫలితాలను  శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించే అంశంపై భారత్ బ్రెజిల్ ప్రభుత్వాలు (2004) రెండు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థల (2002) అవగాహన కుదిరింది. దీనికి అనుగుణంగా 2007లో ఒక జాయింట్ వెంచర్ గ్రూప్ ని ఏర్పాటుచేశారు. 2020 జనవరిలో సమావేశం అయిన ఈ గ్రూప్ రెండు దేశాలు అమలు చేయగల అంతరిక్ష ప్రయోగాలు, ఇస్రోకి చెందిన పిఎస్ 4 ఆర్బిట్ ప్లాటుఫామ్ వినియోగం తదితర అంశాలను చర్చించింది.

 

***



(Release ID: 1701866) Visitor Counter : 147